పరమానందయ్య మారు శిష్యుడు ౼ భోగాది రామకృష్ణ-- అరవై ఏళ్లనాటి బాలల కథలు..11--(సేకరణ : డా. దార్ల బుజ్జిబాబు)

 పూర్వం ఒక గ్రామంలో శివశాస్త్రి అనే యువకుడు ఉండేవాడు. అతడు వట్టి వెర్రివాడు. చదువు రానివాడు కావడం చేత అందరు అతనిని పరిహసించేవారు. అతను అత్తవారింటికి వెళ్లినప్పుడు కూడ అందరిచేత ఎగతాళి చేయబడటంచేత అతనికి కోపం వచ్చి, విద్యను నేర్చుకోవాలని బయలు దేరాడు.
      అతడు చాలారోజులు ప్రయాణం చేసి చేసి ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో శంభు శాస్త్రి అనే పండితుడు వున్నాడు. ఆయనకు రాని సామెతంటూ యీ ప్రపంచంలో లేదు. అందు వలన ఆ గ్రామంలోని వారు శంభు శాస్త్రి గారిని సామెతల శాస్త్రీ అని పిలిచేవారు. శివశాస్త్రి ఆయన కీర్తి విని శంభుశాస్త్రీ దగ్గరకు వెళ్లి “స్వామీ! నేను చాలా దూరంనుండి జ్ఞాన సంపాదన కొరకు వచ్చాను. నన్ను మీ శిష్యునిగా చేసుకొని  మీ సామెతలన్నీ నాకు నేర్పి నన్ను కృతార్థునిచేయండి” అని ప్రార్థించాడు.
        సామెతల శాస్త్రిగారు  అందుకంగీకరించాడు. ఆరు నెలల వరకు
శివశాస్త్రి ఆయన వద్ద అన్ని సామె
తలు క్షుణ్ణంగా కంఠస్థం చేశాడు. ఆరు నెలల పిదప సామెతల శాస్త్రి “నాయనా! నీ విద్య ముగిసింది. నీవిప్పుడు పండితుడవు. నే నిప్పుడు నేర్చిన సామెతలు జీవితంలో ఉపయోగించుకొని సుఖపడు” అని. ఆశీర్వదించి, తన గురుదక్షిణ తీసుకొని పంపాడు.
        శంభు శాస్త్రి వద్ద సెలవు తీసు కొని, శివశాస్త్రి  స్వగ్రామానికి బయలు దేరాడు.
వేషంచూచి, ప్రజలు అతనిని గౌరవించి
సాగనంపేవారు. ఆ విధంగా బయలుదేరి, శివశాస్త్రి ఒక అడవిగుండా ప్రయాణం చేయసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి ఒక గాడిద శవం కనపడింది. 'అనాధ ప్రేతానికి దహన సంస్కారం చేస్తే పుణ్యం వస్తుంది' అనేసామెత వుంది. అందు వలన ఆ శవానికి దహన సంస్కారం చేస్తే పుణ్యం వస్తుందని శివశాస్త్రి ఆ చచ్చిన గాడిదను బుజాన వేసు కొని బయలు దేరాడు. చివరకంత బరువు మోయటం కష్టమనిపించింది శివశాస్త్రీకి. 'సర్వస్యగాత్రస్య శిరః ప్రధానమ్. శరీరంలో కల్లా శిరం ముఖ్యము గదా! అనుకొని తల
నరికి బయలు దేరాడు.
       కొంత దూరం పోయేసరికి ఆ తల కూడా బరువుగా తోచి, 'సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. ఇంద్రియాల్లో కళ్లు ముఖ్యం కాబట్టి కళ్లు మాత్రం చాలు' అని ఆ గాడిదకళ్లు తీసుకొని బయలు దేరాడు శివశాస్త్రి.
         ఆ అడవికి ఒక రాజు వేటకు వచ్చాడు. శంభుశాస్త్రి నేర్పిన సామెతలలో మహా రాజు విష్ణుమూర్తితో సమానమని ఒకసామెత వుంది. అందుచేత శివశాస్త్రి రాజును చూడబోయాడు. కాని రాజు వద్దకు, భార్యా బంధువుల వద్దకు ఉత్తచేతులతో పోకూడదని ఒక సామెతవుంది. అందుకని శివశాస్త్రి రాజు వద్దకు వెళ్లి తన దగ్గరున్న గాడిద కళ్లు సమర్పించాడు.
      “ఏమిటివి" అని మహారాజు ప్రశ్నించాడు. “గాడిదగుడ్లు" అని జవాబిచ్చాడు శివశాస్త్రి. మహారాజు కోపించి శాస్త్రిని సేవకులతో కొరడాతో  కొట్టించాడు. 'కష్టాలు మేలుకే వస్తాయ'ని ఒక సామెత వుండటం చేత శివశాస్త్రి ఆ దెబ్బలను ఓర్పుతో సహించాడు.
