దేవుడి శ్రద్ధ ౼ " వేల్పుచర్ల " 2.9.59.(అరవై ఏళ్ల నాటి బాలల కథలు...8) సేకరణ : దార్ల బుజ్జిబాబు

   శ్రీరామకృష్ణ పరమహంసశిష్యుల్లో ముఖ్యుడు వివేకానందుడు. రామకృష్ణ పరమహంస సాంగత్యమూ,శిష్యత్వమూ కలగక ముందు వివేకానందుడు పరమ నాస్తికుడుగా వుండేవాడు. దేవుని సంగతి ఎవరన్నా అన్నట్టు వినపడిందా వీపు చిట్లగొట్టు తుండేవాడు. అలాటి పరమ నాస్తికుడు కూడా రామకృష్ణ పరమహంస శుశ్రూషలో అత్యుత్తముడైన ఆస్తికుడుగా తయారైనాడంటే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏముంది!
       వివేకానందుడు మత సంబంధంగా విదేశాల్లో పర్యటించి వివిధ ప్రాంతాల్లో ఉపన్యాసాలు కూడా యిచ్చాడు. ఆయన పర్యటన లో ఎన్నో విశేషాలు జరిగాయి. అందులో ఒకటి చాల విచిత్రం.
          అప్పుడు ఆయన అమెరికాలో పర్యటిస్తున్నాడు. ఏదో ప్రదేశంలో తన కార్యక్రమం ముగించుకుని ఇంకోచోట మళ్లీ మొదలు పెట్టవలసి నందువల్ల ఆ య నొక సుదీర్ఘ మైన రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. పొద్దున ఏడు గంటలకి రైలెక్కాడు. నిర్ణీతమైన కాలంలో రైలు నడిచిందం టే మరు రోజు తెల్లవారేసరికిగాని ఆయన గమ్యస్థానం చేరలేడు. అంతటి సుదీర్ఘమైన ప్రయాణ మది.
         రైలో ఆయనోమూల కూచున్నాడు. చుట్టుపక్కల ఎంతో మంది ఎన్నో రకాలుగా వుంటూ, ఏవేవో మాట్లాడుకుంటూన్నా ఆయన కనీసం వారి వెపేనా చూడటం లేదు. అందరితోటీ ముభావంగా వున్నాడు. అయితే ఆయన భారత దేశం నుంచి వచ్చిన ఒకానొక మహాయోగి అని అక్కడున్న వారికి తెలియదు. ఆయన బాహ్యస్వరూపమే వాళ్లకు తెలియనప్పుడు, ఆయన అంతఃశక్తి , మహత్తు వారికి తెలియకపోవడం విశేషం కాదు.
        బండి పరుగిడుతూ వుంది. క్రమంగా పొద్దెక్కిది. మధ్యాహ్నం కూడ మీరి పోతూంది. పొద్దట్నించీ పచ్చి మంచి నీళ్లేనా ముట్టలేదు వివేకానందుడు. ఆయనతో పాటు  దూర ప్రయాణం చేస్తున్న వాళ్లిది గమనించారు. వాళ్ళు భోజనం చేస్తూ ఆయనకు కూడా పెట్టబోయారు. సున్నితంగా చేత్తో వారించాడు వివేకానందుడు.  కనీసం రొట్టెముక్కయినా పుచ్చుకోమని బలవంతం చేశారు. కాని, వివేకానందుడు తనకి భోజనం దేవుడు పంపిస్తాడనీ, అది వచ్చే వరకూ ఏదీ - ముట్టుకోదలచలేదని వాళ్లకి సమాధానం చెప్పాడు ! రెండు మూడు సార్లిలా అనేటప్పటికి ఆయన విషయం తెలుసుకోలేక పిచ్చి వాడికింద జమకట్టి తమలో తాము నవ్వుకున్నారు.
       పరుగిడుతూన్న బండి ఒక్క సారిగా ఓ కుదుపుతో అగింది ఓ స్టేషన్ లో, ఎక్కే వాళ్లు ఎక్కుతూన్నారు. " దిగేవాళ్లు దిగుతున్నారు. ఇంతలో ఓ కుర్రాడు పెద్ద కారియర్ పట్టుకొని స్టేషన్లోకి వచ్చాడు. స్టేషన్ మాస్టర్ని భారతదేశం నుం చి పస్తూన్న సన్యాసి వుండే దెక్కడ” అని అడిగాడు. ఆయనవల్ల తెలుసుకుని నేరుగా, వివేకానందుడున్న దగ్గరికి వచ్చి ఆయన్ని సమీపించి మస్కరించి యిలా అన్నాడు ఇంగ్లీషులో "స్వామి రాత్రి నాకు ఏసు క్రీస్తు ప్రభువు కలలో కనిపించి మీరు ఈ బండిలో వస్తున్నారని, మీకు భోజనం తీసుకువెళ్లమనీ చెప్పారు. అందుకే తెచ్చాను. ఆరగించండి స్వామి."
    కారియర్ మూతతీసి, ప్లేటులో
వడ్డించాడు ఆ కుర్రాడు. వివేకానందుడు ఏమి మాట్లాడకుండా ఆప్యాయంగా ఓసారి. ఆ కుర్రాడి మొహంలోకి చూచి ఆరగించటం మొదలెట్టాడు.
       కుర్రాడు చెప్తూన్న మాటలు విని తెల్ల బోయారు. ఆయన్ని పిచ్చివాడనుకున్న ప్రబుద్ధులంతా, ఆయన వైపు చూళ్లేక మొహం తిప్పుకొని పశ్చాత్తప్తులై మనస్సులోనే ఆయనకు  నమస్కరించారు. తన భక్తునికి భోజన సదుపాయాలు కల్పించడంలో భగవంతుడు చూపిన శ్రద్ధచూస్తే భగవంతునిపై ఆ భక్తుని ప్రభావం ఎలా పని చేసిందో ఊహించవచ్చు.
(ఆంధ్ర ౼ వార పత్రిక , 2 - 9 - 1959)
కామెంట్‌లు