కంచి మర్యాద౼ చల్లా రాధాకృష్ణశర్మ(అరవై ఏళ్ల నాటి బాలల కథలు - 4)సేకరణ : దార్ల బుజ్జిబాబు

 మనదేశంలోని పుణ్యస్థలాలలో కాంచీపురం ఒకటి. అక్కడికి అనేకమంది యాత్రికులు దూరదేశాలనుంచి కూడా వస్తూ పోతూ వుంటారు. 
      కంచికి దగ్గరగా ఒక పల్లెటూరు ఉన్నది. ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనిపేరు రామస్వామి.
         రామస్వామి అంతగా చదువుకున్న వాడు కాదు. చిన్నతనంలో బడికి వెళ్లాడమైతే వెళ్ళాడు కానీ,  ఆయనకు చదువు సంధ్యలు అంటలేదు. ఎలాగైతేనేం నూరు శ్లోకాలను తనవిగా చేసుకున్నాడు. అవసరం వచ్చినప్పుడెల్లా వాటిని ఉదహరించేవాడు. పాండిత్యం లేకపోయినా, ఆయనకున్నంత వ్యవహారజ్ఞానం ఆ ఊళ్ళో మరెవ్వరికిలేదు. అడపా దడపా ఆ ఊరి పెద్దలు ఆయన దగ్గిరకి  సలహాలకోసం వస్తూ ఉంటారు. రామస్వామి సలహా చెప్పాడంటే, ఎక్కడికి వెళ్లినా సరే దానికి  తిరుగు ఉండదు. అంతా వ్యవహార జ్ఞానం ఆయనకు.
      మరో విశేషం కూడా రామస్వామిలో ఉన్నది. కొమ్ములు తిరిగిన పండితుడైనా సరే ఆయన్ని మాటల్లో జయించలేడు. రామస్వామి చాలా చమత్కారంగా మాట్లాడతాడాని ప్రసిద్ధి. అందువల్ల ఆయనంటే ఆ ఊరి వారికి అంతులేని అభిమానం. ఆయన కనుక ఏ కారణం వల్లనైనా పొరుగూరికి వెడితేచాలు ఆ ఊరి వారికి ఆరోజు ఒక యుగంగా గడుస్తుంది. 
     ఆనాడు ఉదయం రామస్వామికి ఏదో అవసరమైన పని ఒకటి తగిలింది. అందువల్ల ఆయన కంచికి వెళ్ళవలసి వచ్చింది. కంచిలో ఆయనకు బంధువు లిద్దరు ముగ్గురున్నారు. కానీ  వాళ్ళ ఇళ్లకు పోవడం రామస్వామికి ఇష్టం లేదు. అందువల్ల ఇంట్లోనే భోజనం చేసి  వెళ్లడం మంచిదనుకున్నాడు. అప్పటికి ఇంట్లోనేమో ఇంకా వంట కాలేదు. పని తప్పనిసరి కావడం మూలాన రామస్వామి భోజనం చేయకుండానే బయలుదేరాడు. 
          రామస్వామి కాంచీపురం చేరుకునే సరికి పదకొండు గంటలయింది. ఇష్టం లేకపోయినా ఆయన బంధువుల ఇంటికే సరాసరి వెళ్ళాడు. ఎన్నడూ రాని చుట్టం రావడం వల్ల పిన్నా పెద్దలందరూ రామస్వామిని నోరారా పలుకరించారు. వాళ్ళ మాటలు వింటున్నంతసేపు ఒంటిమీద జర్రులు పాకినట్లుగా తోచింది ఆయనకు. అవతల ముఖ్యమైన పని పెట్టుకుని కాలహరణం చేయడం మంచిది కాదనుకున్నాడు. భోజనం మేళం వదిలిపోతే తాను నిశ్చింతగా వచ్చిన పని చేసుకోవచ్చునని అనుకున్నాడు.
          అంతలో ఒక ముసలావిడ వచ్చింది. వచ్చిరావడంతోనే " ఎరా ౼ రాము! ఎంతసేపయింది వచ్చి? భోజనం చేసి ఎండలో వచ్చావు గదా! కొంచెంసేపు కన్ను మూసి ఆ తరువాత మాటలు చెప్ప కూడదా? అన్నది.
       ఆమెను మింగి వేద్దామన్నంత కోపం వచ్చింది రామస్వామికి. ' కంచి మర్యాద' ఆయనకు తెలియంది కాదు.  కాంచిమర్యాద అంటే  మరేమీ లేదు. అనేక మంది  కంచికి వస్తూ వెడుతూ వుంటారు గదా? అలా వెళ్లినవాళ్ళు సాధారణంగా బంధువుల యిళ్ళకో , మిత్రుల ఇళ్ళకో వెడుతూ వుంటారు.  వచ్చిన వాళ్ళందరికి భోజనాలు పెట్టడం కొంచం కష్టమే మరి. కనుక ఇంటికి వచ్చిన వాళ్ళను చూచీ చూడటంతోనే మొదటి ప్రశ్నగా ఆ ఇంటి పెద్దలు " భోజనం చేసే వచ్చారుగా?" అని అడిగేవారు. దీనికే కంచి మర్యాద అని పేరు. 
      రామస్వామి నవ్వుతూ " కొంచెంసేపు విశ్రమించే యిక్కడకి వద్దామనుకున్నాను.  కాని, నేను వచ్చిన పని చాలా ముఖ్యమయింది" అన్నాడు.
      ముసలావిడ ఆదుర్తాగా " ఏమిటి నాయనా ౼ అంత ముఖ్యమైన పని?" అని అడిగింది.
         అప్పుడు రామస్వామి యిలా అన్నాడు. " మరో విషయమైతే నేనిక్కడికి  రావలసిన పనే లేదు. మీ మనమరాలికి రత్నంలాంటి ఒక సంబంధం వచ్చింది. నువ్వు నిజమనుకో, అబద్ధమనుకో౼ దాని అదృష్టం పండింది."
        ఆ ముసలావిడకు అంతులేని సంతోషం కలిగింది. రామస్వామి మాటలు వింటున్నంతసేపు మనవరాలి పెళ్లి మహా వైభవంగా జరుగుతున్నట్టే అనుకుంది. 
   ఆమె గొంతు సవరించుకుంది.
    "రామూ. ౼ పాపం ఎండనుపడి వచ్చావు. ఎప్పుడు భోజనం చేసావో ఏమిటో- లే - భోజనానికి" అన్నది తెచ్చుకున్న ప్రేమతో.
       రామస్వామి బెట్టు చేస్తూ  "ఇప్పుడే భోజనం చేసి వచ్చాను" అన్నాడు.
            "అలా కాదు . నువ్వు మా ఇంట్లో భోజనం చేస్తేనే  యీ ముసలి ఘటానికి సంతోషం కలుగుతుంది" అన్నది ఆప్యాయంగా.
       రామస్వామి ఈ సారి మరింత బెట్టు చేసాడు. ఆ ముసలావిడ మరింత రెట్టింపుగా భోజనానికి లెమ్మని  రామస్వామిని బలవంత పెట్టింది.
     చివరకి కడుపునిండుగా రామస్వామి భోజనం చేసాడు. ఆమె వద్ద సెలవు తీసుకొని "వెళ్లి వస్తాను" అంటూ  వచ్చిన దారి పెట్టాడు రామస్వామి.
   (ఆంధ్ర ౼ వారపత్రిక 3- 6-1959)
కామెంట్‌లు