సిద్ధార్థ ఆధ్యాత్మిక ప్రయాణం;-- యామిజాల జగదీశ్
 నాకు ఫేస్ బుక్ వల్ల పరిచయమైన కొందరు మిత్రులలో ప్రసాదరావు గారొకరు. ఆయన ఇంటి పేరు నాకు తెలీదు. కానీ ఆయన మదనపల్లిలో ఉండటం వల్ల నేను ఆయన పేరుని "మదనపల్లి ప్రసాద్" గానే ఫోన్లో ఫీడ్ చేసుకున్నాను.
రెండు మూడుసార్లు ఫోన్లో మాట్లాడుకున్నాం.  మదనపల్లికి రండి అని పిలిచారు కూడా. తమ ఆతిథ్యం స్వీకరించమని చెప్పారు. ఎప్పుడొస్తారో చెప్పండి అన్నారు. ఆయన పిలుపులో ఆప్యాయత ఉంది. మాటలో అభిమానం ఉంది.
ఓరోజు ఆయన ఓ పుస్తకం కవర్ పేజీ ఫోటో తీసి వాట్సప్ లో పంపారు. అది సిద్ధార్థ అనే నవల. చదవలేదన్నాను. మంచి పుస్తకమండీ అంటూ చదవమని పంపారు. 
అరవై ఏడేళ్ళ క్రితం జర్మనీకి చెందిన హెర్మన్ హెస్సే రాసిన ఈ పుస్తకానికి నోబెల్ బహుమతి లభించింది. ఆయన తండ్రి మతప్రవక్త. తన కొడుకుని కూడా ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడానికి మతసంబంధమైన ఓ కళాశాలలో ప్రవేశపెడతారు. కానీ హెస్సే దాని పట్ల మొగ్గుచూపక ఉద్యోగంలో చేరుతాడు. గడియారాలు మరమ్మతు చేసే షాపులోనూ, పుస్తకాలమ్మే షాపులోనూ పని చేస్తారు. 1904లో నుంచి స్వేచ్ఛగా రచనలు చేయడానికి పూనుకుంటారు. భారత దేశానికి వచ్చి సిద్ధార్థ గురించి అధ్యయనం చేసి ఓ పుస్తకం రాశారు. ఆయన రచనలలో ఇది తొమ్మిదో నవల. ఆయనకు ఈ నవల మంచి పేరు తెచ్చిపెట్టటమే కాక నోబుల్ పురస్కారం అందించింది.
జర్మన్ బాషలో ఉన్న ఈ నవలను హిల్డా రోస్నర్ ఇంగ్లీషులోకి అనువదించారు. దీనిని ఆధారం చేసుకుని బహుభాషా పండితులైన బెల్లంకొండ రాఘవరావుగారు తెలుగులో రాశారు.
