పిల్లల కథ:పెద్ద రామచిలక; -..కనుమ ఎల్లారెడ్డి 93915 23027.

 ఓ చెట్టుపై ఎప్పటినుంచో పెద్ద ముసలి రామ చిలక నివాసం ఉంటోంది. వృద్ధాప్యంలో ఉన్నా చక్కటి ఆరోగ్యంగా ఉంది.దాని ముందు ఎన్నో చిలకలు రాలి పోయాయి. అది ఎవరితోను ఎక్కువగా మాట్లాడేది కాదు.తోటి చిలకలు పలకరిస్తే పలుకుతుంది. తన ముందు ఎన్నో చిలకలు కాలం చేశాయి.అది మాత్రం ఆరోగ్యం గా ఉంది.ఆ విషయమే అడిగాయి తోటి చిలకలు." నువ్వు మా అందరి కంటే పెద్దవాడివి.నీ ముందు ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి నీ ఆరోగ్య రహస్యం ఏమిటి"?అని ప్రశ్నించాయి.దానికి అది కిల..కిల నవ్వి ఊరుకుంది. "చెప్పవా " అని బతిమిలాడాయి." అయితే నేను చెప్పినట్లు చేస్తారా" అంది.ఆ మాటకు అన్ని తలలు ఆడించాయి. పెద్ద రామ చిలక ఇలా చెప్పింది.
" మిమ్మల్ని  చాలా గమనిస్తున్నాను. మీరందరు మితిమీరిన ఆహారం తీసుకుంటున్నారు.తోటల్లో కొరికే జామ పండ్లు కాకుండా ఈ చెట్టు పైకి వచ్చి అల్లరి చేస్తూ అవురావురు మంటూ తిని గుర్రుమని
నిద్రపోతున్నారు. మీకు శరీరం బాగా బడలికై వ్యాయామం లేక లావుగా తయారైనారు. మళ్ళీ ప్రొద్దున్నే  వెళ్ళి ఆ జామ తోటలో పడి ఆ రైతుకు నష్టం కలిగిస్తూ,మీరు నష్ట పడుతూ  అనారోగ్యం పాలు అవుతున్నారు.మీ  మిత్రులు వ్యాయామం లేకే చనిపోయారు మరి.తిని కునుకు తీస్తే స్థూలకాయం రాక  ఏమవుతారు?మీరందరూ అలానే ఉన్నారు. పైగా మీకు మాటలు ఎక్కువ.ఉట్టి అరుపులు తప్పా మరేమీ ఉండదు.ఇదంతా ఆరోగ్యం మీద పడుతుంది. నన్ను చూడండి నేను మితంగా మాట్లాడతా,మితంగా తింటాను.ఒకటి రెండు సార్లు అలా రెక్కలు విదిల్చి కాసేపు ఆకాశంలోకి ఎగిరి ప్రకృతిని  ఆస్వాదిస్తాను.రాత్రి కాసిన్ని గింజలు, మంచి నీళ్ళు తాగి కునుకు తీస్తాను అంతే " అంది.
ఆ మాటలు విన్న మిగతా చిలకలు పెద్ద రామ చిలక మాటలు విని ఎక్కువ కాలం జీవించాయి.
.....

కామెంట్‌లు