జింకల వనం;-యు.విజయశేఖర రెడ్డి,హైదరాబాద్,9959736475

 ఉదయగిరిని పాలించే చంద్రసేనుడు తన పట్టపు రాణితో జింకల వనానికి రథంపై వెళ్ళాడు. అక్కడ మహారాణికి కొద్ది దూరంలో ఒక అందమైన జింక గెంతుతూ కనిపించింది.  “మహారాజా! నాకు ఆ జింక కావాలి... దానిని బంధించి మన ఉద్యానవనంలో పెంచుకుందాము” అని అంది.
రాజుకు జింకను వేటాడడం చాలా కష్టమయ్యింది. చేసేది లేక బాణంతో జింక కాలికి తగిలేల కొట్టాడు.జింక పరుగెత్తలేక నేల పైన పడిపోయింది.తోటి జింకలు ఆ గాయపడిన జింక చుట్టూ చేరాయి. రాజు,రాణి రథం దిగి ఆ జింక వద్దకు చేరుకునే లోగా మనుషుల అలికిడి విన్న తోటి జింకలు భయంతో పరుగు తీసాయి.కానీ దాని బిడ్డ కన్నీరుతో అమ్మ వద్దే ఉండిపోయింది. 
“ఎవరో దయ లేకుండా నిన్ను  గాయపరచారు అమ్మా!” అని కన్నీరు మున్నీరు అయ్యింది పిల్ల జింక. ”ఎవరైతే ఏంటి వారు వచ్చి బంధించే లోగా నువ్వు చివరి సారిగా నా పాలు తాగు” అని ఎంతో ప్రేమగా అంది తల్లి జింక.
ఆ దృశ్యం చూసిన రాజుకు,రాణికి కూడా కన్నీళ్లు వచ్చాయి. “నిన్ను గాయపరిచింది నేనే... నన్ను క్షమించు నిన్ను మా కోటకు తీసుకెళ్లి మంచి చికిత్స చేయిస్తాను” అని గాయపడ్డ జింకను రెండు చేతులలో ఎత్తుకుని రథంలో పడుకోబెట్టాడు రాజు. బిడ్డ జింకను రాణి ఎత్తుకుని రథంలోకి  చేర్చింది. 
కోటకు వెళ్ళాక ఆస్థాన వైద్యుడు జింకకు చికిత్స చేసి “ఏమీ ప్రమాదం లేదు మహారాజా! జింక వారం రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది” అన్నాడు.  
ఆ వనంలో ఎన్నో సాధు జంతువులు ఉన్నా పిల్ల జింక మాత్రం తల్లిని వదలి పోలేదు. ఒక వారానికి జింకకు కాలి గాయం పూర్తిగా నయమయ్యింది. 
రాజు,రాణి వచ్చి “నువ్వు నీ బిడ్డతో పాటు ఇక్కడే ఉండిపోతావా?” అన్నాడు రాజు. “లేదు మహారాజా! ఇక్కడ  మాకు స్వేచ్చ ఉండదు...మమ్మల్ని ఆ జింకల వనంలోనే వదలి వేయండి” అంది దీనంగా .
“అవును మీరు స్వేచ్చా జీవులు మీ ఇద్దరినీ ఆ వనంలోనే వదులుతాను పదండి” అని భటులతో జింకను,పిల్ల  జింకను రథంలో ఎక్కించి ఆ వనంలో వదిలి “ఇంకెప్పుడూ మీ జింకలను వేటాడను” అని అన్నాడు రాజు. తమ నేస్తం బిడ్డతో సహా సురక్షితంగా తిరిగి వచ్చిందని తోటి జింకలు ఎంతో సంతోషించాయి. 
రాజు కూడా ఎంతో అందించాడు. 
***
కామెంట్‌లు