         తరువాత శివశాస్త్రి పండితుడని తెలుసుకొని రాజు జాలిపడి శివ శాస్త్రీని తమ రాజ్యానికి ఆహ్వానించాడు. అతనికి కొన్ని రోజులపాటు ఒక విడిది ఏర్పరచాడు. దెబ్బ లకు పరిహారంగా శివశాస్త్రి సుఖంగా కొన్ని రోజులు గడిపాడు.
        ఒకనాడు శివశాస్త్రి రాజదర్శనం కోసం అంతఃపురానికి వెళ్లాడు. పండితుడని ఎవరూ అడ్డగించ లేదు. ఆ సమయంలో మహారాజు రాణిగారి తొడమీద తలవుంచి నిద్ర పోతున్నాడు. శివశాస్త్రి నిర్భయంగా , అక్కడకు వెళ్లి, రాణిగారి రెండవ తొడమీద తలపెట్టి పడుకున్నాడు. రాణి అదరిపోయి
మహారాజును లేపింది. రాజు కోపంతో “ఎందు కట్లా చేశా' వని అడుగగా శివశాస్త్రి యథా రాజాతథా ప్రజా' 'రాజట్లావుంటే ప్రజలట్లా వుంటారు. అందుకు మీరున్నట్లే నేనున్నా'నని అన్నాడు. మహారాజూ  వెఱ్ఱి శివశాస్త్రిని బయటకు గెంటించాడు.
       శివశాస్త్రి తిరిగి యిల్లు చేరుకున్నాడు. అత్తగారు అల్లుడు వచ్చాడని ఆనందంతో ఆహ్వానించింది. గౌరవ మర్యాదల తర్వాత స్నానానికి నీళ్లుతోడి అల్లుడిని పిలిచింది. బిందెలో నీళ్లు చూచి శివశాస్త్రి  “కదలని నీరుకంటె పారే నీరు మంచిద'ని ఆ బిందెడు నీళ్లు తూములోపోసి "హరహరా" అని దొర్లసాగాడు. అంతా అది శివశాస్త్రి  కలవాటని ఊరుకున్నారు.
         స్నానం తరువాత భోజనానికని
పీట వేశారు. 'కొత్తల్లునికి మెత్తని ఆసనం పనికి రాద' ని, శివశాస్త్రి పిడకల మీద కూర్చున్నాడు. అక్కడికి అత్తగారు భోజనం తెస్తే, "భోజనం కన్నా పిండి మంచిదని శివశాస్త్రి అక్కడే పళ్లెంలో వున్న పిండి బొక్కసాగాడు. 'ఒట్టి పిండి తింటావేం నాయనా' అని అత్తగారు నెయ్యి తెచ్చి వేస్తే, నెయ్యికన్నా ఆముదం మంచిదని, ఆముదం వేసుకొని పిండినంతా ఆరగించాడు.  ఇదంతా శివశాస్త్రి పధ్ధతిలేమ్మని అంతా అనుకొన్నారు.
        భోజనం అయింతర్వాత శాస్త్రి భార్య అతనివద్దకు వచ్చింది. ఆమె చాలా అందకత్తె. 'భార్య రూపవతి శత్రు:' అని ఒక సామెత ఉంది. 'ఆమె నాకు శత్రువే ' అని కోపంతో ఆమె ఒక కన్ను పొడిచి వేశాడు. ఒక కన్నుపోయిన స్త్రీ దేశసంచారం చేస్తుందని,  'ఏకాక్షీ దేశసంచారీ ' అనే సామెత గురువుగారు శివశాస్త్రికి చెప్పాడు. అందుచేత భార్య పర్యటన చేస్తుందని భయపడి శివశాస్త్రి
ఆమె రెండనకన్ను కూడా పొడిచేశాడు.
         రెండు కళ్లూ పోవటంతో శాస్త్రి భార్య గగ్గోలు పెడుతూ ఆటూ యిటూ  పరిగెత్తే సరికి గూట్లో దీపం ఆమె చేతికి తగిలి క్రిందపడి క్రమేణా యిల్లంతా అంటుకొని వ్యాపించింది. ఇంట్లో వారంతా బయటకు పరిగెత్తి ఆర్పసాగారు. కాని శివశాస్త్రి యింటికి నిప్పంటుకోనిచోట్ల అంటించ సాగాడు. బావమరుదులు 'యిదేమిట'ని కోప్పడితే 'ఉష్టేన శీతలం' నిప్పుకు నిప్పు తగిలితే చల్లారుతుంది అని శివ శాస్త్రి హితబోధ చేయసాగాడు. బావ మరుదులు ఆగ్రహంతో వాడిని  కొట్టి, బైటికి సాగనంపారు.
      చూశారా, మూర్ఖంగా సామెతలు తెలుసుకొని, వాటిని అర్థం చేసుకోకుండా ఆచరించటం వల్ల శివశాస్త్రి ఎన్ని బాధలు
పడ్డాడో.  ఎన్ని బాధలు పెట్టేడో. కాబట్టి మనం ఏ విషయమూ అపార్థం చేసుకొనకుండా ఆచరణలో పెట్టాలి. లేకపోతే ఆపదలు తప్పవు.
(ఆంధ్ర ౼ వార పత్రిక,  2.9.1959)
కామెంట్‌లు