కలలో కైలాసం ౼ రెంటాల శాంతాదేవి--అరవై ఏళ్లనాటి బాలల కథలు...7-- (సేకరణ : డా. దార్ల బుజ్జిబాబు)

  ఒకానొకప్పుడు ఒక పల్లెపడుచు,
ప్రక్క గ్రామానికి పోతూ, మధ్యలో అలుపు తీర్చుకోడానికి ఒక చెట్టు నీడను ఆగింది; ఆగి తనతో కూడా తెచ్చుకున్న చిన్న తట్టను ఆ చెట్టు కొమ్మకు తగిలించి  కాసేపు విశ్రాంతి తీసుకుంది. తరువాత తట్ట సంగతి మర్చిపోయి తన దారిన వెళ్ళి పోయింది. ఆ తట్టలో ఒక చద్ది అన్నంమూట, కొన్ని రొట్టెలు ,పండ్లు కూడా వున్నయ్.
      ఆ పల్లెపడుచు వెళ్ళగానే ఇద్దరు మనుష్యులు ఈ చెట్ట వైపే వస్తూండడంతో ఈ తట్ట కాస్తా వాళ్ళకంట బడింది. ఆ యిద్దరిలో ఒకడు రైతు; రెండవాడు గొడ్లకాపరి. మొదట రైతు “ఒరే అబ్బి, ఈ తట్టను మొదట చూచింది నేను. కాబట్టి ఇది నాది. ఇందులోవన్నీ నాకే, వెంటనే గొడ్లకాపరి “చాల్లేవయ్యా సామీ, నీ కంటే. ముందుగా నేనే అల్లంత దూరాన్నించి చూశాను. గనుక ఇది నాదేగాని నీది కాదు" అన్నాడు.
      ఇంతలో రైతు ఒక చక్కని ఆలోచన చేశాడు. సరే. అయితే ఒక షరతు. ఏమిటంటే మనిద్దరం నిద్రపోదాం. ఎవరికయితే చక్కని. అద్భతమైన కలవస్తుందో వారికి చెందుతుందీతట్టా, తట్టలోని పదార్దాలు. కలగని లేవగానే నీ కల నీవు, నా కల నేను ఒకరికొకరం చెప్పు
కొందాము. ఎవరి కల విచిత్రంగా వుండి గొప్పగా వుంటుందో, వారు తీసుకుందాము, పేచీ లేకుండా. ఏమంటావు" అన్నాడు రైతు. సరేనన్నాడు గొడ్ల కాపరి.
         ఇద్దరు చెరొక ప్రక్క పడుకున్నారు, నిద్రపోవడానికి.  పాపం, రైతు అది వరకే అలిసి వున్నాడేమో, నడుం వాల్చాడో లేదో, నిద్ర ముంచుకొచ్చింది. గురకలుపెడుతూ నిద్రపోయాడు. ఈ అవకాశం కోసమే చూస్తున్న గొడ్లకాపరి, ఇదే సందనుకొని, మెల్లగాలేచి కొమ్మకు తగిలించిన తట్టను క్రిందికి దింపి, మెల్ల మెల్లగా అందులో వున్న అన్నం, రొట్టెలు, పండ్లు తినేశాడు. కాని వాడికి ఆకలి తగ్గలేదు. మధ్యమధ్య రైతును ఒక కంట కనిపెడుతూనే వున్నాడు. ఒకవేళ నిద్ర మెలుకువ వచ్చిందేమోనని. కాని ఆ నిర్భాగ్యుడు తియ్యటికలలతో మైమరచి నిద్రపోతూనే వున్నాడు. రైతు తలవైపుగా, రైతు తెచ్చుకున్న అన్నం మూటను చూచాడు గొడ్లకాపరి. వెంటనే మరో ఆలోచన లేకుండా చప్పుడు కాకుండా ఆ మూటను తీసి దానిలో
వున్నదంతా స్వాహా చేసేశాడు.దీనితో వాడి ఆకలి ఆమడ దూరానికి పోయింది. ఇక తాపీగా నిద్ర పోవచ్చునని పడుకొని భుక్తాయాసంతో దొర్లుతున్నాడు. 
