గుర్తుకొస్తున్నాయి భోగి తలంట్లు;- సత్యవాణి కుంటముక్కుల, కాకినాడ-5.
  "ఇదిగో మరిడయ్యా! రేపు భోగిపండగ. తలంట్లకు  తెల్లారుఝామునే నీళ్ళుకాయడానికి రాత్రే దొంగబ్బాయినో,నానబ్బాయినో ,ఎవరినోఒకరిని వచ్చి ఇక్కడే పడుకోమను. కోడికూసే సరికి పైడమ్మవచ్చేస్తుంది తలంట్లు అంటడానికి."అమ్మ మా పెద్దపాలికాపు మరిడయ్యకి
పురమాయించేది.
       మధ్యాహ్నం పొలంనుండి పాలుతెచ్చే పాలికాపుతో,"రాత్రి వచ్చేటప్పుడు భోగిపిడకలదండలు తేవడం మరచిపోయేవుగనుక,రేపు పిల్లలు భోగిమంటలో వేయాలి."అమ్మ మరో పురమాయింపు పురమాయించేది.
   రాత్రి పాలుతెచ్చినప్పుడు, రకరకాలసైజులలో భోగిదండలు పొలంనుండి పాలికాపులు పట్టుకొస్తే, '"నాదీ దండ అంటే నాదీదండ అంటూ,వీలైనంత పెద్దదండలు ఏరుకోడానికి ప్రయత్నిస్తూ,ఆ ప్రయత్నంకుదరకపోతే,నాకు చిన్నదిచ్చారంటే,నాకుచిన్నదిచ్చారని ఏడ్చుకొంటూ,చెల్లెళ్ళూ తమ్ముళ్ళూ ,జుట్టూ జుట్టూపట్టుకొంటూ,నానా హైరానా పడుతుంటే, "కొట్టుకోకండమ్మా,చిన్నాళ్ళు చిన్నదండలూ,పెద్దాళ్ళు పెద్దదండలూ తీసుకోండ"ని నాన్న మధ్యవర్తిత్వంతో సర్దిచెపుతుంటే, "ఏదండైతే ఏమాటి? భోగిమంటలో వేసాకా,నిమిషంలో ఇలా పడెయ్యగానే,అలా బూడిదైపోవడానికీ "అంటూ అమ్మ వేదాంతబోధన చేసేది.
    ఎప్పుడు తెల్లారుతుందా!ఎప్పుడు భోగిమంటలో భోగిపిడకలు వేసి చలికాగుదామా అన్న ఆతృతతో ఆరాత్రి నిద్రేపట్టేదిగాదు.అయితే నిద్రలేవడానికి,భోగిమంటలో పిడకలు వేయడానికీ మధ్యన ఒక భయానక కార్యక్రమంవుండేది. అదేమిటంటే భోగితలంటు కార్యక్రమం. కోడికుయ్యగానే అమ్మ లేపుళ్ళు మొదలైయ్యేవి.
   "పిల్లల్లారా !లేవండి. వేడి నీళ్ళు మరిగిపోతున్నాయి.(ఎందుకు మరిగిపోవు?అడవిపొలంనుంచి తెచ్చిన మానుని మానులాగే పొయ్యలోకెక్కించి,పెద్దగాబునే పొయ్యిమీద కెక్కించి మంట మండిస్తుంటే) మీతలంట్లైతే ,మంగలి రామదాసువస్తాడు.నాన్నా ,చిన్నాన్నా తలంటడానికి,"అని రైల్వే ష్టేషన్ లో అనౌన్స్ మెంటులాగా ,మేంలేచేవరకూ, చెప్పిందే చెపుతూవుండేది. లేవకపోతే సౌండ్ పెంచేది.
