గొప్పలు-తిప్పలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 గొప్పకి పోతే తిప్పలు తప్పవు. మనం ఎలాఉండాలో అలాగే  అణగి మణిగి ఉండాలి. ఇంకోరిని చూసి అనుకరించి డాంబికాలకు పోతే మనకే కష్టం  నష్టం!పొట్టేలు కొండను ఢీకొడితే దాని తల పుచ్చకాయలా బద్దలు అవుతుంది. మనస్థాయి అర్హత కి తగినట్టుగా ఉంటే మంచిది. ఒక రైతు దగ్గర ఎడ్లజత బండి ఉన్నాయి. బండి లో సరుకులేసుకుని బస్తీకెళ్లి అమ్ముకుని వచ్చేవాడు. వేరేవారి సరుకులు మనుషులను కూడా  తన బండీలోనే అవసరమైనప్పుడు  రోజంతా  అటుఇటు చేరవేసేవాడు.వారానికి మూడు రోజులు బండీని ఇలా బాడుగ కి తిప్పేవాడు.అది మంచి ఎండాకాలం! ఆఊరికుక్క ఒకటి ఈబండీని అనుసరించింది.ఉదయం చల్లగా బానే ఉంది. కుక్క హాయిగా ఉషారుగా  ఎడ్లబండి పక్కనే నడిచింది.కానీ ఎండ సుర్ సుర్ అంటూనెత్తి మాడుస్తూ ఉంటే అంతదూరం నడక అలవాటు లేని కుక్క  ఆపసోపాలు పడసాగింది.బండి కిందకి చేరి ఆనీడలో నడుస్తూ ఇలా అనుకోసాగింది" అబ్బ!నేను ఎంత గొప్ప దాన్ని! ఆఎడ్లు బరువు మోస్తూ బండీని లాగుతూ ఎండలో నడుస్తున్నాయి.నేను హాయిగా నీడలో చల్లగా నడుస్తున్నా.నిజానికి ఈబండీబరువుని నేనే మోస్తున్నాను."అనుకోసాగింది.బండి అడుగు న  మధ్యలో ఉన్న దాని భావంఅది.రైతు ఎడ్లతో"ఏహే!టుర్ టుర్!పరుగులు తీయండి. దాణా కుడితి తిన్నారు కదా? పట్నంల పచ్చిగడ్డి తినిపిస్తా.కూరగాయల చోట క్యాబేజీ కాలీఫ్లవర్ ఆకులు తినిపిస్తా" అని బుజ్జగిస్తుంటే ఎద్దులు పరుగెత్తసాగాయి.రైతు  తననే పొగుడుతున్నాడు అనే భావం కుక్కకి కలిగింది. "నేను మధ్యలో నడుస్తూ బండీ మోస్తున్నాను కాబట్టే ఎడ్లు ఉషారుగా బండీ లాగగలుగుతున్నాయి"అని ఉబ్బి తబ్బిబ్బు ఐపోయింది.ఎదురుగా ఒక లారీ వస్తోంది. "ఓహ్!దాని కిందనించి పరుగెత్తితే ఇంకా వేగంగా వెళ్లగలను"అనే పిచ్చి ఊహతో బండి కిందనించి బైటికొచ్చి  ఎదురుగా వస్తున్న లారీకింద దూరబోయి దాని ముందు చక్రంకింద పడి నుజ్జు నుజ్జు ఐంది.అనవసరంగా ప్రాణం పోగొట్టుకున్నది.నిదానం ప్ర ధానం.పరుగెత్తి పాలు తాగేకన్న నిలబడి నీరు తాగటం మంచిది. సమయం ఎప్పుడూ మనచేతిలో ఉండదు సుమా!
కామెంట్‌లు