ఇసుక-బోలెడు విషయాలు;--కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  సముద్రం ఒడ్డన ఇసుక,నది ఒడ్డున ఇసుక, ఇసుక అనేది మనిషికి ప్రకృతి ఇచ్చిన వరం! ఇసుకలో ఎన్నో రకాలు ఉన్నాయి. గండు ఇసుక అంటే పెద్ద రేణువులు కలవి,సన్న ఇసుక,కొన్ని చోట్ల నల్ల రంగు ఇసుక, తెల్లరంగు ఇసుక, ఎర్ర రంగు ఇసుకలు కూడా అక్కడి పరిస్థితులను బట్టి లభిస్తాయి!వివిధ రకాల రసాయనాల సమ్మేళనం వలన ఇసుక ఆయా రంగుల్లో కనబడుతుంది.ఇసుక వలన మానవుడికి అనేక లాభాలు ఉన్నాయి. ప్రపంచంలో దొరికే ఇసుకలో 98% ఇళ్ళు,భవనాలు కట్టడానికి ఉపయోగిస్తున్నారు. సముద్రపు ఇసుక భవన నిర్మాణానికి పనికిరాదు ఎందుకంటే అందులో ఉప్పు శాతం ఉంటుంది.
      ఇసుక సిలికాన్,ఆక్సిజన్ సమ్మేళనం అదే సిలికాన్ డై ఆక్సైడ్. ఇసుకను ప్రత్యేక పద్ధతిలో వేడిచేసి ఆక్సిజన్ తొలగిస్తే సిలికాన్ లభిస్తుంది. ఇసుక, సన్నపురాయి,సోడా బూడిద కలిపి బట్టీలో 1480 సెం.గ్రేడుల ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే గాజు(glass) తయారు అవుతుంది.ఇలా సీసాలు,అద్దాలు,గాజు పలకలు మొదలైనవి తయారు చేస్తారు.లోహపు పూత పరిశ్రమ(metal casting industry) కూడా ఇసుకను ఉపయోగిస్తుంది.ఈ విధంగా 5000సంవత్సరాలనుండి ఇసుకను వాడుతున్న ఆధారాలు ఉన్నాయి.ఇసుకతో ప్రత్యేక మైన పద్ధతిలో క్వార్ట్జ్ స్పటికాలు తయారు చేస్తారు. వీటిలో కంపనాలు ఒక నిర్ణీతి పద్ధతిలో ఉంటాయి. అదిగాక కొంత సాంకేతికతవలన మనం అనుకున్నట్లు కంపనాలు కలిగించవచ్చు.అందుకే వీటిని విరివిగా రిస్ట్ వాచీలలో వాడుతున్నారు. ఇవి రేడియో తరంగాలను కూడా నియంత్రిస్తాయి. అందుకే రేడియో తరంగాలను పంపడంలో కూడా ఉపయోగిస్తారు. ఇసుకలో లభించే సిలికాన్  ద్వారా 'సిలికాన్ ఇన్సులేటర్' తయారు చేస్తారు.ఇది రాకెట్టు పైభాగాలపై వాడుతారు.దీని వలన అతి ఉష్ణోగ్రత,అతి చల్లదనం నుండి రాకెట్టు కాపాడ బడుతుంది.
     వైద్య పరంగా గుండె కవాటాలకు,విరిగిన వేళ్ళకు,దెబ్బ తగిలిన ముక్కు బాగుచేయడంలో సిలికాన్ ఉపయోగిస్తారు.
      ఇప్పుడు ముఖ్యంగా 'సిలికాన్ చిప్స్' కంప్యూటర్,క్యాలికులేటర్ మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలలో వాడుతున్నారు.ఈ చిప్స్ మీద అల్ట్రా వయొలెట్ లేక ఎలక్ట్రాన్ కిరణాలు ఉపయోగించి సర్యూట్ అంటే 'విద్యుత్ చలన నియంత్రణ' ఏర్పాటు చేస్తారు.ఇది ఎలక్ట్రానిక్ పరికరాలలో ఎన్నోవిధాల ఉపయోగ పడుతోంది!
       అసలు ఇసుక ఏ విధంగా ఏర్పడింది? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రం,నదీ తీరాల్లో కొండలు ఉండేవి.నీటి అలల వలన,వాతావరణ మార్పుల వలన కొండలు కరగి ఇసుక రేణువులు ఏర్పడ్డాయి రాళ్ళలో కూడా సిలికాన్ ఉంటుంది.మీరు హైదరాబాద్ లో గాజు ఫ్యాక్టరీకి వెడితే(saint gobin secunderabad)గాజు ఏ విధంగా చేస్తారో చూడవచ్చు.
                  ***********

కామెంట్‌లు