నిజమైన మిత్రులు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. అందుకే బడి కాలేజ్ లో మంచి స్నేహితులతో పరిచయం చేసుకోవాలి. ఆబుల్లి కుందేలు కుక్క పిల్లలను చిన్నారి రోహిత్  మహాముద్దుగా పెంచుతున్నాడు.అవికూడా వాడు పెట్టే ఆహారం ప్రేమ లాలనలో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి.కలిసి పొరపొచ్చాలు లేకుండా ఆడేవి.రోహిత్ బంతి విసిరితే టామీ పట్టుకొచ్చి కుందేలు తోక లాగేది.కుందేలు దాని వీపుపై ఎగిరి కూచునేది.ఒక రోజు టామీ చెట్టుకింద పడుకుంది. ఓకాకి వచ్చి "ఏయ్ టామీ!ఏమిటా మొద్దునిద్ర! అక్కడ రోహిత్ ఆకుందేలుని తన ఒళ్ళో కూచోపెట్టుకుని ఎంచక్కా కారెట్ తినిపిస్తున్నాడు.నీమొహాన పాలన్నం బ్రెడ్ బిస్కెట్టు పడేస్తాడు." "ఎవరితిండివారిదే! నీకెందుకు అంత అసూయ!? " అని తరిమేసింది టామీ! ఆమరునాడు కూడా కాకి ఎగురుతూ వచ్చి అంది"ఏయ్ టామీ! ఆకుందేలు ఎంచక్కా రోహిత్ గదిలో బొమ్మలతో ఆడుతూ ఎగుర్తోంది.బన్నీ బున్నీ అంటూ ముద్దు చేస్తున్నాడు.తెల్లగా ముద్దు ముద్దుగా బొద్దుగా ఎంత బాగుందో అంటూ ఒళ్ళో కూచోపెట్టుకుని నిమురుతున్నాడు."అంటూ అసూయ అనే నిప్పు రాజేసింది."అబ్బబ్బ!ఏమిటేకాకీ నీగోల!? నేను ఎక్కడకెళ్లినా త్వరగా ఇల్లు చేరుతానని రోహిత్ కి నాపై నమ్మకం! కుందేలు కనుక పొరపాటుబైటికి వెళ్లితే
దాన్ని ఎవరైనా ఎత్తుకు పోవచ్చు. ఏజంతువైనా చంపి తినవచ్చు. అది ఇల్లు చేయలేక పోవచ్చు." "అలాగా !ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడు.దాన్ని భలే ముద్దుచేస్తూ నెత్తి కెక్కించుకుంటున్నాడు.నీఖర్మ! నీవిలా రోడ్డు పై దొర్లాలి"రెచ్చగొట్టడంలో కాకిదే గెలుపు!టామీకి  కసి ఉక్రోషం పెరిగిపోయింది. నిజంగా నే రోహిత్ దాన్ని బాగా ముద్దు చేయటం చూసి అసూయ కలిగింది. అవకాశం కోసం ఎదురు చూడసాగింది. ఆరోజు ఒంటరిగా ఉన్న కుందేలుని గట్టిగా పట్టుకుంది. "అన్నా!విడు నెప్పిగా ఉంది "విలవిల్లాడుతోంది కుందేలు. "ఉహు!నీపీక పిసికేస్తా"కసిగా అంది టామీ! అంతే!ప్రాణరక్షణకై కుందేలు గట్టిగా దాని మూతిని అందినచోటుఅంతా కొరికింది.అంతే  కుక్క మూతినుండి రక్తం కారటంతోచూసి భయం ఖంగారు తో రోహిత్ దగ్గరకు పరుగు పెట్టి జరిగినదంతా చెప్పింది.కుయ్ కుయ్ మంటూ రోహిత్ దగ్గరకు వచ్చింది టామీ. వెంటనే దానిమూతిని తడిబట్టతో తుడిచి "నాన్నా!టామీకి  ఇంజక్షన్ ఇప్పించాలి" అని గోల పెట్టాడు. నాన్నతో స్కూటర్ ఎక్కాడు టామీని ఒళ్ళో కూచోపెట్టుకుని. టామీకి ఓపిక  వచ్చి  కోలుకొనేదాకా దానికి బ్రెడ్ పాలు తినిపించటం     మందులేయటంతో టామీ త్వరగా కోలుకుంది. కుందేలు పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ టామీతో కబుర్లు చెప్పుతూ అది కోలుకొనేదాకా  దానికి తోడు నీడగా ఉండేది. రోహిత్ టామీని ఒళ్ళో కూచోపెట్టుకుని నిమురుతుంటే  విప్పారిన కళ్లతో టామీని నవ్వించే విన్యాసాలు చేసేది.దొర్లు పుచ్చకాయలా కుందేలు పల్టీలు కొడుతుంటే టామీకి అర్ధమైంది నిజమైన మిత్రుడు ఎవరో!కాకి కుళ్ళు బుద్ధి తెలిసింది.
కామెంట్‌లు