అమ్మా నాన్న ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోవడం అసాధ్యం డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ; సేకరణ ; సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆకాశవాణి తో సావాసం అర్ధాంగి శ్రీమతి హంస వర్ధనిగారి సాహచర్యం!కలం గళం మేళవింపు !అదే వేణు నాదం! లేమి కష్టాలకొలిమిలో పుటంపెట్టిన బంగారం తీగలాసాగి సైన్స్ సాహిత్యంతో పాటు రేడియో ప్రసారాలతో కొనసాగి ఇంకా ఇంకా దూసుకు పోతూనే ఉంది. గోవాలో రేడియో ఉద్యోగం ఆరంభం!అనంతపురం విజయవాడ విశాఖపట్నం కడప మద్రాసు తిరుపతి ఆకాశవాణి ఉద్యోగిగా పెక్స్  డైరెక్టర్ గా 33ఏళ్ల  అనుభవాలు!హైదరాబాద్ లో రిటైర్ ఐనారు.గాంధీజీ పై  బహుముఖ ప్ర జ్ఞాశాలి శ్రీ పి.వి.నరసింహారావు గారి పై ఏడాది పొడుగునా చేసిన ప్రోగ్రాంలు అశేషప్రజానీకాన్ని విశేషం గా అలరించాయి.భావికి దివిటీలుగా నిలిచాయి.పర్యావరణ ప్రోగ్రామ్ రూపకల్పనకు ఫిలిప్పీన్స్ వెళ్లటం రేడియో స్కోప్ మంచి గుర్తింపు తెచ్చాయి.దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలుప్రసారం చేశాయి.ఫిజిక్స్ లో ఎమ్మ…: 60కిపైగా పుస్తకాలు ప్రచురింపబడినాయి.1978లోవిద్యార్ధిగా ఆంధ్ర పత్రిక లో రాసిన కవిత తో సాహితీ సేవ ఆరంభమైంది. సైన్స్  సాహిత్యం  రెండు కళ్ళు. వాటిని రాయటంలో సవ్యసాచి ! మేకలు పర్యావరణహితం కలిగిస్తాయి అంటారు. పురుగుమందు  సజ్జలు తిని నెమళ్లు  చనిపోటంపై ఆవేదన వ్యక్తం చేసిన  సున్నితమనస్కులు శ్రీ వేణుగోపాల్ గారు.ఇక ఆయన మాటలలోనే బాల్య స్మృతులు తెలుసు కుందాం.
---------------------------------------------------------------------------------------------
మా అమ్మ పేరు గౌరమ్మ.నలుగురు అన్నలు ముగ్గురు అక్కలు ఒక తమ్ముడు  ఒక చెల్లి.నేను  ఎనిమిదో వాడిని. చేతివేళ్లలాగా అమ్మ మమ్మల్ని అందరినీ సమానంగా పెంచింది. నాజీవితంకి పునాది. కుండబద్దలు కొట్టినట్లు నిష్కల్మషంగా మాట్లాడే అమకి వివేకం విచక్షణ  కామన్ సెన్స్  సమయస్ఫూర్తి మెండు.ఎంతటి పెద్ద లెక్క నైనానోటితో చేసేది.పదేళ్ళు మంచాన పడిన నాన్న కి సేవచేసింది.ఎంత కష్టక్లిష్ట సమయంలో కూడా ధైర్యం కోల్పోకుండా ఆతల్లి నన్ను పై చదువులకు ఉద్యోగం కి పంపింది.బతుకుకి చావుకి  కారణం అర్ధం తెలిసి ఉండాలి. ఒకరి దగ్గర ఏదైనా తీసుకుంటే చులకన అవుతాం అనే భావంని బలంగా నాటిన  ఆత్మాభిమాని మా అమ్మ.!కాకపోతే  ఆమె దగ్గర  ఐదోక్లాస్ పూర్తి అయ్యేదాకానే ఉన్నాను.ఇక మానాన్న శ్రీ సంజీవయ్య తన అన్న తో కలిసి  పదోఏట అతి బుల్లి 50-60ఇళ్ళున్న కుగ్రామం అనంతపూర్ జిల్లాలో ఉన్న కొనతట్టుపల్లి కినడుచుకుంటూ వచ్చి స్థిరపడ్డారు. అప్పుట్లోనాన్నకు కొప్పు ఉండేదిట!మా పెద్దలు మగవారు కూడా తలలో పూలు పెట్టుకునేవారట.నెలకోసారి వచ్చే క్షురకునితో ఆపిలకను తీసేసిన నాన్న  మాకు కొత్త బాటను చూపాడేమో!? ఆయన పుట్టిన రోజు 10.10.1910. బాగా గుర్తు ఉంటుంది. మూడు పదులున్న సంఖ్య! గంపంత సంసారం !అభంశుభం తెలీని వయసులో పెళ్లి పిల్లలు!రెక్కలుముక్కలు చేసుకుని రకరకాల పనులు చేసి  మిషన్ కుట్టి మాకు రెక్కలు వచ్చాక ఆయన తరలిపోయారు.అమ్మా నాన్న  ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోవడం అసాధ్యం సుమా! మాపక్కింటి అబ్బాయి లుంగీలు కొనుక్కున్నాడు."నాన్నా!నాకూ లుంగీ కావాలి "అని అడిగాను.
