చలం క్యాలండరుతో గతంలోకి;--- యామిజాల జగదీశ్
 హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 34వ జాతీయ పుస్తక ప్రదర్శనకు ఈసారి మూడుసార్లు వెళ్ళొచ్చాను విజయవంతంగా. మూడుసార్లయినా వెళ్ళాలనుకున్న మాట కార్యరూపం దాల్చినందుకు ఎంత ఆనందమేసిందో చెప్పలేను. మొదటిసారి నేనొక్కడినే వెళ్ళాను. రెండవసారి మా ఆవిడతో వెళ్ళొచ్చాను. మూడవసారి నంబూరి రామలింగేశ్వరరావుగారిని ఈ పుస్తకాల సాగరంలో కలవడానికి వెళ్ళాను. 
మొదటిసారి వెళ్ళినప్పుడు పరిచయస్తులెవరూ కనిపించలేదు. కానీ పుస్తకాలతో ఓ రెండు గంటలు గడిపాను. ఇక రెండవ సారి వెళ్ళినప్పుడు రచయిత, పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ గారిని అనుకోకుండా కలిశాను. మూడవసారి ముందే అనుకున్నట్టు రామలింగేశ్వరరావుని కలవడమే కాదు ఆయనతో రెండు పుస్తకాలు కొనిపించుకున్నాను. ఒకటేమో చలంగారి యశోదాగీతాలు, మరొకటి - శ్రీరామానుజులవారి చరిత్ర. కలంస్నేహితుడిగా పరిచయమై తర్వాత ప్రత్యక్ష మిత్రుడైన పాత్రికేయుడు విద్యారణ్య కామ్లేకర్ ని కుటుంబసమేతంగానూ, రచయిత నాగసూరి వేణుగోపాలగారిని, దేవులపల్లి అమర్ గారిని, కవి యాకూబ్ గారిని కూడా కలిసాను. 
చలంగారి పుస్తకాలన్నింటిని కొన్నేళ్ళుగా ప్రచురిస్తూ పుస్తక ప్రదర్శనలో ఓ స్టాల్ నిర్వహిస్తున్న వత్సల గారి నుంచి చలంగారి చిత్రాలతో రూపుదిద్దుకున్న క్యాలండరుని అందుకున్నాను. రాజు (పరిచయస్తులే నాకు), మృత్యుంజయ, గిరిధర్, వాసు (పరిచయస్తులే), శంకర్ (పరిచయస్తులే), మరొక చిత్రకారుడు (పేరు అర్థం కాలేదు. మన్నించాలి) వేసిన చలం చిత్రాలివి. అర డజన్ చలం చిత్రాలతో డిజైన్ చేసిన క్యాలండర్. ప్రతి చిత్రంపైన చలంగారి ఆణిముత్యపు మాటలు పొందుపరిచారు. నాకెంతగానో ప్రియమైన  రచయిత, అభిమాని చలంగారు. ఈ క్యాలండరు చూస్తుంటే తిరువణ్ణామలైలోని రమణస్థాన్ లో చలంగారింట గడిపిన నా చిన్నతనం గుర్తుకొచ్చింది. చలంగారు రచయిత అనే విషయం తెలియక ఆయన ఇంట ఉన్న రోజులవి. నాకు పేరు పెట్టిన సౌరీస్ (చలంగారి పెద్దకుమార్తె), నర్తకిగారు, చిత్రగారు,  బసవరాజుగారు, చిక్కాల కృష్ణారావుగారు, చిననారావుగారు, కనకమ్మగారు, ఉమ, డాలీ, కాకా, కిట్టు, బుజ్జీ ఇలా ఎందరెందరి మధ్య గడిపిన ఆరోజులు కళ్ళముందు కదలాడాయి. అలాగే చలంగారింటి ఎదురుగా ఉన్న కొండ (భగవాన్ రమణమహర్షి ధ్యానం చేసిన గిరి), రమణాశ్రమం, బోస్ కాంపౌండ్, పెద్దగుడి, గుర్రబ్బండిలో చిత్రగారితో కలిసి సినిమాకెళ్ళడం, గిరి ప్రదక్షిణ, ఒకటేమిటి ఇలా ఎన్ని జ్ఞాపకాలో మదిలో గూడుకట్టుకున్నవన్నీ మళ్ళీ చూసాను మనోనేత్రంతో. 
చివరిసారి కొన్నేళ్ళ క్రితం మా అత్తగారితోనూ, రేణుకతోనూ, సాత్యకితోనూ అరుణాచలం వెళ్ళాను. అప్పటికి చలంగారు లేరు. జ్ఞాపకాలే ఉన్నాయి. 


కామెంట్‌లు