సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ సంగతులు;-- యామిజాల జగదీశ్
 సెమ్మంగుడి  శ్రీనివాస అయ్యర్ ! ఈయన తమిళనాడుకు చెందిన సుప్రసిద్ధ  శాస్త్రీయ సంగీత విద్వాంసులు. ఈయనను ఆయన విద్యార్థులు "సెమ్మంగుడి మామా" అని ప్రేమతో పలిచేవారు. 
తంజావూరు జిల్లా తిరువిడైమరుదూర్ సమీపంలోని తిరుక్కోడికావలిల్ లో 1908 జూలై 25న జన్మించారు. రాధాకృష్ణ అయ్యర్, ధర్మసంవర్థిని అమ్మాళ్ దంపతుల మూడవ కుమారుడే సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్.
ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు తిరుక్కోడికావల్ కృష్ణన్ గారు ఈయన మేనమామ. నాలుగో ఏట వరకు మేనమామ ఇంటే పెరిగారు. అనంతరం తల్లిదండ్రుల స్వస్థలం సెమ్మంగుడి (తిరువారూర్ జిల్లా) కి వెళ్ళారు.
పెదనాన్న  కుమారుడు సెమ్మంగుడి నారాయణ స్వామి దగ్గర ఎనిమిదో ఏట సంగీతాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. అనంతరం తిరువిడైమరుదూర్ సహారామారావు, ఉమయాళ్ పురం స్వామినాథ అయ్యర్ దగ్గరకూడా సంగీతం నేర్చుకున్నారు. అలాగే మహారాజపురం విశ్వనాథ అయ్యర్ దగ్గరకూడా సంగీతం నేర్చుకున్నారు.
ఆయనను ఖరహరప్రియ శ్రీనివాస అయ్యర్ గానూ పిలిచేవారున్నారు. ఆయనకు ఈ రాగమంటే మహా ప్రియం. ఖరహరప్రియ రాగంలోనే కాక కళ్యాణి, కాంభోజి, ఆరభిలోనూ ఆయన కీర్తనలు ఆలపిస్తుండేవారు.
1924 లో ఓరోజు సహరామారావుగారు ఈయన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు ఈయన పాడుతుండటం విని తన వద్దకు పంపితే సంగీతం నేర్పిస్తానని సెమ్మంగుడి మాతృమూర్తిని అడిగారు. అందుకు ఆమె సమ్మతించడంతో సెమ్మంగుడి ఆ క్షణం నుంచి సహరామారావు శిష్యుడిగా సంగీతంలో ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. ఇది సెమ్మంగుడి సంగీత పయనంలో ఓ గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు.
1926లో కుంభకోణంలో మొదటిసారిగా కచేరీ చేసిన సెమ్మంగుడి 1927లో మద్రాసులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహానాడులో పాడినప్పుడు అందరి దృష్టిని ఆకర్షించారు.
తిరువనంతపురంలోని స్వాతితిరునాళ్ కళాశాల ప్రిన్సిపాల్ గా 23 ఏళ్ళు ఉండిన సెమ్మంగుడి అనంతరం ఆలిండియా రేడియో మద్రాస్ కర్నాటక సంగీత విభాగానికి అధిపతిగా 1957 నుంచి 1960 వరకూ కొనసాగారు. ఆ తర్వాత వేదికలపై పాడటం, యువ కళాకారులకు సంగీతం నేర్పిస్తూ వచ్చిన సెమ్మంగుడి 92వ ఏట వరకు వేదికలపై పాడుతూ వచ్చారు.
ప్రతిష్ఠాత్మక సంగీత కళానిధి అవార్డుని 1947లో  సెమ్మంగుడి పొందిన ఓ ఏడాది క్రితమే ఆయన గురువైన మహారాజపురం విశ్వనాథ అయ్యరుకి లభించింది. మ్యూజిక్ అకాడమీ, చెన్నై సంగీత నాటక అకాడమీ అవార్డు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలా ఆయన పొందిన అవార్డులూ రివార్డులూ అనేకానేకం
ఆయన రోజూ కనీసం ఎనిమిది గంటలపాటు సంగీత సాధన చేసేవారు 
యువప్రాయంలో అనుకోని విధంగా ఆయన పాడలేకపోయారు. ఆయన కంఠం దెబ్బతింది. అప్పుడు ఓ కంజీరా విద్వాంసుడు సెమ్మంగుడి గురించి మాట్లాడుతూ ఆయన పాడటం మానేసి వయోలిన్ వాయిస్తే సరిపోతుందన్నారు. కానీ ఆయనకు పాడటం మీదున్న మక్కువ మరిదేనిపైనా లేదు.అందుకే ఎవరేం చెప్పినా సంగీత సాధన మానకుండా అనతికాలంలోనే తనదైన శైలిలో మళ్ళీ వేదికలెక్కి కచేరీలివ్వడం కొనసాగించారు.
ఓ గాయకుడిగా శాస్త్రీయ సంగీత విద్వాంసుడిగా మన్ననలు అందుకున్న సెమ్మంగుడికున్న పట్టుదలను గ్రహించి తిరువాంకూర. మహారాణి సేతు పార్వతీ బాయి తిరువనంతపురం వచ్చి స్వాతి తిరునాళ్ కీర్తనలను ఓ క్రమపద్ధతిలో సేకరించి  దిశలా వ్యాప్తి చెందేలా చూసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. అంతేకాకుండా తిరువాంకూర్  సంస్థాన విద్వాంసుడిగా ఆయనను నియమించారు.
తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతియార్ పాటలను వేదికలపై పాడుతూ వాటికి తనవంతు ప్రాచుర్యం తీసుకొచ్చిన సెమ్మంగుడి రాట్నంపై నూలు వడికి ఖద్దర్ వస్త్రాలు ధరించిన రోజులున్నాయి.
1928లో తిరువయ్యార్ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో సెమ్మంగుడి పాడేందుకు గోవిందస్వామి పిళ్ళై ఆహ్వానించారు. తిరువయ్యారులో పాడటం తన అదృష్టమని సెమ్మంగుడి అంటుండేవారు.
1997లో త్యాగబ్రహ్మ సభాలో ఆయన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో కలిసి 
కచ్చేరీ చేయడం విశేషం. 
గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి కలిగిన సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ 2003లో అక్టోబర్ 31 తన 95వ ఏట కాలధర్మం చెందారు.


కామెంట్‌లు