సేవ;-....కనుమ ఎల్లారెడ్డి;-93915 23027
 .విపరీతమైన చలి కిటికీ తలుపులు మూసి అమ్మ తెచ్చిన రగ్గు(దుప్పటి)కప్పుకున్నాడు రాము. అక్కడికి గజ గజ వణుకుతూ ముడుచుకుని పడుకున్నాడే కానీ తన ఇంటి కి కొద్ది దూరంలో ఓ చెట్టు కింద ఎవరూ లేని ముదుసలి ఈ చలిలో ఎలా వుందో పాపం అనుకుని వెంటనే లేచి కిటికీ తెరచి చూశాడు.
ఆ అవ్వ చలికి వణుకుతూ చాలి చాలని దుప్పటి కప్పుకుని ముడుచుకుని పడుకుంది.
దుప్పటి అక్కడక్కడా రంధ్రాలు పడి ఉన్నాయి.అవ్వ వణికిపోతోంది. అది చూసి జాలి కలిగింది రాముకు.ఇంత చలిలో ఎలా ఉంటుందో పాపం అనుకుని అవ్వను గురించి ఆలోచిస్తూ ఎప్పటికో  నిద్రపోయాడు.
మరుసటి రోజు తన హుండీ పగుల కొట్టి  డబ్బు తీసి లెక్క పెట్టాడు. ఓ వెయ్యి రూపాయల వరకు ఉంది.వెంటనే ఆ డబ్బు తీసుకుని ఓ మెత్తటి దుప్పటి కొన్నాడు.అది తీసుకు వచ్చి అవ్వకు కప్పాడు. ఆ అవ్వ కళ్ళల్లో ఆనందబాష్పాలు రాలాయి. " చల్లగా ఉండు నాయన" అని దీవించింది. ఇంట్లో హుండీ పగిలి పోయి ఉండటంతో రాము తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఏవో మాటలు వినిపిస్తుంటే కిటికీ లోంచి తొంగి చూశారు .
"అవ్వ ఈరోజు నుంచి నీకు చలి ఉండదు.చక్కగా కప్పుకుని నిద్రపో " అన్నాడు.ఆ మాటకు అవ్వ నవ్వింది. అది చూసి రాము తల్లిదండ్రులు చిన్న వయసులోనే వాడు చేసిన సేవ, మంచి పని చూసి సంతోషించారు.

కామెంట్‌లు