.ఆయుర్వేదం ౼ పాండిత్యం ౼ మధురశ్రీ, 2.9.59 (అరవై ఏళ్లనాటి బాలల కథలు..9) సేకరణ: దార్ల బుజ్జిబాబు
  మాళవ రాజ్యాధిపతి విక్రమవర్మ
ఆస్థానంలో ఒక ఆయుర్వేద వెద్యుడూ, ఓ పండితుడూ వుండేవారు. వైద్యుని పేరు నిగమశర్మ. పండితుడి పేరు కేదారశర్మ. ఒక్క క్షణం కూడా యిద్దరికీ పడేది కాదు.  
     ఇలా వుండగా ఓసారి పండితుడు
కేదారశర్మకు  వళ్లు సుస్తీ  చేసింది. గత్యంతరం లేక వైద్యుడికి కబురు పంపాడు.  కబురు వినగానే వైద్యడు మండిపడ్డా "అయ్యో! పాపం? రోగి కదా" అన్న అభిప్రాయంతో బయలు దేరి వచ్చాడు.
        రాగానే పండితుడి నాడి పరీ
క్షించి  "అబ్బే! మరేం లేదు. మామూలు - జ్వరం. లంఘనం చేసి కాస్త కంటకారి కషాయం త్రాగితే సరి. "రేపీపాటికి తగ్గిపోతుంది" అని చెప్పి వెళ్లాడు.
          పండితుడు కేదారశర్మ  పాండిత్యంలో ప్రతిభావంతుడే కాని- ఆయుర్వేదంలో యిసుమంతైనా పరిచయం లేనివాడు. అంచేత లంఘనం అంటే ఏమిటో. కంటకారి అంటే ఏమిటో అర్థం కాలేదు. ఎవర్నన్నా అడుగుదామంటే నామోషీ. చతు
శ్శాస్త్ర పండితుడినైన నేను కేవలం
రెండు శబ్దాల అర్ధం తెలీక. యితరుల
నడగటమా అన్న అహంభావం కలవాడు. అందుకని తానే  ఆలోచించి లంఘ్ అన్న శబ్దం  నుండే లంఘనం అన్న ధాతువు వస్తుంది. యిహ లంఘ్ అంటే  ఎగిరి దూకటమన్న అర్ధం తెలుస్తూనే వుంది అని నిర్ధారణ చేసి కూతురు శాంబరినిపిల్చి నిచ్చెన తెచ్చి గోడకు చేరగిల వేయమన్నాడు.
      అక్షరాలా పితృవాక్యపరిపాలకురాలైన శాంబరి అలాగే తెచ్చి వేసింది. పండిత పుత్రః పరమ శుంఠః అన్నట్లు శాంబరి లౌకిక జ్ఞానం లేని శుద్ధ చవట.  వెంటనే పండితుడు తెళ్లుతున్న జ్వరంతో ఎలాగో తంటాలుపడి . చివరిదాకా ఎక్కి  అక్కడ్నించి “దబీ"మని, లంఘించాడు. అంత ఎత్తునుంచి దూకటంతో కాళ్లు రెండూ విరిగాయి. మోకాళ్లు మోచేతులూ కొట్టుకు పోయాయి. ఒళ్లంతా హూనం అయింది.
        ఇంతలో శాంబరి వచ్చి  "నాన్నా
లంఘనం చేశారా?"  అంది.
         "చేశానమ్మా! చేశాను! మోకాళ్లు రెండు విరుచుకున్నాను. అయినా లంఘనం యింత ప్రమాదకరమైందని నాకు తెలియదు" అన్నాడు బాధతో
       "అయితే మరి! కషాయం పెట్టాలా?"
        “పెట్టమ్మా! పెట్టు! లంఘనం చేసి కషాయం తాగకపోతే ఎలా?” అన్నాడు. మూల్గుతూ.
          మరి! కంటకారి అంటే ఏమిటో! నాకు తెలియదే?" అయోమయంగా అర్ధం కాని ముఖం పెట్టి అడిగింది శాంబరి.
