" జీవితం పొరలు విప్పిన కథలు " --గన్నమరాజు గిరిజామనోహర బాబు హన్మకొండ.


 ‘’మంచి కథ కంచికి చేరదు 
 జీవితం పొరలు విప్పి ఇంటికి తెస్తుంది ---’’
ఈ విలువైన మాటలు ఆచార్య ఎన్ . గోపీ గారి నానీల్లోనివి .మంచి కథలు ,ముఖ్యంగా ఆధునిక కథల లక్షణాల్ని లక్ష్యాల్ని కథా రచయితలకు స్పష్టంగా నిర్దేశించి నట్లుగాఉన్న 
ఈ వాక్యాలు రచయితలకు ప్రేరణ కావాలి . 
‘కథ ‘-రూపం మార్చుకొని ఆధునిక జీవితాలకు భాష్యం లాగా రూపొందించడానికి చాలా 
కాలమే పట్టింది . దాని ప్రయోజనం కూడా విస్తరించింది . అందుకే తెలుగు కథ అంతర్జాతీ
య స్థాయికి చేరింది .’ కథ’ ‘కథానిక’-రెండు పేర్లూ విస్తృత ప్రచారంలో వున్నాయి.దాన్ని 
గురించిన చర్చోపచర్చలు సాహిత్య లోకంలో కొన్ని వందలసార్లు చేయబడ్డాయి.ఇప్పుడు 
నేను  ఆ  చర్చల్లోకి వెళ్లడంలేదు ,ఇది దాని వేదిక కూడా కాదు. కాని స్థూలంగా ఈ రెండు పేర్లూ ఆధునిక కథారచయితలు ఒకే ప్రక్రియకు వాడడం మనం చూస్తున్నాం .
పత్రికాప్రపంచం కూడా అదే మార్గంలో ఉంది. రెండింటి సందర్భం ఒకటే గనుక ఈ మార్పు 
చోటు చేసుకొని ఉండవచ్చు. ప్రయోజనం కూడా ఒకటే కదా !
మా సహృదయ పూర్వ అధ్యక్షులూ ,ఆత్మీయమిత్రులు ,నిత్య అక్షరార్చనా శీలురు,అక్ష
రసాధకులు అయిన డా . కె. ఎల్. వి. ప్రసాద్ గారు ఇప్పుడు వెలువరిస్తున్న 
‘’ నాన్నా పెళ్లి చేయరూ !’’అనే కథాసంకలనం  ఆధునిక జీవితయానంలో  మధ్యతరగతి 
వారి జీవితంలోని అనేక పొరల్ని విప్పి చెప్పిన రచన . సాధారణంగా కొంతకాలం సాహిత్య
లోకంలో అట్టడుగువర్గాలవారి కష్టాలూ ,ధనవంతుల దౌష్ట్యాలు ,అధికారపుఅహంకారా-
లూ ,ఇలా సాగిన కథలు,కవితలూ లెక్కకు మిక్కిలివచ్చాయి. శ్రామికజీవితాల్లోని అనేక 
పార్శ్వాలను ఆ రచనలు ప్రతిబింబించాయి. క్రమంగా రచయితల దృక్పథాల్లో కొత్తకొత్త -
కోణాలు పరిశీలించి రచనలు చెయ్యాలన్న భావన బలపడటంవల్ల  మధ్యతరగతి జీవితాలపై ద్రుష్టి మళ్లింది . సామాజిక అసమానతలు ,అణచివేతలు మొదలైన పలు -
రీతుల్లో రచనలు వెలువడ్డాయి. 
