పొణకా కనకమ్మ;-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

    తన సంపదనూ, జీవితాన్ని దేశం కోసం అర్పించిన మహాతల్లి పొణకా కనకమ్మ గారు.
      అటువంటి త్యాగమూర్తిని తెలుగువారు మరచిపోతున్నారు! ఇప్పుడైనా కనకమ్మ గారిని గుర్తు చేసుకోవడం,ఆమెను గురించి ఇప్పటి తరం వారికి తెలియ చేయడం మన కర్తవ్యం.
      కనకమ్మ గారు 10జూన్ 1892లో నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామంలో జన్మించింది.వీరి తల్లి దండ్రులు మరుపూరు కొండారెడ్డి,కామమ్మ గార్లు.ఈమె తన మేన మామ పొణకా సుబ్బరామి రెడ్డితో వివాహం జరిపించారు.1914 సం॥ నుండే ఆమె స్వాతంత్యోద్యమంలో నిమగ్నురాలైంది! 1907 వ సం॥ లో బిపిన్ చంద్రపాల్ మద్రాసుపోతూ నెల్లూరు రాగా ఆయనను తన ఇంటికి ఆహ్వానించి ఆయన చేత ఉపన్యాసం ఇప్పించింది.తన 13 ఎకరాలతోట అమ్మి స్వాతంత్రోద్యమానికి ఇచ్చివేసింది.ఇప్పుడు ఆ ప్రదేశంలో'పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం' నెలకొల్పారు.
     సావర్కరు గారు వ్రాసిన 'భారత స్వాతంత్ర పోరాటము' అనే పుస్తకాన్ని తెలుగులో ప్రచురించి ఉచితంగా పంచి పెట్టారు.పోట్లపూడిలో వివేకానంద గ్రంథాలయము స్థాపించింది
      పోట్లపూడి గ్రామం పరిసర ప్రాంతాలలో కలరా వ్యాధి వ్యాపిస్తే తనే స్యయంగా వెళ్ళి  మందులు ఇచ్చి సపర్యలు చేసి సహాయ పడింది!
        1919లో మద్రాసులో గాంధీని కలసి స్వాతంత్ర ఉద్యమంపై చర్చించింది.1921 లో గాంధీ నెల్లూరు వచ్చినపుడు స్వరాజ్యనిధికి తన వంటిమీదున్న  40 సెవర్ల బంగారు గాంధీజీకీ ఇచ్చివేసింది! " ఇక బంగారు నగలు పెట్టుకోవా?" అని గాంధీ అడిగితే "ఇక పెట్టుకోను" అని వాగ్ధానం చేసిన త్యాగ వనిత ఈమె.
      1927 లో రాయలసీమలో క్షామం సంభవించినపుడు విరాళాలు,బట్టలు సేకరించి ఇచ్చి ఆదుకున్నది!
     ఈమె స్త్రీ విద్యకు ప్రాముఖ్యతనిచ్చి 1923 లో నెల్లూరులో కస్తూరి విద్యాలయం టంగుటూరి ప్రకాశం పంతులు గారి చేత ప్రారంభింపచేసిన ఈమె విద్యాలక్ష్మి.
     1929 లో గాంధీ నెల్లూరు వచ్చినపుడు రామదాసు నాటకాన్ని ప్రదర్శింపచేసి ఆయన ప్రశంసలు అందుకుంది.12 మే 1929 న గాంధీచే కస్తూరి దేవి విద్యాలయం భవన శంకుస్థాపన చేయించారు. ఇప్పటికీ నెల్లూరులో ఈ విద్యాలయం కొత్త భవనాలతో ముఖ్యమైన విద్యాలయంగా అలరారుతోంది.
    ఈమె భర్త పొణకా సుబ్బరామిరెడ్డి , వెంకటరామానాయుడు సంపాదకుడుగా 'జమీన్దారి'
పత్రికను స్థాపించారు.దీనినే 1934 సం॥ లో 'జమీన్ రైతు' అనే పత్రికగా మార్చారు,ఇది ప్రతి శుక్రవారం వెలువడుతోంది.
     1930లో కనకమ్మ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనవడడం వలన  అరు నెలలు జైలు శిక్ష పడింది.
      ఈమె కూతురు వెంకటసుబ్బమ్మ మరణం కనకమ్మను కొంత కుంగదీసింది.ఆ తరువాత కనకమ్మ రమణ మహర్షి ఆశ్రమంలో గడిపి స్వాంతన పొందిది. రమణ మహర్షి జయంతిని రమ్యంగా వ్యాస రూపంలో వ్రాసి జమీన్ రైతులో ప్రచురించారు!
ఇదే కాకుండా ఈమె రమణ మహర్షిమీద స్తుతి పద్యాలు కూడా వ్రాశారు.
     స్వదేశీ ఖాదీ ఉద్యమము,అస్ప్రశ్యతా నివారణము,దీనజనోద్దరణము వంటివాటికి కనకమ్మ ఖర్చు చేయడం వలన ఆమె ఆస్థి కరగిపోయింది!
కస్తూరిదేవి విద్యాలయం అభివృద్ధి కొరకు 2-4-1950
న ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి గారి పాటకచ్చేరే పెట్టించారు.
      1958 లో కనకమ్మ ఆరోగ్యం పక్షవాతంతో క్షీణించి మంచానికి పరిమిత మయ్యారు.కనకమ్మ తన 71 వ ఏట 1963 లో నెల్లూరులో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
         కనకపు బొమ్మ మా అమ్మ
         పొణక కనకమ్మ
         మణిమాణిక్యముల మూట
          మము వీడిపోయె నిట.
      ఇటు స్వాతంత్ర ఉద్యమంలోనూ,స్త్రీ విద్య కోసం,అటు దీన జనోద్ధరణ కోసం ఎంతో కష్టపడిన కనకమ్మ కీర్తిశేషురాలైపోయింది.నెల్లూరు పారిశ్రామిక విద్యాలయ భవంతిలో 'పొణా కనకమ్మ బాలికా పాఠశాల' ప్ర్వభుత్వం వారు నిర్వహిస్తున్నారు.నెల్లూరులో ఈమె పేరుతో ఉన్న స్మృతి చిహ్నం ఇది ఒక్కటే.
       ప్రభుత్వం ఈమెను గురించిన పాఠ్యాంశం కనీసం ఐదవ తరగతి పుస్తకాల్లో నైనా ప్రచురించాలి.
ఇదే మనం ఆమెకు ఇచ్చే నివాళి.
          ***********

కామెంట్‌లు