దారి తప్పిన కోడి ఆర్. శ్రీశైలం (అరవై ఏళ్ల నాటి బాలల కథలు...5)-సేకరణ : డా.దార్ల బుజ్జిబాబు

 అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు విహంగపురి. ఆ విహంగపురిలో ఒక రైతు ఉన్నాడు.  ఆ రైతు పేరు దొడ్డయ్య. పేరుకు తగ్గట్టు దొడ్డయ్య మహా దొడ్డవాడు. దొడ్డయ్య పేరుకు రైతు కాని, వృత్తికి వ్యాపారి. మంచి వ్యాపారజ్ఞానం కలవాడు.
      పొలంలో పంట పండించడానికి బదులు దొడ్డయ్య కోళ్లను పెంచేవాడు. కోళ్ల పెంపకంలో మంచి అనుభవశాలి. వాటికి ఏ రోగం వచ్చినా తనే సొంతంగా మందు, మాకు చేసి నయం చేసేవాడు.
       తన పెంపుడు కోళ్ల లో ఒక చిన్న కోడి ఉండేది. ఆ చిన్న కోడి పేరు టక్కరి. పేరుకు తగ్గట్టు ఆ చిన్న కోడి టక్కరితనంలో మంచి నేర్పరి. ముక్కు మొదలుకొని తోక  వరకు టక్కరే.  దేహం అంతా వంకర టింకరే. దేహమే కాదు దాని వెంట్రుకలు  కూడా వంకరటింకరలే.  టక్కరి తన అన్న దమ్ములతోను, అక్క చెల్లెళ్లతోనూ పొలంలో ఆడుకుంటూ, పాడుకుంటూ  హాయిగా కాలం గడుపుతూ వుంది.
   ఒకరోజు తెల్లవారు జామునే  దొడ్డయ్య కోళ్ల పొలంలోకి వచ్చి "ఈ రోజు సంత. వీటిలో బాగ బలిసిన వాటిని ఎంచి సంతకు తీసుకువెళ్లాలి" అని అనుకుంటూ చూడానికి మంచి పుష్టిగా ఉన్న వాటిని ఎంచాడు. వాటిని కోళ్ల గంపలో పెట్టాడు. సంతకు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు కొంతమంది తనను  విడిచి సంతకు వెళ్లిపోతున్నారని  టక్కరి కోడి గ్రహించింది. గబగబ దొడ్డయ్య దగ్గరకు వెళ్లింది.  వెళ్లి " నేనుకూడా వస్తా సంతకి. నన్ను  కూడా తీసుకు వెళ్లండి” అని అడిగింది టక్కరికోడి దొడ్డయ్యను.
        “నీవు చాలా చిన్న దానవు. నీవు రాకూడదు. ఇంకా కొన్ని రోజులు  గడిస్తే అప్పుడు నీవు అడగకుండా నేనే తీసుకు వెడతానుగా!” అన్నాడు దొడ్డయ్య లౌక్యంగా.
           కాని టక్కరికోడి ఎలాగైనా సంతకు వెళ్లాలి అని కుతూహల పడింది. దొడ్డయ్య అక్కడనుండి కదలి వెనక్కి తిరిగాడు. వెంటనే  టక్కరి బహు నేర్పరితనంగా వంకర టింకర దేహంతో మెలికలు తిరిరి కోళ్లగంపలో దూరిపోయింది. తరువాత కొంత సేపటికి దొడ్డయ్య  మూటాముల్లా కట్టుకున్నాడు. కోళ్ల గంపలను రెండెద్దుల బండిలోకి ఎక్కించాడు. వాటన్నిటిని నంతకు తోలుకు వెళ్లాడు.
         చెట్ల నీడలతో చీకటిగా ఉన్న రోడ్లమీద కోళ్ల గంపలు బండిలో ప్రయాణం చేశాయి. టక్కరి కోడి "నేను సంతకు వెడుతున్నాను” అని మురిసిపోయింది. 'సంత చూడ్డానికి ఎంతో ముచ్చటగా వుంటుంది.” అను
కుంది పాపం టక్కరికోడి.
          కొంత సేపటికి రెండెద్దులబండి పెద్ద
 పెద్ద ట్రంకురోడ్ల మీద ప్రయాణం చెయ్యడం మొదలు పెట్టింది. టక్కరి కోడి గంపలో నుండి బయటికి తొంగి చూచింది. మోటారు కార్లు కనిపించాయి. హారన్ శబ్దం వినిపించింది. పల్లెటూరి వాతావరణం ఒక్క సారిగా మాయమైపోయింది. పట్టణ వాతావరణం వచ్చింది. నిజానికి ఈ పట్టణ వాతావరణం టక్కరి కోడికి నచ్చ లేదు. సంత సమీపించేసరికి మోటారు కారులు, రిక్షాలు, మోటారులారీలు, బస్సులు, యింకా ఎన్నో ఎన్నో ఎదురయ్యాయి. వీటన్ని టిని చూచి
టక్కరి కోడికి అసహ్యం వేసింది. “ సంతకు వెళ్లడం నాకు ఇష్టం లేదు. నేను తిరిగి ఇంటికి వెళ్లిపోతాను.” అని నిశ్చయించుకుంది.
         నెమ్మదిగా గంపపైన మూతకు కట్టిన దారాలను ముక్కుతో కొరికి నరికింది. లోపల నుండి బయట పడింది. అప్పటికి దొడ్డయ్య ఎద్దుల బండి ఒక పెద్దతూము సమీపానికి వచ్చింది. ఈ తూము లో నుండి రెండెద్దుల బండి ప్రయాణం చేసి సంత చేరుకోవాలి.