సాధారణంగా మధ్యతరగతివాళ్ళ జీవితాల్లో వ్యధలు చాలా ఉంటాయి. ఒక్కోకుటుంబానిది 
ఒక్కోకథ. వీటన్నింటినీ రచయితలు గమనించి తమ తమ రచనల్లోచిత్రించడం మొదలు 
పెట్టిన కారణంగా వివిధ పత్రికాధిపతులు కూడా ఆ దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తూవచ్చా-
రు . మిత్రులు డా . ప్రసాద్ గారు వృత్తి రీత్యా ఎంత తీరికలేని జీవితాన్ని గడిపినా ,తమ 
మానసిక తృప్తి కొరకు అక్షరాన్ని ఆశ్రయించి సృజన రంగంలో ప్రధానమైన కవితారంగం 
లోనూ ,కథారంగంలోనూ ప్రవేశించి పలురచనలను తెలుగుపాఠకులకు అందించారు ,
అందిస్తున్నారు. తమవృత్తికి సంబంధించిన వ్యాసాలు ,పుస్తకాలు అందిస్తూనే సృజన --
రంగంలోకి కూడా  ప్రవేశించి అందించిన రచనల్లో ఇంతకుముందే రచించి వెలువరించిన 
మూడు కథా సంకలనాలున్నాయి. ఇప్పుడు వస్తున్నఈ సంకలనంలోని పది కథలూ 
(ఒక గల్పిక )పది భిన్నకోణాల్లో,భిన్నమైన ఆలోచనలను రేకెత్తించగలిగే విధంగా ఉండ-
టం ,దీని ప్రత్యేకత. అయితే అన్ని కథలూ  మధ్యతరగతి వ్యక్తులకు సంబంధించి 
ఉండటం దీని ప్రత్యేకత ,అదే దీని ఏకసూత్రత . ఆ దృష్టితో వీటిని చదివినప్పుడు 
రచయిత హృదయం ఆవిష్కర్తింపబడుతుంది . ప్రతి కథలోనూ  నిడివిలో  చిన్నకథలైనా 
సరే ,ఎక్కడా  నేలవిడిచి సాముచేసే పద్దతి కనిపించదు. ఎక్కడా విషయాన్నిదాటివెళ్లిన 
సందర్భాలు కనిపించవు . మనకెదురయ్యే వ్యక్థలూ ,వ్యక్తిత్వాలూ ఈ కథల ప్రత్యేకం . 
      ఇవ్వాళ యావత్ప్రపంచంలో వేగం పెరిగింది. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. విలువలు కూడా దాదాపుగా అన్నీ మారి--
పోయాయి. వీటన్నింటి మధ్యలో సతమతమయ్యే జీవితాలలో మధ్యతరగతి జీవితాలే 
అధికం . అందుకే పలు పత్రికలు మధ్యతరగతి జీవితాల నేపథ్యంతో వచ్చిన కథలకు 
ఎక్కువప్రాముఖ్యం ఇస్తూవస్తున్నాయి . చాలా మంది రచయితలకు,వీరి జీవితాలకు 
మధ్యతరగతి తోనే సంబంధాలు అధికం అదే ప్రధానకారణం కాబట్టి వారి రచనల్లో 
వాస్తవికతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. స్వీయ అనుభవాలు కూడా కథా రచన 
పరిపుష్టతకు సహకారం అందిస్తాయి. 
డా . కె. ఎల్. వి. ప్రసాద్ గారు ,వృత్తిరీత్యా వైద్యరంగానికి చెందిన ప్రముఖ వైద్యులు. పలు సామాజిక సంస్థలతో ,సాహిత్యసంస్థలతో దగ్గరి సంబంధం వున్నవారు . వివిధ 
మనస్తత్వాలున్న వ్యక్తులు వారికి తారసపడుతుండడం సహజం . వారి వారి ప్ర వృత్తు 
లను ,డాక్టర్ గారు వృత్తిరీత్యా పరిశీలించడమే గాక ,ఒక సృజనాత్మకత వున్నరచయిత-
దృక్పధంతో పరిశీలిస్తారు గనుక ఈ కథలు ఆవిర్భవించాయి. అన్నిరకాల మనస్తత్వాల 
వారితో సన్నిహితంగా మెలగవలసిన కొన్ని అవసరాలు వారిలోని రచయితకు అధికంగా 
తోడ్పడ్డాయి . అవన్నీ సందర్భాన్ని బట్టి ఈ కథల్లో ప్రతిబింబించాయి. 
