జ్ఞాన భాండాగార మే ఈ సద్గుణ శతకం;-రాథోడ్ శ్రావణ్ఉట్నూర్ 9491467715.
 తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. శతకాల్లో భక్తి, నీతులున్న శతకాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు అందరికి సుపరిచితమైన శతకం వేమన్న శతకం హిందీలో అయితే కబీర్ కే దోహే  నేటి కాలం వరకు మనుషుల హృదయాలలో శాశ్వతంగా  నిలిచాయి.
ఉట్నూర్ సాహితీ వేదికలో తనదైనశైలిలో రచనలు సాగిస్తున్న గురుభక్తి కవి తొడసం నాగోరావ్ మారుమూల  ఏజెన్సీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలోని ఝరి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో 09జులై1983లో  జన్మించిన అణి ముత్యం.
ప్రధాన్ ఆదివాసీ తెగకు చెందిన కవి నాగోరావ్  తెలుగు సాహిత్యంలో ఛందో బద్ధంగా శతకం రాసిన తొలి ఆదివాసీ కవిగా చెప్పవచ్చు.
 వీరి పుణ్య దంపతులు శ్రీమతి/శ్రీ తొడసం రుక్మాబాయి శ్యాం రావ్ గార్లు భక్తి మార్గంలో పయనిస్తూ మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా మహోర్ తాలుకలోని మహోర్ ఘడ్ పుణ్యధామంలో  వెలసిన ఆదిశక్తి అనుసూయ మాతా అత్రి మహర్షి భక్తులు. వీరు మాంసాహారం ముట్టకుండా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఆ ప్రభావం కుమారుడు తొడసం నాగోరావ్ మీద పడడంతో ఆధ్యాత్మిక భక్తి సాత్విక గుణాలతో ఆలయాలను సందర్శించుకోవడం దైవారాధన చేయడం,సంగీతం మీద ప్రేమతో సంతుల సమ్మేళనం, సభా సమావేశాలలో పాల్గొన్ని భజనలు కీర్తనలు చేయటం అలవాటు అయింది. భగవదను గ్రహమునకై అనుక్షణం తపించే స్వభావం వ్వక్తిత్వం వీరి స్వంతం.
వృత్తిరీత్యా తెలుగు భాషా పండితులులైన తొడసం నాగోరావ్ ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దంతన్ పల్లి,ఉట్నూర్ యందు విధులు నిర్వహిస్తున్నారు .
నేటి కాలంలో నైతిక మానవ విలువలు అంతరించి పోతున్న అపరిస్థితిని చక్కదిద్దేందుకు వాటి పట్ల విద్యార్థులకు, పాఠకులకు, జాగరూకత కలిగించడం కోసం ప్రస్తుత పరిస్థితుల్లో  భక్తి, నీతి కి సంబంధించిన  ఆటవెలది ఛందస్సులో  శతకాధిక పద్యాలు "ఆది శక్తి అత్రి అనసూయమ్మ" అను మకుటంతో "సద్గుణ శతకం" రాయడం అభినందనీయం.ఈ పుస్తక సాగరంలో  ఒక్కొక్క పద్యం కుండాలో మొత్తం సముద్రమే నింపినట్టు నీతివంతమైన అర్థంతో ఉంటుంది.
 కొన్ని పద్యాలు పరిశీలిద్దాం:-
"సర్వమందు యండు సతతంబు దైవము/ శత్రువనుచు పరుని సతత బాదు /బుధ్ధి లేని వారు భువి నందు యెరుగకన్  /ఆది శక్తి అత్రి అనసుయమ్మ" ఓ అదిశక్తి  అత్రి అనసూయ మాతా ! సకల   ఆత్మల యందు ఉండును దేవుడు ! పరులను ఎల్లప్పుడు శత్రువు అనుకొని బాదును, బుద్ధిలేని వారు! పుడమి యందు తెలియకుండా అని దేవుని గూర్చి చక్కని భావంతో వివరించారు.
"శాంతి కలగ బోదు సంపదల వలన /పరుల వల్ల రాదు పరమ శాంతి/ అవతరించు శాంతి ఆనంద విత్తమున్ /ఆది శక్తి అత్రి అనసూయమ్మ."
ఓ అదిశక్తి అత్రి అనసూయ మాతా! సంపదల వలన శాంతి కలుగ బోదు, పరమ శాంతి రాదు పరుల వలన ,అవతరించును శాంతి ఆనందమనే విత్తనము అని చాలా అద్భుతంగా  సంపదల వలన శాంతి ఆనందం రాదని  తెలియజేశారు.
"మంచి మాట వినుము మంచి జరుగు నీకు/ చెడును విస్మరించు చెడును మనసు / జయము కలుగు నీకు జనని పుత్ర భువిన/ ఆది శక్తి అత్రి అనసుయమ్మ" ఓ ఆదిశక్తి  అత్రి అనసూయ మాతా ! మంచి మాట వినుము మంచి జరుగును నీకు ! విస్మరించు చెడును మనసు చెడిపోవును ! జయము కలుగు నీకు భువి నందు జనని పుత్ర అని మధురమైన వాణి వల్ల కలిగే  ప్రయోజనాలను వివరించారు.
ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో వెలువడిన  శతకానికి సంబంధించిన రెండో పుస్తకం ఇది . ఈ సద్గుణ శతకం పుస్తకంలో  ఆటవెలది ఛందస్సుకు సంబంధించిన మొత్తం 116 పద్యాలు ఉన్నాయి. కళాత్మక బిరుదు అంకితుడైన తొడసం నాగోరావ్ గురువు శ్రీ గురుదత్త యొక్క కృపా వలనే ఈ సద్గుణ జ్ఞానం నాకు లభించిందని  అంటారు.
వీరి కృషికి ఆది శక్తి అత్రి అనసూయమ్మ వారి కృపాకటాక్షములుండాలని కోరుతూ  సద్గుణ శతకం  అనే ఈ పుస్తకము ఎంతో మంది విద్యార్థులకు, సాహితీ అభిమానులకు, పాఠకులకు, ఉపయోగపడుతుందని విశ్వశిస్తున్నాను.


కామెంట్‌లు