"కాలేజీ లో చదువుతున్న నీకు లుంగీతో పనిలేదు. ప్యాంట్స్ ఉన్నాయికదా?"సున్నితంగా చెప్పిన నాన్న పేరు మీదుగా పాపులర్ సైన్స్ విభాగంకి 2010నించి తెలుగు విశ్వవిద్యాలయం కి కీర్తి పురస్కారం ఇస్తున్నాను.ఢిల్లీలో ఉన్న నేను  నాన్న మరణవార్త విని డబ్బు సమకూర్చుకుని మా ఊరు చేరిఆయన భౌతిక కాయంని చూడగలిగాను.అమ్మనాన్నలా ఆత్మీయత చూపిన నాపల్లె తల్లి అందచందాలు నేటికీ నా గుండెలో గుబాళించే మల్లెలు!
రావి వేపచెట్ల వద్ద గంతులేసిన బాల్యం! రావి వేప పళ్ళు చప్పరిస్తూ చింతచిగురు కింద పడిన చింతకాయలు తింటూ అశ్వత్థకట్టపై చిలోపొలో అంటూ ఆడిన జ్ఞాపకాలు గుర్తు కొస్తున్నాయి.తోలు బొమ్మలాటగాళ్లు వస్తే  మాకు పండగే పండగ! కిల్లేకిత్తరగాడు ప్రధాన పాత్ర! రంగు రంగుల ఆంజనేయ రావణతోలుబొమ్మలు చూసి కేరింతలు కొట్టేవారం.మా ఊరి పండగపీర్ల పండగ!సావడిలో పీర్లు పెట్టడం సాయంత్రం  అలావు తొక్కడం తెల్లారుజామున పీర్లు పల్లెంతా తిరగటం బొరుగులు బెల్లం చదివించడం!ఓహ్అదో అందమైన బాల్య స్మృతి.బుడబుక్కలవాడు చెప్పేవి మా అమ్మ నమ్మేది.ముత్యాలమ్మను మోస్తూ బూరుబూరుశబ్దాలు చేస్తూ భార్య  తాడుతో తనని తాను కొట్టుకునే భర్త ఊరంతా తిరిగేవారు. పసుపు రంగు దుస్తులలో వేమన్న పూజారి గుర్రంమీద వచ్చి పోతుంటే పిల్లలం భయపడేవారం! మాపల్లెలో గుడి లేదు అంటే మీకు నమ్మబుద్దికాదు గదూ? కానీ అప్పటిలో అది పచ్చినిజం! ఊరిమొదట్లో గొడ్రాయికి ప్రత్యేక సందర్భంలో ఊరు ఊరంతా నీటితో అభిషేకం చేసేది. పోలేరమ్మ గంగమ్మ సుంకులమ్మ మొదలైన గ్రామ దేవతలకే ప్రాధాన్యత ఉండేది. పక్క ఊళ్లో సీతారామ కల్యాణం  ముత్యాల పల్లకి బండ్లదీపాలు అప్పుడప్పుడు నాటకాలు!ఇవే మాపల్లె విశేషాలు. ఇక నాకు అందమైన అనుభూతి కలిగించిన బడి జ్ఞాపకాలు గుర్తు చేసే సుంకేసరిచెట్టు నాగుండెలో కొత్త భావాలు పలికిస్తుంది. తురాయి అగ్ని పూల చెట్టుతో పాటు జలజలా పూలురాల్చేకొండమల్లి అనబడే   పున్నాగ నాలో సన్నాయి రాగాలు మోగించేది.ఇక చదువు విషయానికి వస్తే  ఐదో క్లాస్  రెండు ఏళ్ళు చదివాను. ఫెయిల్ కాలేదు.మాపెదనాయన మనవడికోసం!?ఇద్దరినీ ఒకేసారి హైస్కూల్ లో చేర్చాలనే పెద్దల నిర్ణయం! అమాయకంగా తలూపిన నేను!