      ఇంతలో రైతు మేల్కొని గొడ్ల కాపరిని లేపాడు. వాడు అదిరిపడి లేచినట్లు లేచాడు. "నీకేం కల వచ్చిందో చెప్పు. తరువాత నా కల గురించి చెప్పుతాను" అన్నాడు రైతు. 
 అబ్బా! ఏందోనయ్యా నయ్యా మర్చిపోయాను. ముందు నీ కల చెప్పు. తరువాత మెల్లిగా  నాకల గుర్తుకు తెచ్చుకుని  చెప్తాలే" అన్నాడు.
              "సరే విను. కళ్ళు మూసి మూయంగానే ఒక  మంచి గుఱ్ఱం కనబడింది. దాన్ని చూడగానే ఎక్కి స్వారి చేయాలనిపించింది. వెళ్ళి పట్టుకుందామని దాని  వెనకాలే బయలు దేరాను. ఆ గుఱ్ఱం నన్ను అలా కొంతదూరం లాక్కేళ్ళి ఒక చోట ఆగింది. అక్కడ నాకొక చిన్న నిచ్చెన కనబడింది. దాని ఆధారంతో గుఱ్ఱం మీద ఎక్కి కూచున్నాను. అంతే ఇక చూసుకో దాని పరుగు. అదేం గుర్రమో, అదేం పరుగో గాని అసలు నేల మీద నడుస్తేనా? ఆకాశమార్గాన పోయి, పోయి సరిగ్గా కైలాసానికే తీసికెళ్ళింది; తీసికెళ్ళి పార్వతీపరమేశ్వరుల ముందు దించింది. అప్పుడు నాకు భయం వేసింది. వెయ్యదూ మరి, అంతమంది గొప్పవాళ్ళు అంటే ఋషులు, దేవతలు వున్న చోటంటే  మాటలా.  సరే, మన కెందుకని, అలా భయంభయంగానే గజగజ వణుకుతూ వెనక్కు వెనక్కు వెడుతున్నాను.ఇంతలో పరమ శివుడు నన్ను దగ్గరకు పిల్చి, ఒరే, ఎందుకలా భయపడి పోతున్నావు. భయం లేదులే. రా కూర్చో. నీకేం కావాలి.ఎందుకొచ్చావు?
ఇక్కడికెలాగూ రానే వచ్చావు,  కాబట్టి ఇవాళ నాతో భోజనం చేద్దువుగాని, పార్వతి అమ్మవారు స్వయంగా మన యిద్దరికి వడ్డిస్తుంది" అన్నాడు. వద్దంటే ఏం శాపం పెడతాడోనని, భయంవేసి ఆయనతో కూడ భోచేసాను సుష్టుగా. ఇక ఆ వంటకాలు, ఆ రుచులు, ఆ మధురపదార్ధాలు, అబ్బాబ్బా, వాటి సంగతి నీకేమని చెప్పను.... ఇలా చెప్పుతూ యింకా తింటున్నట్లే తన్మయమైపోయాడు. ఆ తన్మయత్వంలోనుండి  తేరుకొన్నాక గొడ్లకాపరిని వాడి కల సంగతి చెప్ప
మన్నాడు రైతు.
