'హృదయం' మునిగింది, వృత్తి మిగిలింది!;-- దోర్బల బాలశేఖరశర్మ
 నిజమే, ఎవరికైనా, ఎంతటి వారికైనా హృదయం హృదయమే, వృత్తి వృత్తే. వృత్తికి హృదయం ఎంతమాత్రం అడ్డు రాకూడదు. వచ్చిందా, వృత్తిధర్మం విజయవంతం కాదు. వృత్తికి హృదయం వుండాలి. హృదయ పూర్వకంగానే వృత్తి విధులను నిర్వర్తించాలి. కానీ, హృదయం ఎప్పుడూ వృత్తిని, దాని ధర్మాన్ని, ప్రయోజనాలనూ తన కోసం వాడుకోకూడదు. అసలు, హృదయానికి వృత్తితో ఏం పని? వాస్తవానికి కూడా, అప్పుడే హృదయం హృదయం వలె స్వచ్ఛంగా వుంటుంది. 
ఇదంతా, చెప్పుకోవడానికి, వినడానికి చాలా నీతివంతంగానే వుంటుంది. త్రికరణ శుద్ధిగా పాటిద్దామనుకొనే వారికే పెద్ద సమస్య. ఎందుకంటే, వృత్తిని నిర్వర్తించేది, అదికూడా హృదయ పూర్వకంగా నిర్వర్తించ వలసింది హృదయమున్న మనిషే, ఏ రోబోవల్లనో ఇది కాదు కనుక. మరి, అలాంటప్పుడు, అతని/ ఆమె హృదయం మునిగి, వృత్తి మాత్రమే మిగిలితే ఎలా వుంటుంది? నా విషయంలో ఇదే జరిగింది. నా హృదయాన్ని పూర్తిగా వృత్తికే ఇచ్చేయడం వల్ల అది నాది కాకుండా పోయింది. చివరకు నాకు నేనే కాదు, నా ఆత్మీయులకు, అమ్మానాన్నలకు, కుటుంబ సభ్యులకు హృదయం లేని మనిషిగానే మిగిలాను.
ప్రత్యేకించి నిజాలు మాత్రమే రాద్దామనుకొనే నిఖార్సయిన విలేకరులకు ఈ సూత్రం వంద శాతం వర్తిస్తుంది, వర్తించాలి. అలాంటి వారి వృత్తికి హృదయం తోడ్పడుతుందే కానీ అడ్డు పడదు. 'ఈనాడు' విలేకరిగా చేరిన కొద్ది రోజుల్లోనే నాకీ సత్యం బోధపడింది. ఇక, అప్పటినుంచీ నా హృదయాన్ని నా కోసం పని చేయనీయకుండా అట కెక్కించి, వృత్తి ధర్మాన్ని మాత్రం హృదయ పూర్వకంగా నిర్వర్తించాను. ఫలితంగా, వృత్తిలో  విజేతనైతే అయ్యాను. కానీ, 'హృదయం లేని మనిషి'గా కోల్పోకూడనిది సైతం కోల్పోయాను. ఇప్పుడు ఇది బాధా కాదు, బరువూ కాదు. నన్ను నేను సముదాయించుకోవడమే.
వృత్తి పనిలో భాగంగా నేను ఆ రోజు జిల్లా కేంద్రం సంగారెడ్డి వెళుతున్నాను కనుక, ప్రభుత్వ ఉపాధ్యాయుడైన (తెలుగు పండిట్ - సెకండ్ గ్రేడ్) నాన్న 'తన బదిలీ దరఖాస్తు ఎంతవరకు వచ్చిందో కనుక్కుని' రమ్మన్నారు. నేను కేవలం ఆ పనే చేద్దామనుకున్నాను. కానీ, మరోలా జరిగింది. అదే నాకు సదరు పాఠాన్ని నేర్పింది. ''మీ నాన్న పేరేంటి?'' అక్కడి జెడ్ పి ఆఫీసులోని గుమాస్తా నన్నడిగిన మొదటి ప్రశ్న ఇది. చెప్పాను. "ఆయన ఎక్కడ పని చేస్తారు?'' అదీ చెప్పాను. "ఏం కావాలి?" మూడో ప్రశ్న. "బదిలీ విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుందామని.." అన్నాను. ఆయన దానికి సమాధానం చెప్పకుండా, "నువ్వేం చేస్తావ్?" అనడంతో, "ఈనాడు విలేకరిని" అన్నాను. అంతే! 
ఒక విలేకరి, ప్రత్యేకించి ఆ పేపర్ లో పనిచేసే జర్నలిస్టులు అలా సొంత పనుల కోసం వెళ్ళినప్పుడు వృత్తిని చెప్పుకోవడాన్ని 'పైరవీ' అంటారని నాకప్పుడు తెలియదు.  హెడ్ ఆఫీసు అధికారి ఈ విషయం నన్ను అడిగాకే తెలిసింది. అప్పటినుంచీ నేను ఇంటి పనులకు పూర్తిగా దూరమయ్యాను. నావైన సొంత పనులు ఇంకేం వుంటాయి? ఆఖరకు, ఉన్న ఊళ్లో సంచీ పట్టుకొని రేషన్ షాపుకైనా వెళ్ళేవాణ్ణి కాదు. 
ఆశ్చర్య కరమైన విషయమేమిటంటే, ఆ తర్వాత కొన్నాళ్లకే నాపై attempt to murder (హత్యాయత్నం) జరిగి, నేను ఇదే వృత్తిలో స్థిరపడి, మరింత దూకుడుగా నిజాలతో కూడిన వార్తలను ప్రచురిస్తూ పోయినందుకు, సదరు 'బాధితులు' నన్నేమీ చేయలేక నాన్నను, అన్నను పనిష్మెంట్ వంటి ప్రాంతాలకు బలవంతపు బదిలీలు చేసినప్పుడు.. అదే 'ఈనాడు' కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆఖరకు, నన్ను కన్న కర్మానికి అమ్మానాన్నలు నా నిఖార్సయిన 'వృత్తిధర్మం' వల్ల పడ్డ కష్టాలు, కార్చిన కన్నీళ్లు తుడవాలన్న జ్ఞానం కూడా నాకు అప్పుడు లేకుండా పోయింది. 


కామెంట్‌లు