గుర్తుకొస్తున్నాయి--అలుకులు ముగ్గులు;-- సత్యవాణి కుంటముక్కుల కాకినాడ .5
 టీ.వీ.లో బాపు ముత్యాలముగ్గు సినీమాలోంచి "ఆరనైదోతనము ఏ ఇంట నుండూ
అరుగులలికేవారి అరచేతనుండు " అని సుశీల పడేస్తుంటే,సంగీత సుపర్బ్ గా నటించేస్తోంది.
    ఆ సినీమాలో ఆపాటకోసం ఒక్కొక్కరూ నాలుగైదుసార్లు తక్కువ కాకుండా ముత్యాలముగ్గు సినీమాచూశారంటే అతిశయోక్తికాదు.
      ఇక విషయానికొస్తే,ఆ పాట వినగానేనా మనసు ఈ పండుగ రోజుల్లోని మాఊరు రౌతులపూడికి పరుగులుతీసింది.
     ఆ పాటకీ,మీ రౌతులపూడికీ లింకేమిటి అనుకొంటున్నారా?అదే నేను మీకు చెప్పబోయేది.
     అప్పట్లో మా రౌతులపూడి ఊర్లో లెక్కకు కొన్నంటే కొన్ని పెంకుటిళ్ళు వుండేవి. డాబా ఇళ్ళు లేనేలేవు ముచ్చటగా మూడు మేడలుండేవి.అందులో మా డొక్కు మేడొకటి,అంటే బహు పురాతనమైనది.మరోటి సీతారామయ్యతాతగారిది.మా ఈ రెండుమేడలూ అవిభక్త కవలపిల్లల్లా అతుక్కున్నట్టుంటే,వెలమపేటలో పంచాయితీ ప్రెసిడెంటు,కైసర్ల ఎర్రాపాత్రుడుగారిదీ, మునసబుగారిదీను. 
         ఇక ఆరోజుల్లో మిగిలిన ఐదారు వేల ఇళ్ళూ తాటాకు ఇళ్ళే.
నేనుచెప్పబోయేది ఆ అందమైన తాటాకిళ్ళగురించే.
   ఈ సంక్రాంతి పండగను మాఊర్లో పెద్దపండగ అంటారు.అలాగే పెద్దలపండగ అనికూడాఅంటారు. ఎందుకంటే  సంకురాత్రిరోజున పెద్దలకు అంటే, కుటుంబంలో చనిపోయినవారికి  మూలనపెట్టాము అని,చీరా పంచలజతా ,అరిశలూ వగైరా  తినుబండారాలూ పెడతారు.ఆసమయంలో జంగందేవర శంఖాలూదడం జరుగుతుంది.అలాగే చీరలు పట్టికెళ్ళి మా ఊరి గ్రామదేవతలు ,పెద్దేములమ్మా,చిన్నేములమ్మలకు చూపించి తెచ్చి కట్ఠుకొంటారు.
    ఆవషయాలు సరే,మనం ముందుగా చెప్పుకోవలసిన, అలుకులూ-ముగ్గుల్లోకొస్తే'పండగకు ఒక నెలరోజుల ముందరనుంచే ఈ కార్యక్రమం మొదలుపెట్టట్టేవారు. మట్టిగోడలు పేడతో బాగా అలికి,గుల్లసున్నం వేసేవారు. కొంతమంది ఆ పేడ అలుకుపైన గోడలపైనే, ముగ్గులతో తీర్చి దిద్దేవారు. మరికొంతమంది గోడలు నల్లగా అందంగా వుండేవి .అదేమిటోనల్లని నలుపు గోడలపై తెల్లని ముగ్గులు మరింత అందంగా కనిపించేవి. ఆ తాటాకింటికి మూడువైపులా వుండే చిన్న అరుగులను, పాత అలుకుళ్ళపొరలు పొడిచి ఆమట్టిని తీసేసి, ,మళ్ళీ నల్లరేగడిమట్టిని మెత్తగా గంధంలా కాళ్ళతో కలియతొక్కి' అరుగులకు నున్నగా వచ్చేదాకా మెత్తేవారు.ఆమట్టి అరుగులు నాలగైదురోజులు ఆరబెట్టి,దానిపైన పేడతోనున్నగా  అలికి,దానిపైన ఎర్రటి మట్టితో  పూతపూసేవారు.ఇక ఆపూత బాగాఆరేకా,ఆ అరగులపైన తెల్లని గుల్లసున్నంతో రంగవల్లులు తీర్చేవారు. అరుగుల దిగువభాగాన అంటే, మధ్యలో చుట్టు రకరకాలుగా బొట్లు పెట్టడం,మధ్యలో  నిమ్మగుత్తులు వంటి రకరకాల ముగ్గులు వేసేవారు. ఎర్ర....ని ఆ అరుగులపైన దిద్దిన ఆ తెల్లని ముగ్గులు,ఆ చుక్కల అమరిక అందం చూడవలసినదేకానీ చెపితే ఎలా తెలుస్తుంది?ఇక ఇంటీలోపల నేల అలుకులూ- ముగ్గుల అందం సంగతి ఆదిశేషుడికే చెప్పతరంకాకపోతే నేనెంతని చెప్పగలను?
