గుడ్డి న్యాయం ౼ యం. ఎల్. పతి.;-అరవై ఏళ్లనాటి బాలల కథలు..15--సేకరణ : డా.దార్ల బుజ్జిబాబు

  ఒక సారి ఓ లావుపాటి గురువు, తన బక్క పలచని శిష్యుడితో దేశ సంచారానికి బయలు దేరి ఓ నగరాన్ని చేరుకున్నారు. గురువు నగరపు పొలిమేరలో ఓ పెద్ద చెట్టు క్రింద విశ్రమించి శిష్యుని వంటకు కావవలన సరకులు కొనుక్కురమ్మని నగరానికి  పంపాడు. ఆ శిష్యుడునగరానికి  వెళ్ళిన తర్వాత - ఆ నగరంలో ప్రతి వస్తువు ఒకేధరకు లభిస్తుందని తెలిసింది.  వంట సరకులు కొనడానికి వచ్చిన శిష్యుడు మిఠాయిలు కూడా అదే ధరకు శేరు అమ్ముతున్నారని - తెలియడంవలన తెచ్చిన డబ్బులతో ముఠాయి కొనేశాడు.
          ఆ కొన్న మిఠాయిలతో గురువు దగ్గరకు వచ్చాడు. తర్వాత తెచ్చిన మిఠాయి పొట్లాలను గురువుముందు పెడుతూ "గురువుగారూ! ఈ నగరంలో ప్రతివస్తువు ఒకే ధరకు శేరు చొప్పున అమ్ముతున్నారు. అంటే, బియ్యం, జొన్నలు కొనే ధరకే యిచ్చట చక్కని నేతిమిఠాయి దొరుకుతుంది. కావున మనము ఈ నగరంలోనే ఉండిపోదాం" అన్నాడు శిష్యుడు
       అప్పుడు గురువు శిష్యుడితో "ఇది న్యాయశూన్యనగరంరా శిష్యా!  కావున  యిక్కడే ఉండిపోతే ఎప్పుడో ఓ రోజు తప్పక చిక్కులో చిక్కుకుంటాం అని బోధించాడు. కాని గురువుగారి హిత బోధ శిష్యుడి మెదడు కెక్కలేదు. ఆ నగరం వదిలి కదలనంటే కదలనని పట్టుపట్టాడు. ఇక విదిలేక గురువు కూడా శిష్యుడితో ఉండిపోవాల్సి వచ్చింది. ప్రతిరోజు కోవా,పాలతో చేసిన మిఠాయిలు తింటూ బక్కపలచని శిష్యుడు లావెక్కసాగాడు. 
     ఒకరోజు ఆ నగరపురాజుగారి దగ్గరకు ఓ పిర్యాదు తీసుకురాబడింది. ఒక యింటిగోడ కూలడంవల్ల ఓ గొల్ల వాడి మేక దానికిందపడి చచ్చిపోయింది. అందువల్ల రాజు, ఆ యింటియజమానిని ఉరితీయండని ఆజ్ఞాపించాడు. కాని
ఎప్పుడైతే యింటి యజమానిని ఉరికంభానికి తీసుకొనివచ్చారో అప్పుడు ఉరితాడు యొక్క మెడకు తగిలించే కొలకిడి నేరస్థుడి మెడ సన్నగా ఉండడంవల్ల వదులుగా ఉంది.
            అప్పుడు రాజు ఆ సన్నని మెడగల యింటి యజమానిని వదిలి ఆ ఉరికి సరిపోయే లావైన మెడగల వ్యక్తిని తీసుకువచ్చి ఉరి తీయండని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం సైనికులు లావైన వ్యక్తి అన్వేషణార్థం బయలు దేరారు. వాళ్లు ఊరి చివరకు వెళ్లేసరికి చెట్ట కింద కూర్చొని ఉన్న గురుశిష్యులు కనిపించారు. అప్పుడా సైనికులు శిష్యుని లాక్కొని పోయారు. శిష్యుడికి ఆపద మూడిందని గురువుకూడా వాళ్ళ వెనకాలే వెళ్ళాడు.
         ఎప్పుడైతే శిష్యుని ఉరికంబంమీదికి తీసుకెళ్ళారో అప్పుడు గురువు గబగబా అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చి  నన్ను ముందు ఉరితీయండి"  అని అరవసాగాడు. అప్పుడు ప్రజలంతా కారణమేమిటని గురువును అడిగారు. అప్పుడతను " నా విద్యా ప్రభావంతో  ఈ ఘడియలో ఎవరైతే ఉరి తీయబడతారో వారు నేరుగా స్వర్గానికి వేళతారని తెలుసు కున్నాను. అందువల్ల నేను స్వర్గానికి వెళ్లే ఈ చక్కని అవకాశాన్ని
వదలదలచుకోలేదు. కావున నన్ను ఉరి తీయండి" అని అరవసాగాడు.
          గురువుమాటలు విన్న ప్రతి వక్కడికి తిన్నగా స్వర్గానికి వెళ్ళాలన్న కోరక కలిగింది. అందువల్ల ప్రజలంతా "నన్ను ఉరితీయండి, నన్ను ఉరితీయండి" అంటూ ఉరికంభం మీదికి రాసాగారు.
           ఈ వార్త తిన్నగా రాజు దగ్గరకెళ్లింది. అతడు వెంటనే ఉరికంభానికి పరిగెత్తుకుంటూ వచ్చి ఉరితాడు కొరికిడిని మెడకు తగిలించుకొని “నన్నుఉరితీయండి"ని సైనికులకు అజ్ఞాపించాడు. రాజే స్వయంగా ఉరికంభం ఎక్కేసరికి ప్రజలంతా కంభం మీదినుంచి ప్రక్కకు తొలిగారు. రాజుగారు ఉరితీయబడ్డాడు.
         ఈ విధంగా గురువు తన శిష్యుని
రక్షించుకొని మరుక్షణమే ఆ నగరాన్ని వదిలి వెళ్లిపోయాడు. అప్పటినుండి శిష్యుడు గురువు మాటని కాదనకుండా అతడు చెప్పినట్లు నడుచుకోసాగాడు..
(ఆంధ్ర వార పత్రిక ౼   30.9.1959)
కామెంట్‌లు