        ఈ సంకలనంలోని మొదటికథే ‘’ నాన్నా !పెళ్లి చేయవూ .. !’’అనేది . ఆ కథ శీర్షికే 
ఈ సంకలనం పేరుకూడా కావడం ఒక విశేషం . నేటి సామాజిక పరిస్థితుల్లో ఆడపిల్లలకు 
పెళ్ళిచేయడమనేది ఒక సాహస కార్యమే. అన్నీ అనుకూలిస్తే అది సులభం కావచ్చు,
కానీ ఒక్కోసారి చాలా కుటుంబాల్లో అది సాధ్యపడదు. కారణాలు అనేకం . ఈ కథలోని 
రాఘవరావు కుటుంబంలోని అంతస్సారం కూడా అదే. మెగా పిల్లలకొరకు ఎదురుచూసి వరుసగా ముగ్గురు ఆడపిల్లలకు తండ్రి ఐన రాఘవరావు లీలావతి దంపతులకు చివరకు 
అబ్బాయి పుట్టినా ,కుటుంబం పెద్దది కావడం ,ఉద్యోగం పెద్దదే అయినా అమ్మాయిల పెళ్లిళ్లు చేయడంలో జాప్యం జరగడం ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాల్లో సర్వసాధారణం
గా  దర్శనమిస్తుంటాయి . దీనికి కేవలం ఆర్ధిక విషయాలేగాక భార్యాభర్తల అభిప్రాయాల్లో 
భేదాలువంటి ఇతరేతర కారణాలుకూడా తోడై అనుకోని అవాంతరాల కారణంగా వివాహాలు ఆలస్యమైపోతుంటాయి. తండ్రికి కూతురు రాసిన ఉత్తరం ఈ కథలో ఒక విశేషవంశం. అది ఒకవిధంగా తన తండ్రికే కాదు ,సమాజంలోని చాలామంది ఆడపిల్లల 
తండ్రులకు కూడా కనువిప్పుకలిగించే అంశం . మన సమాజంలో ఆడపిల్ల పెళ్లి అనేది అనేక సమస్యలతో ముడిపడి ఉంటుందన్న సూచనలెన్నో ఈ కథ మనకు అందిస్తుంది 
                             మనిషిలో చాలా బలహీనతలుంటాయి. వాటికి లొంగినవానికి నైతికపతనం తప్పదు. వాటిని అధిగమించడానికి చాలా ఆత్మవిస్వాసం ,మానసికదార్ధ్యం 
కావాలి. అవి ఎంతకష్టసాధ్యమో తెలిపే కథ ‘ నిజాయితీ ‘--అనుకోని పరిచయం కారణంగా ఉన్నతోద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మణికుమార్ కు ,చక్కని రూప సం-
పదతో బాటు ,వివేకవంతురాలైన భార్య ,రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలున్న మంచి కుటుంబం కూడా ఉంది. ఒకరకంగా వారిది ప్రేమవివాహమే గనుక జీవితం మణికుమార్ 
ఆశయాలకు అనుకున్న రీతిలో సవ్యంగానే సాగుతున్న దశలో అతనికి అంతర్జాలం---
ద్వారా  అశ్విని పరిచయం కావడం ,తనని కలుసుకునే అవకాశం రావడం ,ఆమె కూడా 
కొన్నివ్యక్తిగత బలహీనతల కారణంగా ఇతనితో కలవాలన్నకోరిక ఒకదశలో వారిద్దరి--
మధ్య అక్రమసంబందానికి దారితీస్తున్న క్షణంలో ఆమెలోని వివేకం ,నిజాయితీలు మేల్కొన్న కారణంగా మళ్ళీ ఎవరికీవారు తమని సరిదిద్దుకోవడం ,మణికుమార్ తిరిగి 
తను ఇంటికి చేరడం ఒకఎత్తైతే ఇంటికొచ్చిన భర్తను ,భార్య ఎదురొచ్చి పలకరించినప్పు
డు  అతనిలో కలిగిన గిల్టీఫీలింగ్ అతనిలోని ‘ నిజాయితీ ‘నిలబడిందండానికి నిదర్శనం. 
అది అశ్విని మెసేజ్ కు అతను ఇచ్చిన జవాబులో స్పష్టమౌతుంది. అందులో మణికుమార్ ‘అశ్విని ‘నిజాయితీని అభినందించడమే ఇతని నిజాయితీని తెలుపుతుంది
శీర్షికకు తగిన రీతిలో సాగిన ఈ కథలో ముగింపు ‘’హైలైట్ ‘’. 
          ఇంత ఆధునిక సమాజంలోకూడా ఇంకా కొన్ని అహంకారాలు కొనసాగుతూనే ఉన్నాయి . దాంపత్యమనేది భార్యాభర్తల మధ్య అన్యోన్యతను,ఆప్యాయతను రెండింతలు 
చెయ్యాలి. అప్పుడే వాళ్ళ కుటుంబజీవితం సుఖదాయకంగా ,సంతోషదాయకంగా సాగుతుంది తప్ప మరేవిధమైన పొరపొచ్చాలున్నా ఆ కుటుంబం అష్టకష్టాలకు లోనవుతుంది . సమాజంలో అభాసుపాలు కూడా కావచ్చు . కుటుంబం విచ్చిన్నమైనా 
ఆశ్చర్యపోనక్కర లేదు. కానీ భార్యాభర్తల్లో ఏఒక్కర్తెనా జాగ్రత్త వహించి ఎదుటివారిని 
మార్చగలిగే ఓపికతో వ్యవహరిస్తే ఆ కుటుంబం మళ్ళీ గాడిలోపడే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని అందంగా చెప్పిన కథ ‘ ధిలాసా’. 
