కృతి కర్తను, భర్తను నేనే ;-లావణ్య గణేష్-కలం స్నేహం
 సప్త లోకాలు తిరిగి వెతికినా కానిపించదు నీ రూపు 
ఏడేడు జన్మాలు ఎదురుచూసినా లభించదు నీ ప్రాపు...
అగణిత తారల సౌందర్య ప్రకాశమా
నీ ఆగమనంకై నిరీక్షిస్తూ గడిపిన  నిద్రలేని రాత్రులెన్నో...నీ తలపుల రసంలో ఓలలాడుతూ విరహమోపలేక గడవని దినములెన్నో...
శక్రుని సభలో నాట్యమాడే అప్సరసవే నీవు...
ఆహా!అవి నేత్రములా?కావు కమల పత్రాలు..ఆ రాజీవ నేత్రాలను వర్ణింప శక్యం కాదని పదాలు నేల చూపులు చూస్తున్నాయి
నీ మేని ఒంపు సొంపుల జిలుగు తళుకులు.. బుగ్గల్లో పూసిన సిగ్గుల మొగ్గల వర్ణములు చూసి ఆ హరివిల్లు రంగులు కూడా హరించుకుపోతున్నాయి
నీ లేలేత చిగురుకేల సౌకుమార్యమును వీక్షించి పూ లతికలు ముకుళిం చి సున్నితత్వాన్ని కోల్పోతున్నాయి 
నీ కన్నుల్లో కాంతులను ఈక్షించి 
నీ దరహాస వెలుగులకు అచ్చెరువొంది శరశ్చంద్రికలు సైతం వెలవెలబోతున్నాయి
నీవు భాషించే మృదుభాషణముల మాధుర్యానికి మకరందాలు కూడా పువ్వుల్లోకి మరలి పోతున్నాయి
చీకటిగోడలను కూడా పడగొట్టే
నీ వదనార బింబ దీప్తులకు సిగ్గుపడి  చంద్రుడు కూడా మబ్బులమాటున దాక్కున్నాడు
నీ సొగసైన తనువు అష్టాదశ వర్ణనల ప్రబంధ కావ్యం
ఆ కబ్బానికి అలంకారాలను చేర్చి కృతికర్తను నేనౌతా కృతిభర్తను నేనౌతా...

కామెంట్‌లు