ఈ పుస్తకంలోని ఇతివృత్తం గౌతమ బుద్ధుని కాలంనాటిది. అయితే ఈ నవలలోని కథానాయకుడు గౌతమ బుద్ధుడు కాడు. సిద్ధార్థుడనే బ్రాహ్మణయువకుడు కథానాయకుడు. శ్రమణులతో కలిసి యోగసాధనలను అభ్యసిస్తాడు. కానీ అవేవీ లాభించవు. గౌతమ బుద్ధుని దర్శించి ఆయన బోధలు వింటాడు. కానీ తృప్తి కలగదు. సంసారంలో దిగి ఒక వేశ్యతో అన్ని భోగాలు అనుభవిస్తాడు. ధనం ఆర్జిస్తాడు. జూదానికి, తాగుడికి ధనాన్ని ఖర్చుచేస్తాడు.  కాలక్రమంలో సంసార సుఖాలపై రోత పుట్టి  అన్నీ విడిచి ఒక పల్లెటూరి మహిళతో సహవాసం చేస్తాడు. చివరికి ఆమె వల్ల, ఓ నది వల్ల పరమార్థాన్ని తెలుసుకుంటాడు సిద్ధార్థుడు. జీవితంలో ప్రతిక్షణమూ ఏకత్వాన్ని దర్శించడమే జ్ఞానం. జ్ఞానం ఒకరివల్ల నేర్చుకునేది కాదు. ఎవరికి వారు అనుభవపూర్వకంగా గ్రహించాలన్న ఇతివృత్తంతో సాగి గొప్ప తత్వాన్ని తెలియజేసేదే సిద్ధార్థ. బెల్లంకొంవారి శైలి ఎంతో సాఫీగా ఉంది. సిద్ధార్థుడి ఆధ్యాత్మిక  ప్రయాణాన్ని చదువుతుంటే ఇందులోని పాత్రలన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నట్లన్పించాయి. ఇంకా చెప్పాలంటే ఓ దృశ్యకావ్యంలా అనిపించింది. అనువాదంలా లేదీ పుస్తకం. చిన్న పుస్తకమే అయితేనేం.... ఒకటికి రెండు సార్లు చదివింపచేసిన సిద్ధార్థుడి వల్ల మరెన్నో విషయాలు తెలుసుకోగ లిగాను. 
మూల రచయిత హెస్సే రాసిన నవలలో  రెండు భాగాలున్నాయి. హెస్సే మొదటి భాగాన్ని రోమైన్ రోలాండ్ కి, రెండో భాగాన్ని తన బంధువు విల్హెల్మ్ గుండర్ట్‌కు అంకితం చేశారు.
సిద్ధార్థ అనేది రెండు పదాలతో కలయిక..   సిద్ధ, అర్థ. ఈ కథంతా ప్రాచీన భారతీయ రాజ్యమైన కపిలవస్తులో జరిగినది. ఈ కథలో ప్రధాన పాత్రలు సిద్ధార్థ, కమల, గోవిందుడు.
ఈ నవల సినిమాగా కూడా వచ్చింది.
కాన్రాడ్ రూక్స్ దర్శకత్వంలో శశికపూర్ కథానాయకుడిగా సిద్ధార్థ పేరుతో 1972లో ఈ సినిమా వచ్చింది. అంతకుముందు సంవత్సరం అంటే 1971లో మ్యూజికల్ వెస్ట్రన్‌గా సర్రియలిస్టిక్ అనుసరణ జకరియాగా విడుదలైంది. జాన్ రూబిన్‌స్టెయిన్ టైటిల్ పాత్రలో నటించారు.
ఇంగ్లీషులో హిల్డా రోస్నర్  అసలుసిసలు అనువాదం 1951లో వెలువడింది.
ఇక మన భారతీయ భాషలలోనూ సిద్ధార్థ పుస్తకానికి అనువాదాలొచ్చాయి.
తెలుగులోనే తొలి అనువాదం (బెల్లంకొండ రాఘవరావు) రావడం విశేషం.
హిల్డా రోస్నర్ రాసిన ఆంగ్ల అనువాదాన్ని ఆధారంగా చేసుకుని బెల్లంకొండ రాఘవరావు "సిద్ధార్థ" తెలుగులో రాయగా మళయాలంలో  ఆర్. రామన్ నాయర్ అనువదించారు. ఇది 1990లో వచ్చింది.
సంస్కృతంలో ఎల్ సులోచనా దేవి,
హిందీలో ప్రబాకరన్ హెబ్బార్ ఇల్లత్, మరాఠీలో అవినాష్ త్రిపాఠి, బెంగాలీలో జాఫర్ ఆలం, తమిళంలో జీవిత నరేష్ సిద్ధార్థను అనువదించారు. అలాగే పంజాబీలో డాక్టర్ హరి సింగ్ రాశారు.
మొత్తంమీద ఓ మంచి పుస్తకంగా సిద్ధార్థను చదివించిన "మదనపల్లి" ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

కామెంట్‌లు