‘ శ్రవణ్ ,శుభ ‘--లదాంపత్యం ఏఒడిదుడుకులు లేకుండా సాగడానికి ఆ ఇల్లాలు ‘శుభ ‘-
లోని సహనం ,కుటుంబం గౌరప్రదంగా నడిపించుకోవాలన్న విజ్ఞత ముఖ్యం . శ్రవణ్ లోని 
పురుషాహంకారాన్ని భరించి గుట్టుగా సంసారాన్ని నిర్వహించుకుంటున్న శుభలోని 
ఓపికను బలహీనతగా భావించి ఆమెను మరింత పీడించే మనస్తత్వాన్ని సరియైన దిశగా మళ్లించాలని శుభ చేసిన చమత్కారంతో ఈ కథ పురుషాహంకారానికి ‘ చెక్ ‘పెట్టింది . చాలా మంది పురుషులు అభ్యుదయ వాదులనుకొంటున్న వారిలోనూ ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి . పురుషాహంకారం కుటుంబ విచ్చిత్తికి దారి -
తీయడం తద్వారా సమాజపురోగతికి భంగం కలగడం పరిగణన లోకి తీసుకోవలసిన అంశం గనుక నేటితరం దీన్ని ఒక సల్లక్షణంగా భావించి తమ తమ ప్రవర్తనలను సరి -
దిద్దుకోవాలి. శ్రవణ్ పురుషాహంకార లక్షణాల్ని ,శుభలోని ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాల్ని 
బహుజాగ్రత్తగా డాక్టర్ గారు రూపు కట్టించారు . కథ ముగింపు పాఠకుని ఉత్కంఠ కు 
కారణం కావడం కథారచనకు ఒక ‘ కంప్లిమెంట్ ‘ అనొచ్చు . 
        ఈ ప్రపంచంలో కేవలం తమ కాయకష్టాన్ని మాత్రమే నమ్ముకొని జీవించేవాళ్ళు 
చాలామందే ఉన్నారు. తమ శారీరక శ్రమే తమకు సంపదగా భావిస్తుంటారు గనుక 
ఏ వస్తువైనాసరే ,అదెంత విలువైనదైనాసరే  ఉచితంగా తమకు అందుతుందని తెలిసినా 
దాన్ని స్వీకరించడానికి ఇష్టపడరు. ఇదివారి ఆత్మవిశ్వాస లక్షణం ,వారి ఆత్మగౌరవానికి 
ప్రతీక,వారి శ్రమమీద వారికున్న నమ్మకం. ఈ సంకలనంలోని ‘అవ్వ మనసు ‘ అనే కథ 
ఈ సంగతినే ప్రతిబింబిస్తూఉంది. సమాజసేవ చేయాలన్న కాంక్షగల నాగయ్య తనకు 
సాధ్యమైనరీతిలో సాయం చేస్తున్న వ్యక్తి. అనుకోకుండా ఒక వృద్ధురాలికి ఈ కరోనా కష్ట-
కాలంలో చిన్నసాయం చేయబోతే ఆమె దాన్ని గౌరవమైన రీతిలోనే వద్దని చెబుతూ 
నాగయ్యలోని సేవానిరతిని అభినందించి ఆశీర్వదించడం ఈ కథలోని ‘ క్లైమాక్స్’. 
ఇక్కడ కాయకష్టం పైనున్నఆమె దృఢవిశ్వాసం ,ఎదుటివారి ఉత్తమగుణాల్ని అభి నం -
దించాలన్న ఆమె సంస్కారం ఆమె అంతరంగానికి అద్దంపట్టాయి. ఆమె మనసులోని 
ఔన్నత్యాన్ని చాట్ ఈ కథకు ‘ అవ్వ మనసు ‘ అనేపేరు అన్వర్ధమైంది. 
