జన్మ సంస్కారం౼ వి.సదానందం--అరవై ఏళ్లనాటి బాలల కథలు..13-- (సేకరణ: డా.దార్ల బుజ్జిబాబు)

  కృష్ణాతీరంలో వెలనాటి ప్రాంతంలో ఒకానొక చిట్టడవి. ఆ అడవిలో ఒక పెద్ద మద్ది చెట్టు. చిరకాలంగా ఆ చెట్టు అక్కడ వుంది. శాఖోపశాఖలతో విశాలంగా ఉన్న నీడను బాటసారు లనేకులు ఎప్పుడూ విశ్రాంతి తీసుకు నేవారు.
      ఆ చెట్టు కొమ్మల నాశ్రయించుకుని ఎన్నో రకాల పక్షులు కాపురముండేవి. అవి తెలతెలవారుతుండగా కిలకిలలాడుతూ గూళ్లు వదలి ఆహార సంపాదనకోసం పోయి సాయం కాలానికి తిరిగివచ్చేవి. పిల్లల తల్లులు అట్టేదూరం పోకుండా గింజలు ఏరుకువచ్చి పిల్లలకు తినిపిస్తూ ఉండేవి. 
         వ్యాపారం మీద కాలినడకను దివిసీమ ప్రాంతాలనుంచి గుంటూరు సీమకు వస్తూ పోతూ ఉండి బాట సారులు సామాన్యంగా ఆ చెట్టు కిందనే మిట్ట  మధ్యాహ్నపు ఎండలో విశ్రమించి కట్టుకు తెచ్చుకున్న అన్నాలు తినిపోతూ ఉండేవారు. 
         అయితే ఆ చెట్టు క్రింద పడుకున్న బాటసారులకు ఎవరికో ఒకరికి ఎప్పుడూ ఒక శాస్తి జరుగుతూ ఉండేది. ఒక రోజూ రెండు రోజులూకాదు. తప్పనిసరిగా విశ్రమించి వెళ్లేలోగా బాటసారుల్లో మంచి దుస్తులు వేసుకున్న వారి పై ఒక కాకి రెట్ట వేస్తూ ఉండేది. మనస్సు చివుక్కుమన్న బాటసారులు ''చీ! శత్రువు పోగయింది. ఎన్నడు చస్తుందో పాడు కాకి!" అని శపిస్తూ ఉండేవాళ్లు,
      ఇలా కాలం జరిగిపోతూ ఉండగా ఆ కాకి పెద్దదై పోయింది. కాలంతీరే సమయం వచ్చింది. పాపం కాకి మనస్సులో ఒక్కసారి ఆలోచన కలిగింది - " నేనిన్నాళ్లు బ్రతికాను. ఎన్నడూ ఒక్క మంచిపని అయినా చేయ లేదు కదా. ఇక నాకు స్వర్గ ప్రాప్తి లేదు కాబోలు" అని ఆ ఆలోచనతో అది మంచం పట్టింది.
         ఒకనాడు ఆ కాకి ఒక్కగానొక్కడైన తన కొడుకును పిలిచి "నాయనా - నా రోజులు అయిపోయినాయి. నేను వెళ్లి పోతున్నాను. జీవితమంతా నలుగురూ రోసిపోయేలాగ దుష్కార్యాలు చేశాను. ఎండకు తాళలేక విశ్రమించిన బాటసారులపై కొంటెతనంగా రెట్టవేస్తూ నిద్రాభంగం కలిగించాను. మదంతో కావాలని చేసిన పొరపాట్లకు పరిహారం లేదు. ఇక నాకు స్వర్గ ప్రాప్తి లేదు” అని కంట తడి పెట్టుకుంది.
           తండ్రి మాటలకు చలించి పోయింది. చిన్న కాకి.  "నానా! పశ్చాత్తాపం కలిగింది గదా. ఆదే పది వేలు - దుఃఖించకు. స్వర్గం తప్పక లభ్యమౌతుంది. ఈ చివరి క్షణాల్లో దేవుణ్ణి తలచుకో" మంటూ కన్నీరు కార్చింది.
