*మొహమాటం తెచ్చిన తిప్పలు....18 వ కథ*;(కథా మణి పూసలు*) --బొమ్ము విమలమల్కాజ్ గిరి,,,9989785161
పేర్వారమ్ము దంపతులు
ఆదర్శమగు దంపతులు
ఒకరి మనసునొకరెరిగి
గుట్టుగ బ్రతికెడి వారలు

కిరాణకొట్టు పెట్టుకొని
కష్టము వారు నమ్ముకుని
పొట్ట తిప్పలు కోసము
నడిపె వారు ఆ కొట్టుని

వీరి కొట్టు ముందునున్న
ఇంటి ప్రక్క సందులున్న
రవి అద్దెకు దిగినాడు...
రమ దూరపుబంధువన్న

రోజు వచ్చెడి వాడును
కబుర్లెన్నో చెప్పును
పేర్వారంతో చనువుగ
రవియె మెలిగెడి వాడును

పెండ్లిలోన పెట్టినట్టి
మెడమీదను మెరిసెటట్టి
బంగారపు గొలుసును...
రవి చూసెను దృష్టిపెట్టి

మాటకారి యైన రవి
విచిత్రమగు వింతలవి
పేర్వారం మదిలోన...
నమ్మికనె కలిగించేవి

మా మరుదలు పెళ్ళి ఉంది
తప్పక వెల్లాల్సి ఉంది
చేతిలోన చిల్లిగవ్వ...
లేకుండా పోయినాది

అంటూ విలపించినాడు
బాధను చెప్పుకున్నాడు
నేస్తమా నీవేనూ.....
సాయపడాలి అన్నాడు

గిరాకి అవడం లేదు
డబ్బు రావడం లేదు
పేర్వారం చెప్పినాడు
నేనివ్వ వీలుకాదు

అని అతడు చెప్పగానె
రవి అందుకునె వెంటనె
నీ మెడలో నున్న గొలుసు
నాకిప్పుడు ఇవ్వుమనె

దాన్ని కుదువ పెడతాను
డబ్బులనే తెస్తాను
పెళ్ళి అయిపోగానే...
మళ్ళీ తెచ్చిస్తాను

అని నమ్మించినాడు
మనసునె గెలిచినాడు
ఆపదన ఆదుకోమంటు
తెలివిగ వేడినాడు

మొహమాటపు పేర్వారము
చెప్పకనె సమాదానము
మౌనంగ తీసిచ్చాడు...
మెడలోనున్నా హారము

హారము తీసుకున్నాడు
కృతజ్ఞతలు చెప్పినాడు
సంతసంతో రవి పోయి
భార్యతోన చెప్పినాడు

ఎందుకండి పరులసొమ్ము
ఉన్నదాంట్ల సర్దుకొమ్ము
పరుల సొమ్ము తీసుకొన్న
పాట్లెన్నో వచ్చునమ్ము

అని భార్య చెప్పగాను
చూసే కోపంతోను
నేనే తీరుస్తా కద...
నీకేమి బెంగ అనెను

ఏది చెప్పినా వినడు
మాటె పట్టించుకోడు
అని బాధ పడుతు కోమలి
నోరు మూసుకొని ఉండు

గొలుసు కుదువ పెట్టినాడు
డబ్బులనే తెచ్చినాడు
ఇంటికి పెద్దళ్ళుడనుచు
డాంబికమును చూపినాడు

పెళ్ళీ అయిపోయినాది
రెండు నెల్లు గడిచినాది
రవి కోసం ఎదురు చూసి
మనసు కలత చెందినాది

రవి ఇంటికి వెళ్ళినాడు
హారం ఇమ్మనడిగాడు
పేర్వారం కోపంతో.....
రవి వంక చూసినాడు

పనులు దొరకడం లేదు
డబ్బు రావడం లేదు
అందుకే ఇవ్వడము...
నాకు వీలు పడుట లేదు

అనుచు రవియె చెప్పినాడు
సమాదాన పరిచినాడు
వారం రోజులలో......
తెచ్చి ఇస్తానన్నాడు

సరే అని అన్నాడు
ఇంటికి చేరినాడు
భార్య రమ చెంత చేరి
విషయాన్ని తెలిపాడు

అంత్య నిష్టూరం కన్న
ఆది నిష్టూరం మిన్న
లోకోక్తి గూర్చి ఎప్పుడు
చెప్పి నేను మొత్తుకున్న

నా మాటలు వినరు మీరు
మొహమాటమే పడుతారు
ప్రేమతో నాన్న వేసిన.......
గొలుసు తీసి ఇచ్చినారు

అనుచు ఆమె బాధపడెను
దుఃఖమునే దిగమింగెను
చేసేదేమి లేక రమ.......
భర్తదె తప్పని తెలిపెను


ఆ దంపతులు ఇద్దరు
రవి చెంత చేరి నారు
గడువు  గడిసి పోయే
హారమును అడిగినారు

రవి చేతులెత్తేసాడు
నావల్ల కాదన్నాడు
కొట్టులోన పనులు చేసి
బాకి తీర్చ బూనినాడు

ఆ దంపతులు ఇద్దరు
చేసేది లేక వారు
సరేననుచు తప్పక
పనిన పెట్టుకున్నారు

నీతి
ఉన్నంతలో ఉండాలి
సంతోసంగా బ్రతకాలి
పరుల సొమ్ముకాశపడి
కాజేయుటను మానాలి

గొప్పలకు పోకూడదు
అప్పులను చేయరాదు
కోరి ముప్పు తెచ్చుకోని
తిప్పలును పడకూడదు 

మొహమాటం పడవద్దు
మోసం తెచ్చుకోవద్దు
ఉన్నదంతా పోయాక...
నిష్టూరం పొందవద్దు


కామెంట్‌లు