         ఈ సంకలనంలో ప్రతికథ లోనూ ఒక చిన్న సందేశం ,పాఠకునిలో ఆలోచనల్ని 
రేకెత్తించడం వంటి లక్షణాలున్నాయి. ఇవి సరదాగా రాసిన కథలే కావచ్చు,కానీ చదువరులలో పఠనాసక్తిని ,ఉత్సుకతను రెండింతలు చేసే విధానం వుంది. ఇది కథా -
రచన చేసే రచయిత ప్రతిభకు నిదర్శనం. ఈ శక్తి విస్తృత అధ్యయనం వల్ల మాత్రమే వస్తుంది ,కానీ ఆ చదివిన వాటిలోని శైలి ,కథన పద్దతి ,ఎత్తుగడ వంటి రచనా విశేషాలపై 
ద్రుష్టి పెట్టుకున్న వ్యక్తికీ మాత్రమే తన రచనల్ని సుసంపన్నం చేయగలడు. 
డా . ప్రసాద్ గారు మంచి చదువరి. చదివిన ప్రతి రచనలోని లోతుల్ని విశ్లేషించి ఆ  రచనను అంచనావేయగల పరిణతి కలిగినవ్యక్తి. ఆ అధ్యయనమే ఈ కథల రచనకు భూమిక . 
    తెలుగు కథ పుట్టిననాటినుండీ నేటివరకు కూడా పోయిన పోకడలు అపారం. ప్రతిరచయితకు ఒక సంవిధానం ఉంటుంది. తీసుకున్న వస్తువుయొక్క అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని తన సంవిధానాన్ని జోడించి కథను రక్తికట్టిస్తాడు. అపుడే అతని కథలు సాహితీ ప్రపంచాన పదికాలాలపాటు నిలుస్తాయి. నాటి గురజాడ కావచ్చు,
శ్రీపాద కావచ్చు,సురవరం కావచ్చు ,భండారు అచ్చమాంబ కావచ్చు,ముళ్ళపూడి -
కావచ్చు,రావిశాస్త్రి కావచ్చు,మల్లాది కావచ్చు,ఇలాచెబుతూ పొతే ,బహుముఖీన 
ప్రతిభతో రాణించి కథా వేదికపై శాశ్వతస్థానాన్ని సంపాదించుకున్నవారు ఎందరెందరో 
ఉన్నారు. 
               ప్రతి కథారచయితకు ప్రమాణం ఎక్కువశాతం తన అనుభవాలే. ఆ అనుభవాల సారాంశమే కథగా ఆవిర్భవిస్తుంది. ఈ కథాసంకలనంలోనూ డా. కె ఎల్వీ 
గారి స్వీయానుభవాల నేపధ్యం చాలానే ఉంది. దానికి సన్నివేశాల్ని జోడించి మలచిన 
కథలు మనకు కనిపిస్తాయి. తమదైన దృక్పథంతో కథలను రక్తికట్టించడానికి సంభాష -
ణలు,ఎత్తుగడ,ముగింపువంటి విషయాల్లో రచయిత ఎక్కువ శ్రద్ధతీసుకున్న పద్దతి 
ప్రశంసనీయం. 
      అనేక మాధ్యమాల ద్వారా తమ సృజన శక్తిని కవితలద్వారా,కథలద్వారా,వ్యాసాల-
ద్వారా,ఇంటర్వ్యూ ల ద్వారా అందిస్తున్న ఆత్మీయులు డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు. 
ఇంతకుముందు ,’’ కె ఎల్వీ కథలు ‘’ అస్త్రం -చిన్న కథలు ‘’,హాగ్ మీ క్విక్ -కథలు ‘’
అనే మూడు కథా సంకలనాలు అందించారు. మరో ప్రయత్నంలో భాగంగా అందిస్తున్న 
ఈ నాలుగో కథా సంకలనానికి ,చిన్న ముందుమాట రాసే అవకాశాన్ని నాకుకలిగించారు
కేవలం ఇందులోని నాలుగుకథలను గురించి నాలు మాటలు రాశాను. ఇక్కడ ప్రతికథ 
నూ విశ్లేషిస్తూ పొతే అసలు పుస్తకం కన్నా ముందుమాటలే పెద్దవైపోయే ప్రమాదాన్ని 
నివారించే యత్నంలో ఇవి రాస్తున్నాను. 
‘’ మైత్రియనెడి  దివ్యసూత్రమ్ము  బంధించె నిన్ను నన్ను మిన్ను మన్నువోలె ‘’అని 
ప్రముఖ కవి దాశరధి గారన్నట్లు ,ఆ మైత్రీ బంధాన్ని అక్షరరూపంలో సాక్షాత్కరించే 
అవకాశం కల్పించిన డా. కె . ఎల్వీ . ప్రసాద్ గారికి ధన్యవాద పూరక నమస్సుమాంజల
లు  తెలుపుకుంటున్నాను. 
                       ----స్వస్తి ----

కామెంట్‌లు