"మీరేం చేసుకుంటారో చేసుకోండి";-- యామిజాల జగదీశ్
 ఈశ్వర చంద్ర బందోపాధ్యాయ్ (1820 సెప్టెంబర్ 26 - 1891 జులై 29) విద్యావంతుడు. రచయిత. 
స్త్రీ విద్య, పురోగాభివృద్ధి, వివాహం వంటి అంశాలపై గొంతెత్తిన విద్యాసాగర్ పశ్చిమ బెంగాల్ లోని బీర్సింఘా అనే ఊళ్ళో జన్మించారు. వేదాలపై పట్టున్న ఈయన సంస్కృత సాహిత్యంపై బాగా చదువుకున్నారు. ఆయన పాండిత్యాన్ని గుర్తించి ఓ విద్యాలయం "విద్యాసాగర్, "అనే బిరుదుని ప్రసాదించింది. 
ఓమారు ఓ పెద్దమనిషి ఆయన మీద అక్కసు పెంచుకుని కొట్టించడానికి కిరాయి మనుషులను ఏర్పాటు చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న విద్యాసాగర్ ఆ పెద్దమనిషి ఇంటికి వెళ్ళాడు.
"అయ్యా, నమస్కారం! మీరు మీ మనుషులతో నన్ను కొట్టించాలనుకున్నారు. ఆ శ్రమ వారికెందుకివ్వాలనిపించి నేనే మీ ఇంటికొచ్చాను. మీ ఇష్టం వచ్చినట్లు నన్ను కొట్టాలనుకుంటే కొట్టండి. లేదా తిట్టాలనిపిస్తే తిట్టండి. మీరేం చేసినా పరవాలేదు. నేను ఆనందంగా స్వీకరిస్తాను" అన్నారు విద్యాసాగర్. 
ఈ మాటలతో ఆ పెద్దమనిషి సిగ్గుతో తలదించుకున్నాడు.

కామెంట్‌లు