         కాని ఆ మాటలకు తండ్రికాకికి ఊరట కలుగలేదు. చివరకు బాధతో, కొడుకుతో “అబ్బాయి -నాకు నువ్వు ఒక్కగానొక్కడివి. నాకు పేరు తీసుకు వచ్చే బాధ్యత నీది. నాకు స్వర్గం ఎలాగూ లేదు. కాని ఒక్కపని నీవు కొడుకు వైనందుకు చేయాలి." అని కోరింది. ఏమిటో చెప్పమని చెయ్యగలనని ప్రమాణం చేసింది  చిన్న కాకి!.
       అంతట కొడుకు భుజంపై తట్టి యిలా అన్నది. "కుమారా! నేను బ్రతికినన్నాళ్లూ నన్ను అంతా తిట్టి పోసినవాళ్లే.  నేను చచ్చిపోయిన తరువాత ఆ నలుగురూ నన్ను కిర్తించేటట్లు నువ్వు చెయ్యాలి. స్వర్గానికి పోకపోయినా భూలోకంలో నైనా నా అనంతరం నన్ను గురించి పలువురూ మెచ్చుకొనేటట్లు చేసి నా ఆత్మకు శాంతి కలిగించు ...ప్రమాణం చెయ్యి' అని.
        చిన్న కాకి ప్రమాణం చేసింది - పెద్ద కాకి ప్రాణం వదిలింది.
       తరువాత కొన్నాళ్ళు చిన్న కాకి తీవ్రంగా ఆలోచింపసాగింది. 'తన ప్రమాణం నిలబెట్టుకొనడం ఎట్లా?' అని పరిపరి విధాల మార్గం వెతక సాగింది.
        చివరకు ఒకరోజున ఉపాయం తట్టింది. ఉపాయం కూడా తన సంస్కారానికి అనుగుణంగానే తోచింది కాకిపిల్లకు.
         రోజూ మామూలుగా వచ్చి విశ్రాంతి తీసుకుంటూ  "కాకి చచ్చింది. పీడవదిలింది" అనుకుని హాయిగా పడుకుంటున్నారు బాటసారులు. ఆ రోజు ఆ మాటలు విన్న చిన్న కాకి గబగబా కొన్ని గులక రాళ్లు తన గూట్లో నిలవ చేసుకుని మరునాటి నించీ - ప్రతి బాటసారి పైన రాయి వేయడం, ఠపీమని రాయి తగలగానే ఏమిటా అని తలయెత్తి పైకి చూస్తుండగా బాటసారి మొహాన రెట్ట వేయడం మొదలు పెట్టింది. ఇలా నిర్విరామంగా కాకిపిల్ల చేస్తున్న ఈ ఘోరానికి విసిగిపోయి పౌరులు "ఛి దీని మొహం మండ. ఇదెక్కడినించి దాపురించింది? పాడుబుద్దీ ఇదీని. దీని తండ్రి సయం. పాపం బట్టల మీద రెట్ట వేసేది. దీనికిదేంపోయేకాలం. ఎక్కడికి పోతుంది జన్మసంస్కారం" అని తిడుతూ ఉండేవాళ్లు.   కొందరు "ఆహా రెట్ట వేసినా మర్యాదగా వేసేదండీ దీనితం డ్రి" అని కొందరు పెద్ద కాకిని  కీర్తించేవాళ్లు." తనను తిట్టినా తన తండ్రిని మెచ్చుకునేటట్లు చేయ గలిగానుకదా అని పాపం అమాయకపు కాకిపిల్ల సంతోషిస్తూ అలాగే కాలం గడిగింది.
(ఆంధ్ర పత్రిక.  23.9.1959)
కామెంట్‌లు