          మొదలు పెట్టాడు గొడ్లకాపరి ? ఓ గుఱ్ఱం కనబడింది. గబుక్కున దాని మీదకు ఎక్కి కూర్చున్నాను. కొంతదూరం పోయాక  చూస్తే గుఱ్ఱమల్లా  గాడిదగా మారింది. పోనీలే ఏదైతే నేమని సరిపెట్టుకున్నాను మనస్సును. పోయి పోయి తిన్నగా మా యింటి దగ్గరకు తీసికెళ్లి దించింది. . అనుకోకుండా జరిగిందేమో నాకు చాలా ఆశ్చర్యం వేసింది.  గాడిద మీద సవారి చేస్తు వచ్చిన  నన్నుచూచి,నా పెళ్ళాం కోపంతో, చీపురుతో నా పెళ్ళాం అలం, చీపురుతో, లంకిణి మోస్తరుగా నా మీది మీదికి  పస్తోంది కొట్టడానికి.  రాపడమేమిటి, వచ్చి నాల్గు వడ్డించింది కూడాను... బాబూ ఆ బాధ, ఆ దెబ్బలూ నన్ను అడగవద్దు. ఇప్పటికి కూడా వళ్ళంతా  నెప్పులుగా ఉన్నట్లే వుంది దెబ్బలతో!  అని ఏడుపు ముఖం పెట్టి కొంచెం ఆగి మళ్ళీ మొదలెట్టాను. ఇంతలో  మీరు వచ్చి అడ్డుపడి నన్ను విడదీసి లాక్కొచ్చారు యివతలకి.  అసలే ఆకలి, అందులో  పెళ్ళాం చేతిలో దెబ్బలు, అవ న్ని కలసి నన్ను బాగా ఏడిపించాయి, అమాంతం మీ కాళ్ళను కావిలించుకొని ఏడ్చాను. అప్పుడు మీరు నన్ను లేవదీస్తు అన్నారూ "ఎందుకేడుస్తావు ఫలానా చెట్టు కొమ్మమీద తట్ట వున్నది. ఆ తట్టలో వున్న  అన్నం, రొట్టెలు, పండ్లు నీవు తీసుకో, ఇంకా ఆకలి తీరకపోతే  అక్కడే నా మూట కూడా వున్నది. అది కూడా తీసుకొని తినేసేయ్యి " అన్నారు. "అయితే మీరు తినరా? అన్నాను నేను.  "లేదు లేదు నేను తినను. నేను ఇప్పుడే కైలాసంలో  పరమ శివుని ఆతిధ్యం తీసుకొని వస్తున్నాను. నాకక్కరలేదు" అన్నారు. వెంటనే నేను తమ ఆజ్ఞ ప్రకారం అన్నీ తినేశాను" ఇలా చెప్పి గొడ్ల కాపరి తన కలను ముగించాడు. 
        రైతు ఇదంతా విని అనుమానంతో పైన చెట్టుకొమ్మవైపు  ఓ సారి, తన మూటకేసి ఓసారి పరికించి చూచాడు. రెండూ ఖాళీ. రైతుకు కోపం ముంచు కొచ్చింది.  రాదూ మరీ ఒక ప్రక్క ఆకలి దహించుకుపోతుంటే అందులో తను తెచ్చుకున్న ఆహారం కూడా మాయం చేశాడయ్యె. “నీవు ఒట్టి మోసగాడివి. ఎవరో పెట్టుకు వెళ్ళిన తిండి తినడమే కాకుండా నేను తెచ్చు కున్నది కూడా మింగేశావు.దౌర్భాగ్యుడా” అన్నాడు ఏడుపు కంఠంతో
    "అది నా తప్పా. నీవు తినమంటేనే తిన్నానా మరి. అయినా తినే ముందు కొంచెం ఆలోచించాను తినడమా మానడమా అని. కైలాసంలో ఆతిథ్యం అన్నారు. అంత చక్కని భోజనం చేశాక ఈ చద్ది అన్నం, ఎండిపోయిన రొట్టెలు, మాగిపోయిన పండ్లు మీరు ఎలాగూ తిన లేరుగదానని తినేసి మీ ఆజ్ఞ అక్షరాలా నెరవేర్చాను, కోప్పడకండి. ఇక నా దారిన నేనుపోతున్నాను,” అని చెప్పి వెళ్ళిపోయాడు గొడ్లకాపరి.
       తెలివి తక్కువతనానికి, తనని తానే నిందించుకొంటూ, కలను తలచుకొని విసుక్కొంటూ, ఆకలితోనే తూలుకుంటూ, వెళ్ళి పోయాడు రైతు.
(ఆంధ్ర ౼ వార పత్రిక,  8 - 7 - 1959)
కామెంట్‌లు