|| ఎంత తియ్యని అనుబంధం ||;-©️మచ్చరాజమౌళి దుబ్బాక 9059637442
తుదిఝాము పరవశము చెందుతుంది
తొలిఝాముకు పులకించిన 
తొలకరి పుష్పం మురిసిపోతుంటే

గడిచిన పొద్దులో
సర్దుబాటుగాని  మరకలు
సంకీర్తనలై పాడుతుంటే
ముసి నవ్వుల పసిపాప మోముచూసి
అదృశ్యమై అవి అంతరించిపోతాయి

భావాలకతీతమైనది
భాషకందని సంభాషణ ఇరువురిదీ
కంటిచూపు పలకరింపులో
మది తలపుల దాగిన తపనలెన్నో

చిట్టికన్నా...చిరునవ్వుల నాన్నా 
ముడతలు పడిన ఈ దేహానికి 
ముసురుకున్న గాయాలకు
ఊరడింపుగా నీ నవ్వే ఒక ఔషధమయ్యింది

ఆత్మ బంధమై అల్లుకొన్న 
అనురాగపు కొమ్మవు
నీ నవ్వుల చల్లదనంలో
పున్నమి వెన్నెలంత చిన్నబోవు.. 

____


కామెంట్‌లు