          “ఆ! ఏముంటుందమ్మా! కంట
కస్య అరిః - కంటకారి అవుతుంది. కంటకస్య అంటే ముళ్లకు. అరి: అంటే శత్రువు. ముళ్లకు శత్రువు చెప్పు కదటమ్మా! మన వుగ్రాణంలో తాతలనాటి పాత జోడు ఒకటి చూరులో దోపివుంటుంది. దాన్ని బాగా శుద్ధి చేసి - చాది కపాయం పెట్టుకురా!” అన్నాడు. అప్పటి కే. మోకాళ్లు రెండూ రబ్బరు బెలూన్ల మాదిరి వాచి పోయాయి.
          అరగంట కల్లా అడిగిన ప్రకార
కషాయం పెట్టకొచ్చి తండ్రికిచ్చింది కూతురు. కషాయం కడుపులోకి వెళ్ళింది మొదలు కలియపెట్టటం ప్రారంభించింది, ఎడ తెరిపి లేకుండా వాంతులు చిమ్మసాగాయి. కక్కలేక కళ్లు తిరిగాయి. స్పృహతప్పిన వాడిలా నీరసంతో పడక పై వాలి పోయాడు.
         వైద్యుడు మర్నాడు యథా ప్రకారం వచ్చాడు రోగిని చూట్టానికి. రాగానే మోకాళ్లకంతా పట్లతో, పీక్కుపోయిన కళ్లతో పాలిపోయిన  ముఖంతో చచ్చేట్టున్న శర్మగారిని చూసేసరికి గుండె గుభేల్మంది. 
          "ఏమండీ! అలా నీరసంగా వున్నారు?" వుండపట్టలేక అడిగాడు వైద్యుడు.   
         "ఏముంది! నువ్వు చెప్పినట్టే లంఘనం చేయమంటివి. చేసాను. అంత ఎత్తునుంచి దూకటంతో కాళ్ళు రెండు విరిగాయి. కంటకారి కాషాయం త్రాగమంటివి. తాతలనాటి పురాతనమైన పాత జోడుతో కాషాయం పెట్టించి తాగాను. కక్కలేక చచ్చా" అన్నాడు మూల్గుతూ
       వైద్యుడు పండితుని తెలివితక్కువ తనానికి తానే నవ్వుకుని - యింకా పండితుడి గర్వం అణచాలనే వుద్దేశంతో ౼౼ "మంచిపని చేశారు! మీ శరీరంలో చాలా కాలంగా పేరుకున్న - పైత్యం - వాతం రెండూ కరిగిపోయాయి. ఇంకేం పర్వాలేదు. బోడితరం లేదూ. అది తీసుకొచ్చి యీ చూర్ణం అందులో వేసి కాషాయం త్రాగారంటే -  రేపీపాటికల్లా మామూలు మనిషవుతారు" అన్నాడు. 
   "బోడితరం ఎక్కడుంటుంది?" ముసుగు తీయకుండానే అడిగాడు వైదుణ్ణి.
       "ఆ ! ఎక్కడో ఏముంది. కాస్తా! చల్లగావుండే నీటి అంచున వుంటుంది. వస్తా రాజవీధిలో మరొకరి యింటికి వెళ్ళాలి" అంటూ వెళ్ళిపోయాడు వైద్యుడు.
      వైద్యుడు వెళ్లగానే  పండితుడు ముసుగుతీసి శిష్యుడ్ని పిలిచి -
       "ఒరేయ్! అబ్బాయ్! వెళ్లి బోడితరం తీసుకురా?" అని ఆజ్ఞాపించాడు. 
         అందుకు ౼ "బోడితరం! అంటే ఏమిటి స్వామి?" తెలీక గుడ్లు మిటకరించాడు శిష్యుడు. 
        ఆఁ ! ఏముంది రా! ఇయం బోడః - ఇయం బోడతరః - ఇయం బోడతమః - ఇహ బోడః - అంటే నున్నగా గుండ్రంగా వుటుంది. నువ్వు తేవాల్సింది. బోడతరం - ఇది చల్లగా నీటి అంచున మధ్యస్తంగా వుంటుంది. ఫో" అన్నాడు,
     చెప్పిందే తడవుగా దబదబా. పరిగెత్తాడు శిష్యుడు చెరువుగట్టకు. అప్పుడే సరిగ్గా అదేసమయానికి నున్నగా గుండ్లు చేయించుకొని గొంతులోతు నీళ్లలో మునిగి ముఖాలు అటు వేపు సారించి  వున్నారు.
