ముక్కుకు సూటి ౼ అ. వెంకట రమణమూర్తి.(అరవై ఏళ్ల నాటి బాలల కథలు - 3)సేకరణ: డా.దార్ల బుజ్జిబాబు

 బాలలూ! మీకొక చక్కని కథ చెబుతాను. అందరూ శ్రద్ధగా వినండేం! ఎప్పుడేపని చేయాలో తెలియకపోతే, ఎంత చదువుకున్నా, ఆ చదువు నిష్ప్రయోజనం.
    అనగా అనగా ఒక వూళ్ళో వేదాధ్యయనం గారనే గురువుగారొకరుండేవారు. ఆయన చాలామంది శిష్యులకు పాఠం చెప్పేవాడు. సిద్ధప్ప అనేవాడు ఆయన ప్రియ శిష్యుడు. ఆ శిష్యులందరికి ఎప్పుడూ పాఠాలు కంఠతాపట్టడమేకానీ, ఆ చదువు ఎప్పుడేలా ఉపయోగించాలో ఏమీ తెలియదు.
       ఇలా వుండగా, సిద్ధప్ప ఒకనాడు గురువుగారి ఆజ్ఞ తీసుకొని తన వూరికి ప్రయాణమయ్యాడు.  కొంతదూరం వెళ్ళాక దారికాస్తా మర్చిపోయేడు. ఆ కాలంలో రైళ్లు కానీ బస్సులుకానీ లేవు. ఎంత దూరం అయినాసరే, నడిచితీరవలసిందే. ఎండ మండిపోతోంది. సిద్ధప్ప అలాగ కొంతదూరం నడిచి వెళ్ళేసరికి, ఒక చాకలివాడు గుడ్డలమూట భుజాన వేసుకుని ఎదురొస్తున్నాడు. సిద్ధప్ప, తన వూరు పేరు చెప్పి దారేదని చాకలివాణ్ణి అడిగాడు.  చాకలివాడు "ముక్కుకు సూటిగా పోవయ్యా" అని చెప్పి, తనదారిని తాను వెళ్లిపోయేడు. చాకలివాడు ముక్కుకు సూటిగా అన్నాడు కదా అని చెప్పి సరిగా తిన్నగా వెళ్లిపోతున్నాడు, మన సిద్ధప్ప. కొంత దూరం వెళ్ళేసరికి దారి లేదు; సరికదా దారికి అడ్డంగా  ఒక కొబ్బరిచెట్టు వుంది. ముక్కుకు సూటిగా వెళ్లకపోతే దారితప్పిపోతానేమో అని భయం వేసింది సిద్ధప్పకి. ఏమయితెం అయిందని అతి కష్టంమీద ఆ కొబ్బరిచెట్టు ఎక్కేసాడు, సిద్ధప్ప.
     కానీ, తీరా పైకి ఎక్కాక భయం వేసింది. దిగిపోదామనుకున్నాడు. కానీ దిగడం ఎలా? చెట్టుపట్టుకుని, గబగబా జారిపోదామనుకున్నాడు. కానీ, అలా చేస్తే,  వళ్ళు కొట్టుకుపోతుంది. అందుచేత, సిద్ధప్ప ఒక పని చేద్దామనుకున్నాడు. "మట్టపట్టుకుని జారితే చెట్టు సగానికి వస్తాం కదా!, మిగిలిన సగందూరం పాటు దూకితే పర్వాలేదు. అట్టే దెబ్బలు తగలవు. మన ఊరు, తర్వాత ఎవరినేనా సరిగ్గా దారి అడిగి వెళ్లవొచ్చు" అనుకున్నాడు. ఎలాగో అలాగ మట్టపట్టుకుని మెల్లిగా, కొనదాక వచ్చాడు. కిందికి దూకేద్దామనుకుంటే, కింద ముళ్లున్నాయి. సిద్ధప్పకి బాగా భయం వేసింది. కళ్ళు తిరుగుతున్నాయి. మట్ట తెగిపోయేలా వుంది. దారిని పోయేవాళ్ళందరిని బతిమాలాడు. కానీ, లాభం లేక పోయింది.
      అంతలో, ఆ దారమ్మట, ఆవూరి రాజుగారు గుఱ్ఱంమీద వస్తూ, మన సిద్ధప్ప కేకలు విని రక్షిద్దామని దగ్గరకు వచ్చారు. రాజంటే మరి ఆ రాజ్యంలోని జనాన్నంతా ఏ బాధా లేకుండా చూడాలిగా! ఆ రాజుగారు తిన్నగా కొబ్బరిచెట్టు క్రిందకు వెళ్లి గుఱ్ఱాన్ని నిలబెట్టి దానిమీద నించొని సిద్ధప్ప నడుం పట్టుకొని మట్ట వదిలెయ్యమన్నాడు. కాని సిద్ధప్ప మట్టని వదిలెయ్యలేదు. భయవేసి, కళ్ళుమూసుకుని నించున్నాడు. అప్పుడు రాజు "హేయ్ బ్రహ్మడా! అంతా భయం ఎందుకు? మట్ట వదిలేయ్" అన్నాడు. రాజు "హేయ్" అండంతోనే గుఱ్ఱం గభాలున పరిగెత్తింది.  రాజు గభాలున సిద్ధప్ప నడుం పట్టుకున్నాడు.
  కొబ్బరిమట్ట పట్టుకొని సిద్ధప్ప, సిద్ధప్ప నడుం పట్టుకొని రాజు, వేళ్ళాడుతున్నారు. రాజు సిద్ధప్పతో  "బ్రహ్మడా, మట్ట వదిలేయకు, మనిద్దరం కూడా కిందపడితే బుఱ్ఱ బద్దలవుతుంది. కావలసివస్తే నీకు బోలెడంత ధనం ఇస్తాను. ఎవరేనా వచ్చేదాకా మట్టవదలకు" అన్నాడు.
    సిద్ధప్పకు డబ్బు అనగానే ఎక్కడలేని ఆశ, వచ్చింది.  మట్ట వదిలి రెండు చేతులుజాచి "ఇంత డబ్బు ఇస్తావా?" అన్నాడు.  ఇంకేముంది! సిద్ధప్ప మట్ట వదిలెయ్యగానే, వాళ్లిద్దరూ కింద ముళ్ళకంపలో పడ్డారు. వళ్ళు అంతా హూనం అయిపోయింది. "చావుతప్పి కన్ను లొట్టోయినట్ట"యింది వాళ్ళ పని.  దారినపోయేవాలెవరో వారిని లేవదీసి, ఇంటికి పంపారు.
       చూచారా బాలలూ! ఎంత చదువుకుంటే మాత్రం ఏం లాభం! దేనికేనా సమయస్ఫూర్తి వుండాలి.
        (ఆంధ్ర వారపత్రిక 27.5.1959)
కామెంట్‌లు