    అలా అన్ని ఇళ్ళూ,అందంగా అలంకరించబడి,పెళ్ళికి అలంకరించుకు వచ్చిన పెద్దముత్తైదువులు వరుసలలో కూర్చున్నట్లు ,చుట్టాలపట్టాల ఇళ్ళన్నీ  ,దగ్గరదగ్గరగా,ఒక దానికి ఆనుకొని అన్యోన్యంగా వున్నట్లుండేవి..
       నిజంచెప్పొద్దూ,ఆరోజుల్లో ఆ అరుగులమీద ఒక్కసారైనా వెళ్ళికూర్చోవాలని,పడుకుని దొర్లాలనీ వుండేది.
  అరుగు దగ్గరికి మా పిల్లలంవెళితే చాలు"అమ్మమ్మ..బుల్లెమ్మగారూ! అరుగులెక్కి తొక్కకండమ్మా! పండగెళ్ళేదాకా ,పెద్దలకెట్టుకొనేదాకా 'అరుగెక్కకూడదండమ్మ! మాఅమ్మగాదూ "అంటూ గెడ్డంపట్టుకొని బ్రతిమాలేవారు.మా లాలం లచ్చమ్మా,కోళ్ళరాజమ్మా,తలుపులమ్మా,ఎర్రమ్మా,బొల్లెంకమ్మా,చెల్లాయమ్మా,దేవుడమ్మా ,పైడీతల్లీ వగైరా అందరూ .మాకు చాలా నిరాశగావుండేది.ఆ అరుగులపై మమ్మల్ని అధిష్టించనివ్వనందుకు.
          నిజం చెప్పాల్సొస్తే,మా మేడింటరుగులైతే ,ఆ మట్టి అరుగుల అందం ముందు,ముఖాలు చిన్నబుచ్చుకొనవుండేవి.
     కానీ తమాషా ఎమిటంటే ,మా మేడింటి వాళ్ళకు వాళ్ళ అందమైన అరుగులు ఎక్కాలనిపించినట్టే,ఆ పాకింటి పిల్లలకు మా మేడ ఎక్కాలని,కోరికుండేది.సంకురాత్రి,,అదే పెద్దపండగనాడు రకరకాల,రంగురంగుల , పువ్వుల చీటీ పరికిణీలుకట్టుకొని,వదులుగా బుట్టచేతులజాకట్లుతొడుగుకొని, బర్రిగా కాటుకలెట్టేసుకొని,తిలకంతో బొట్లు దిద్దేసుకొని ,పాపిడిలో బంగారం మొగలిరేకో,తమలపాకో పెట్టేసుకొని,దానికి రెండుప్రక్కలా,సూర్యచంద్రద్రులూ, చెవులకు చిన్న చిన్నగంటలంత జూకాలూ ,వాటి బరువును మోయగల చెవికమ్మలూ,కమ్మలకు తగిలించిన ఎత్తుగొలుసులూ,తలవెనుక ,అరచేయంత నాగరంబిళ్ళ,నాగరంక్రింద పచ్చబంతి పూలదండ, జడపొడవునా బంగారం చేమంతిపువ్వులు,జడకొసన  పనసచెక్కుడుతో చెక్కిన బంగారు జడగంటలుక్రింద ,నల్లటి పట్టు జడకుచ్చులు మొదలైన అలంకరణతో మా ఇళ్ళదగ్గరకొచ్చి,
"ఏవండీ!బాపనోరూ! ఓపాలి,మీ మేడ ఎక్కి సూడనివ్వరా!" అంటూ బిలబిలలాడుతూ వచ్చే వెలమలింటి ఆడబిడ్డలూ',వాళ్ళ వెనకాల ,వదులుగా బురఖాలులా జారిపోతున్న లాగులు చొక్కాలనూ ఎగదోసుకొంటూ మగపిల్లలూ వచ్చేవారు.
      మాకు వాళ్ళ అలుకులూ -ముగ్గులూ అరుగులెక్కాలని కోరికుంటే, వాళ్ళకి మా మేడలెక్కి చూడాలని కోరికుండేది.
      ఇప్పుడు మాకు పాతమేడకు బదులుగా కొత్తడాబా వచ్చింది.సంతోషించవలసి వస్తే ,మా ఊర్లో ఈనాడు లెక్కకి మించిన డాబాలూ,మేడలు వచ్చేయి.బహుళఅంతఃస్థుల మేడలూ వచ్చేయి కానీ, అందమైన అలుకుల- ముగ్గుల అరుగులు  ఈ నాడు ,నా 'గుర్తుకొస్తున్నాయి' శీర్షికలోని జ్ఞాపకాలలోనే మిగిలిపోయాయి మా రౌతులపూడిలోని అలుకుల-ముగ్గులఇళ్ళు.
             

కామెంట్‌లు