         శిష్యుడికి వరసగా మూడుగుండ్లు కనిపించగానే-ఇయం బోడ: - ఇయం - బోడతర:  - ఇయం బోడతమః . గురువు గారు తెమ్మంది బోడతరం. అంటే రెండవది. అనుకుంటూ వెళ్లి ఒక్క దూకున లటుక్కున పట్టుకున్నాడు గట్టిగా, జారిపారిపోతుందేమోనని.
        హఠాత్ సంఘటనకు  దిగ్భ్రాంతుడైన సాతాని, శిష్యుడు చెంపవాచిపోయేలా సాచి లెంపకాయ అంటించేడు.  దాంతో తతిమ్మా యిద్దరు కూడా చేరి శిష్యుడి దేహం హూనం చేసి మరీ వదిలిపెట్టారు.
     శిష్యుడు ఏడుస్తూ గురువును చేరి - మీరు సాయించినట్లు చెరువు దగ్గర యియం బోడ:, యియం బోడతర:-, యియం తమః, మూడూ వున్నా యి. పోయి జోడతరాన్ని పట్టుకొన్నా. అంతే సాచీ వాచిపోయేలా లెంపకాయ యిచ్చింది. అంతటితో ఆగక  తతిమ్మా  బోడ:,  బోడతమ: , - రెండు కూడా చేరి నన్ను చావగొట్టాయి. అంచేత నేను బోడతరం తేలేను! స్వామీ!” అంటూ భోరున ఏడ్చాడు.
         మరునాడు యథావిధిగా వైద్యుడు రాగానే "గీ" మంటూ తగులుకున్నాడు. పండితుడు కేదారశర్మ- "నీకు వైద్యమూ రాదు! నా శ్రాద్దమూ రాదు. నువ్వొక శుద్ధ అప్రయోజకుడివి. లేకుంటే లంఘనం
అంటూ కాళ్లు చేతులు విరిచావ్ !
కంటకారి సాకుతో శుద్ధ శ్రోతియునైనా నా చేత చెప్పు నీళ్లు త్రాగించావ్ ! అంతటితో ఆగక బోడతరమని నలుగురిలో నా శిష్యుణ్ణి వొళ్లు వాచేలా కొట్టిస్తావా! అసలీ పేర్లు ఆయుర్వేదంలో వున్నాయా! లేక నన్ను భంగం చేయాలనే యివి కల్పించావా! చెప్పు! రేపు ఆస్థానంలో నీ పరువు పది మందిలో తీయిస్తాను !" అంటూ హుంకరించాడు.
       అందుకు వైద్యుడు పక పక నవ్వి- "శర్మగారూ! మీకు సౌండిత్యముంది. కాని ఆయుర్వేదం తెలియదు. నాకు ఆయు ర్వేదం తెలుసు కాని పాండిత్యంలో పరిచయం లేదు. మీరు అది తెలిసి కూడా నిండుసభలో చాలాసార్లు అపశబ్దాలు. అర్ధం లేని పదాలు అని అవమానాల పాలు చేసారు. సంస్కృతంలో శబ్ద అర్థానికి - ఆయుర్వేదంలో వ్యావహారిక పరిభాషలో వున్న అర్ధానికి చాలా తేడా వుంటుంది. లంఘనం - అంటే తేలికగా ఆహారం పుచ్చుకోమనిగాని గోడ లెక్కి దూకమనటం : కాదు. కంటకారంటే చెప్పులు కావు. 'దాన్నే వాకుడు చెట్టు అంటారు. - మీకు సర్వం తెలుసునన్న అహం భావమే మిమ్మల్నీ గతికి తెచ్చింది. ఒకర్నడగటానికి నామోషీ! బోడతరమంటే ఎవర్నడిగినా చెప్పేవాళ్లే. చల్లటి ప్రాంతంలో అనగానే సాతానుల  గుండ్లు పట్టకొంటే ఎలా ? రేపీవిషయం సభ లోనే చెప్పండి ! నలుగురు మీ తెలివి తేటలకు నవ్వి పోతారు. ఇకనైనా బుద్దిగలిగి వుండటం మంచిది ! వస్తా! సెలవ్!" అంటూ చివాలున లేచి నిష్క్రమించాడు వైద్యుడు. 
       తన తెలివి తక్కువతనానికి తనలో తానే కుళ్లిపోయాడు పండితుడు !
( ఆంధ్ర ౼ వార పత్రిక,  2. 9. 1959 )
 ★★★★★★★★★★★★★★★

కామెంట్‌లు