    మా పిన్నైతే '"ముందు తలంటుకొన్నవాళ్ళు ముత్యాలగొడుగులు,వెనక పోసుకున్నాళ్ళు వెండిగొడుగులు "అంటూ ఊరించేది.ఇంకేముంది  ఆచలిలో గజగజ వణుకుతూనే,అందరం ముత్యాలగొడుగులమనిపించుకోవాలని పక్కదిగి పరుగో పరుగు తీసేవాళ్ళం, నీళ్ళుకాచేపాకలోకి.ఆదరా బాదరా కచికితో పళ్ళు తోమామంటే తోమేమనిపించుకొని,అమ్మ మా నెత్తిలమీద చమురెట్టగా,నాకుముందంటే నాకుముందు.నేను ముత్యాలగొడుగంటే, నేనూ  ముత్యాలగేడుగునే అంటూ పోటీలుపడి తోసుకొంటుంటే,అందరూ ముత్యాలగొడుగులే, వరుసగా కూర్చోండని,ఆడ పిల్లా లేదు,మొగ పిల్లాడూ లేదు .అందరికీ అమ్మా,పిన్నీ, కుంకుడుకాయ పులుసులు పోసేస్తుంటే,పైడమ్మా ,పాలికాపూ, అందరికీ ఒకేసారి  ఒకరినివిడచ ఒకరికి,బరా బరా రుద్దేస్తుంటే,కళ్ళలో పట్టినంత కుంకుడు పులుసు పట్టి ,మంటపుట్టిస్తుండగా,కళ్ళుమండిపోతున్నాయంటూ గంతులు వేస్తుంటే,జుట్టు గట్టిగా పట్టుకు పీకేస్తున్నారంటూ,పైడమ్మని,పాలికాపుని తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతూండగా,తలం ట్లకార్యక్రమం పూర్తి అయ్యేది.ఏమాటకామాట చెప్పుకోవాలి.వడవడ వణికించే చలిలో,వేడివేడి నీళ్ళతో స్నానమాడుతున్నప్పుడు కలిగే హాయి చెప్పటానికి మాటలుండవు.
     అందరం పొలోమని కళ్ళమంటతగ్గడానికి, వంటింట్లోని చింతపండు రాచ్చిప్పదగ్గరకీ,ఉప్పురాచ్చిప్ప దగ్గరకీ పోయి,చింతకాడా, ఉప్పుబెడ్డా నోట్లో పెట్టేసుకుని లొట్టలు వేస్తూ,  పిఠాపురం  చెక్కావాళ్ళకొట్టులోంచి మానాన్న తెచ్చిన గుడ్డలతో కుట్టించిన, కొత్తలాగులూ,చొక్కాలూ,పరికిణీలూ జాకట్లూ,గౌనులూ వేసుకోడానికి రడీ అయిపోతుంటే, "పిల్లల్లారా! అందరిబట్టలూ ఇవ్వలేదు తాతబ్బాయి. తాతబ్బాయి ఇచ్చేకా, దేవుడిదగ్గరపెట్టాకా  ,అప్పుడు కట్టుకొందురుగాని .తాతబ్బాయి కొట్టుతెరాచాకా,వెళ్ళి దగ్గరుండి కుట్టించుకు తెచ్చుకోండి. లేకపోతే ఇవ్వడు,అంతదాకా చాకలి ఉతికితెచ్చినని కట్టుకోండి" అని అమ్మగదమాయించే సరికి,"ఈ అమ్మ ఎప్పుడూ ఇంతే, దేవుడుకి పెట్టాలిట.దేవుడెక్కడైనా,పరికిణీజాకట్లు,లాగులూ,చొక్కాలూ కట్టుకుంటాడేమిటి?"అని కోరస్ గా అమ్మమీద ఆమెకి వినిపించకుండా సణుక్కుంటూ,ఎప్పుడు ఆ తాతబ్బాయి కొట్టుతీస్తాడా?ఎప్పుడు అతడిపైన కొత్తబట్టలకు దండయాత్రచేద్దామా అనే హడావిడిలో పడిపోయేవాళ్ళం.మొత్తానికి తాతబ్బాయి కొట్టుతీయగానే,"మాబట్టలుకుట్టేవా? మా బట్టలు ఇంకా కుట్టలేదా? "అంటూ నానా హంగామా చెస్తుంటే,"అయిపోయాయండీ !కొన్ని లాగులకూ ,జాకట్లకూ బొత్తాలూ, కాజాలూ కుట్టాలి."అని అతగాడు సంజాయిషీ ఇస్తుంటే,"ఓస్ !బొత్తాలూ,కాజాలేకదా! ఫరవాలేదు ,పెద్ద పిన్నీసులు పెట్టేసుకొంటాం అంటూ ,"ఒద్దండీ బాబూ!అమ్మగారు తిడతారని "అతడు మొత్తుకుంటున్నా ,పట్టుబట్టి తెచ్చేసుకొని,అలా పూర్తికాకుండా తెచ్చెసుకొన్నందుకు అమ్మచేత చివాట్లు తినేసుకొని, బట్టలు దేవుడిదగ్గర పెట్టించేసుకొని, ఆపైన కట్టేసుకొని,ఫోజులుకొట్టుకుంటూ ఊరిమీదపడి,స్నేహితులకు చూపించేసుకొని సంబరాలు పడిపోతూ,సంక్రాంతి మూడురోజులపండగలలో మొదటిరోజైన,  భోగిపండుగని వైభవోపేతంగా జరిపేసుకొనేవాళ్ళం .
       

కామెంట్‌లు