ఆయువు పోసిన కాటి కాపలి..కథా మణి పూసలు..---బొమ్ము విమలమల్కాజ్ గిరి,,,9989775161
రామాపురం ఊరిలోను
రవియనే ధనికుడుండెను
లేక లేక నొక కొడుకు... 
చాల రోజులకు పుట్టెను 

నవీను అనే పేరును
నామకరణం చేసెను
గారాబం చేసినచో...
పాడవుతాడనుకొనెను

భయముతోన పెంచెను
భక్తితోన పెంచెను
బంగారు భవితనెంచి
జాగ్రత్త వహించెను 

అయినా పిల్లవాడు
తోటి బాలలతోడు
చేరి బీడీల్తాగడం...
అలవాటు పడినాడు 

ఒకానొకా రోజునందు
ఎవరులేని సమయమందు
బీడీలను తాగూతూ.......
నిలబడెనో మూలయందు 

వాళ్ళ నాన్న వచ్చినాడు
నవీను అది చూసినాడు
భయంతో వణికిపోతూ...
పొగనే మింగేసినాడు 

తండ్రి ముందు వదులలేక
చేసేదేమియును లేక
పొగను బిగబట్టినాడు...
జరిగే ఆపద తెలియక 

ఆయాసంతో బాలుడు
ప్రాణాలను వదిలినాడు
అనుకోని మరణానికి....
రవెంతో రోధించాడు 

మెడలో నున్న దండను
చేతికున్న రింగులను
పాడే కట్టే సమయాన
జంగమయ్యా తీసెను 

చిటికనేలుకు ఉన్నట్టి
బంగారపు రింగుపట్టి
తీయుటకు పోగాను...
రాలేదు బిగువుగ పట్టి 

తండ్రితల్లడిల్లెను
వదిలివేయండనెను
ఉంగరాని దేముంది
కొడుకె పోయిండనెను 

తండ్రి పడె బాధ చూసి
సరేననుచు వదిలేసి
అర్ధరాత్రి సమయమందు
వచ్చిరి ఖననం చేసి 

మరునాడు అర్ధరాత్రిన
నిద్రించిన సమయమ్మున
కాటి కాపలి వాడు.....
వెల్లినాడు తా మెల్లన 

గుంతనే తవ్వినాడు
పిల్లవాణ్ణి తీసాడు
చేతికున్న ఉంగరాన్ని
గట్టిగా లాగినాడు 

గుండె మీద కాళ్ళు పెట్టి
గట్టిగాను అణగ బట్టి
ఉంగరాన్ని తీసాడు....
బలమునంత అదిమి పెట్టి

పిల్లవాడు కదిలినాడు
పొగనంత వదిలినాడు
మెల్లగా కళ్ళు తెరిచి...
ఎగాదిగా చూసినాడు 

 ఒక పక్కన  భయముతోని
మరోపక్క ధీమతోని
నవీన్ ముఖం చూసాడు..
కాటి  ఆశ్చర్యంతోని 

కాటి కాపలి వాడు
నవీన్ ని లేపినాడు
భుజం నందు వేసుకోని
రవి చెంత దింపాడు 

తండ్రి సంతసించాడు
కొడుకునత్తుకున్నాడు
కాటి కాపలి వాడిని
బాగానె పొగిడినాడు 

ధనం దండిగ ఇచ్చాడు
సన్మానం చేసినాడు
ఊరందరు కాపరిని....
వేనోళ్ళను పొగిడినారు 

దొంగ బుద్ధి మానినాడు
గౌరవాన్ని తలచి నాడు
కాటి కాపలి పనిని......
 శ్రద్ధగాను చేసినాడు.  


కామెంట్‌లు