        మోటారు కార్లకు, బస్సులకు, లారీలకు, ఎద్దుల బండ్లకు, రిక్షాలకు, బాటసారులకు అందరికీ ఒకటే త్రోవ. ఈ తూము పొడుగు ఎక్కువ. వెడల్పు తక్కువ. వచ్చే పోయే కార్ల హారన్ లతో తూము ప్రతి ధ్వనించింది. కార్లు, బండ్లు ఒక దాని వెనుక ఒకటి నెమ్మదిగా జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నాయి.
         కోళ్ల గంపలో నుండి బయటపడ్డ టక్కరి కోడికి ఈ హారన్ల మోతకు చావుతప్పి కన్ను లొట్ట పోయింది. వెలుతురు లేని ఈ పొడుగాటి తూములో అదురు బెదురుతో బయటపడింది టక్కరి కోడి. కాని  దారి కనుపించ లేదు. ఇంటికి వెళ్లిపోవాలని ఒక్క గంతు వేసింది.
       దొడ్డయ్య రైతు ముందుభాగాన కూర్చొని  బండితోలుతున్నాడు. వెనుకనుండి బయటికి గెంతు వేసిన  టక్కరి కోడిని చూడలేదు.
          మోటారు కార్లు, బండ్లు నెమ్మదిగా జాగ్రత్తగా కదులుతూ ప్రయాణం చేస్తున్నాయి. గంతు వేసిన టక్కరికోడి మోటారు కార్ల  మధ్య యిరుక్కు పోయింది. ఎలాగు వెళ్ళాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఇంచుమించు కారు చక్రాల క్రింద పడిపోయినట్టే టక్కరి కోడి. పడిపోయి చక్రాల క్రింద నలిగిపోయే సమయానికి గాలిలో ఎగిరిపోయింది... టక్కరి,  టక్కరి తనంగా. వెనుక నుండి వస్తున్న మోటారు కారులో పిల్లా జల్లాతో ఒక ఆఫీసరు గారి కుటుంబం ప్రయాణం చేస్తున్నారు. అందులోని పిల్లలంతా కలసి ఒక్కసారిగా “అయ్యో ! అయ్యో ! కోడి చచ్చిపోయింది,” అని గట్టిగా అరిచారు. డ్రైవరు కారు ఆపాడు. ఒక దాని వెనుక ఒకటి అన్నీ ఆగిపోయాయి. కారులో పిల్లలంతా క్రిందికి దిగి టక్కరి కోడిని పట్టుకున్నారు. దాని ప్రాణం రక్షించారు. కారులో వారితో బాటు కూర్చో బెట్టారు. వెళ్లే త్రోవలో సంతకు దగ్గరవున్న పోలీసు స్టేషనులో అప్పగించారు. జరిగిన కథ అంతా చెప్పారు. వాళ్ల త్రోవన వాళ్లు ఇంటికి వెళ్లారు. 
     దొడ్డయ్య సంత చేరుకున్నాడు. బండిలోని కోళ్ల గంపలను దింపాడు. గంపలోని కోళ్లను లెక్క పెట్టాడు. "తన లెక్కకు సరిగ్గా సరిపోయాయి. తెచ్చిన కోళ్లను అన్నిటినీ సంతలో అమ్మేశాడు. ఖాళీ గంపలను బండిలో వేసుకొని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. కోళ్ల గంపలను చూచి "నీ బండిలో నుండి ఏదైనా కోడి తప్పిపోయిందా?” అని పోలీసు పోలయ్య దొడ్డయ్యను ప్రశ్నించాడు.
       దొడ్డయ్య 'లేదు' అన్నట్టు వికటంగా నవ్వాడు. పోలీసు పోలయ్య మళ్లీ అడిగాడు. నేను తెలివితక్కువవాడిని అనుకున్నారా?" అని గదమాయించి ఎదురు ప్రశ్న వేసాడు దొడ్డయ్య.
    "ఇదిగో చూడు!" అని టక్కరి కోడిని  దొడ్డయ్య ఎదుట పెట్టాడు పోలీసు పోలయ్య. దొడ్డయ్య ఆశ్చర్యపోయాడు. తన కళ్లను తనే నమ్మ లేకపోయాడు. ఇది కలా, నిజమా? అని ప్రశ్నించుకున్నాడు తనలో తాను.  "నేనే ౼  నేనే "  అంది  టక్కరి కోడి తల పైకెత్తి చూపిస్తూ. “నువ్వెలాగు వచ్చావ్ ఇక్కడికి?"  అని ప్రశ్నించాడు దొడ్డయ్య.
         టక్కరి జరిగిన కథ అంతా చెప్పింది. దొడ్డయ్య నోరు నొక్కు కున్నాడు. పోలీసు పోలయ్యకు క్షమాపణ చెప్పుకున్నాడు.  క్షమాపణ ఒక్కటే కాదు! అభినందనలు కూడా అర్పించాడు.
         ఇంటికి వెళ్లిన తరువాత టక్కరికి మేత వేశాడు. " ఇక ముందైనా ఎక్కడికి వెడుతున్నావో తెలుసుకుని బయలుదేరు" అని హెచ్చరించాడు దొడ్డయ్య టక్కరికోడిని.
       టక్కరి కిక్కురుమనకుండా మేతమేసింది. బాగా బుద్ధి వచ్చిందని చెంపలు వేసుకుంది. " తెలియని చోటుకు ఎప్పుడు వెళ్లకూడదు" అనుకుంది. "సంత సరదా తీరింది" అనుకుంటూ  హాయిగా ఆ రాత్రి నిద్రపోయింది.
( ఆంధ్ర ౼ వార పత్రిక,  10 - 6 -1959 )
కామెంట్‌లు