పెద్దలుచెప్పిందే వేదం.మాఊరి బడి అంటే ఓ పెద్ద హాల్! 60మంది పిల్లలు ఒకేచోట  నేలమీద కూచునేవారం.నాలుగు ఐదుక్లాసులవారు పొడవాటి పలకలపై (బల్లలు)కూచునేవారు.మా గ్రేస్ టీచర్ పాఠం చెప్పేటప్పుడు ఆమె బల్లచుట్టూ ఆయాక్లాసులవారు చేరి బుద్దిగా పాఠం వినేవారం.రీసెస్ టైంలో చిలోపొలో అంటూ అరుపులు కేకలు చెట్లు ఎక్కడం దూకడం పరుగులు గిల్లికజ్జాలు!అందమైన ఆబాల్యం స్వేచ్ఛ నేటి పిల్లలకు కరువు!? సుంకేసరి పూల చప్పరిస్తూ పుల్లదనం రుచిచూస్తూపచ్చి కాయల గింజలు తినటం భలే మజా! సర్వశ్రీ జార్జి సార్  గోవింద రెడ్డిసార్లను అయ్యవారు ఐవారు అని పిలిచేవారు పెద్దలు. 1971యుద్ధసమయంలో గోవిందరెడ్డి సార్ బడి ముగిసే ముందు దేశ ప్రపంచ విషయాలు మ్యాపులో చూపుతూ అవగాహన కలిగించేవారు.అది అందరికీ ఇష్టమైన అంశం! జాతీయగీతం జైహింద్  చెప్పించేవారు.7వక్లాస్ హిందూ పుర్ లో చదివాను. డిగ్రీ చదివిన  అన్నలకు జాబ్స్ రాకపోటంతో నాన్న  వారి చేత పచారీషాపు పెట్టించాడు.బడికెళ్లేముందు వచ్చిన తరువాత అక్కడ పని చేసేవాడిని.అదృష్ట వశాత్తు  అది నాసాహిత్యజీవితానికి  బీజంవేసి వటవృక్షంగా ఎదిగింది. 8వక్లాస్లో ఉన్న నాకంట పడిన పేజీలు చెరిగిన పుస్తకం 1948-49లోప్రచురింపబడిన"ఉగాది స్వర్ణభారతి"పద్యాలతో ఉన్న ది.దాన్ని రాసిన వారు  శ్రీ కల్లూరు అహోబలరావుగారు.1922నుంచి72దాకా ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ సంఘటనలతో సాగిన పద్యరచన నాలో కవితానుభూతి కలిగించింది.10వ క్లాస్ లో ఉండగా 16లైన్ లకవిత ఆంధ్ర పత్రిక డెయిలీలో రావటం నాజీవితం లో కొత్త మలుపు! హిందూ పూర్ నేతాజీ మున్సిపల్ స్కూల్ సోషల్ స్టడీస్ మాష్టారు శ్రీ జానకిరామారావుగారు సోషల్ స్టడీస్ క్లబ్ నిర్వహించారు. ఆయన తెప్పించే రకరకాల ఆంగ్ల తెలుగు వార మాసపత్రికలు చదువుతూ ఆయనకి సాయంచేయటం  నాకు చదవటం రాయటంకి ఆది పునాదివేసింది. ఇలా ఒక సైన్స్ విద్యార్ధి  సాహితీ రంగంలో కాలుమోపటంకి కారణం మాఅధ్యాపకులు.దానితో పాటు  పిల్లలలో గూడా ఆసక్తి ఉండాలి. కృషి తో నాస్తి దుర్భిక్షం"అని నాఅభిప్రాయం."🌷
కామెంట్‌లు