విలువైన స్నేహం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
 
       మధుగీతిక చాలా శ్రావ్యంగా పాటలు పాడుతుంది. ఆమె పాటలు అంటే ఆ పాఠశాలలో పిల్లలకే కాదు, ఉపాధ్యాయులు అందరికీ చాలా చాలా ఇష్టం. మళ్ళీ మళ్ళీ అడిగి పాడించుకుంటారు. అదే పాఠశాలలో శ్రావ్య అనే అమ్మాయి కొత్తగా ప్రవేశించింది. ఆ అమ్మాయి కూడా వస్తూనే తన గానకళను ప్రదర్శించింది. ఆ అమ్మాయి పాటలు కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. కానీ ఇద్దరినీ పోల్చుకొని మధుగీతికనే చక్కగా పాడగలదు అనుకునేవారు. 
       శ్రావ్య మధుగీతికతో స్నేహం చేసింది. ఇద్దరూ ప్రాణ స్నేహితులు అన్నంత సన్నిహితంగా ఉన్నారు. ఇద్దరి మధ్యా పాటల గురించి చర్చలే వచ్చేవి. జిల్లా స్థాయిలో పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల తరపున మధుగీతికను, శ్రావ్యను పోటీలకు పంపాలని ఉపాధ్యాయులు నిశ్చయించారు. శ్రావ్య మధుగీతిక వద్దకు వచ్చి ఇలా అన్నది. "మధూ! నువ్వు ఏమీ అనుకోను అంటే ఒకమాట చెప్పాలి." అని. చెప్పమన్నది మధుగీతిక. "నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి కాబట్టే చెబుతున్నా. అందరూ ప్రాణ స్నేహితులు కాలేరు కదా! నువ్వు బాధపడను అంటేనే చెబుతాను. నా మీద ఒట్టేసి చెప్పు." అన్నది శ్రావ్య. "ఏమీ అనుకోనులే"అన్నది మధుగీతిక.
       "నీ గొంతు అంత శ్రావ్యంగా ఉండదు. కొంచెం బొంగురు గొంతు. పైగా నీకు ఈ మధ్య జలుబు చేసింది. నువ్వు చెప్పకున్నా ప్రాణ స్నేహితురాలిని నీ ముఖం చూసి అర్థం చేసుకోలేనా. నీకు పోటీ ఎవ్వరూ లేక నిన్ను మెచ్చుకుంటున్నారు అంతే! కానీ అందరూ నీ వెనుక చేసే కామెంట్లను విని నేను ఎంత బాధపడుతున్నానో! అందుకే ఈసారి జిల్లా స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనకు. నేను పాల్గొంటున్నాను కదా! మన స్కూలుకు తప్పనిసరిగా బహుమతిని తీసుకు వస్తాలే. అప్పుడు నీకు సంతోషమే కదా! ఆ పోటీల తర్వాత నీకు శ్రావ్యంగా ఎలా పాడాలో నేర్పిస్తాలే." అన్నది శ్రావ్య. మధుగీతిక నొచ్చుకున్నా స్నేహితురాలిని అర్థం చేసుకొని పోటీ నుంచి తప్పుకుంది.
       స్రవంతి ఆ పాఠశాలలో మరొక మంచి గాయని. ఆమె మధుగీతిక వద్దకు చేరి మధుగీతిక పాల్గొనకపోవడానికి కారణం అడిగింది. "మధూ! బంగారు అవకాశం వస్తే వద్దనుకుంటావా? నీ గొంతుకు ఏమైంది? అదే అవకాశం నాకు వస్తే ఊరుకుంటానా? నువ్వు తప్పనిసరిగా పాల్గొనాలి అంతే!" అన్నది స్రవంతి. "దయచేసి ఈసారికి నన్ను వదిలెయ్యి." అన్నది స్రవంతి.
      జిల్లా స్థాయి పోటీలు ముగిశాయి. శ్రావ్యకు బహుమతి రాలేదు. మరెవరికో వచ్చింది. బహుమతి ప్రదానోత్సవం కలెక్టర్ చేతుల మీదుగా జరుగుతుంది. అప్పుడు స్రవంతి కలెక్టర్ గారి వద్దకు వెళ్ళి, "నమస్కారం అండీ! నా మిత్రురాలు మధుగీతిక చాలా బాగా పాడుతుంది. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి." అని వేడుకుంది కలెక్టర్ గారు అనుమతినిచ్చారు. స్రవంతి బలవంతం మీద కేవలం ప్రేక్షకురాలిగా శ్రోతగా అక్కడికి వచ్చిన మధుగీతిక. ఇష్టం లేకపోయినా కలెక్టర్ గారి మాటను కాదనలేక పాడింది మధుగీతిక. పాట అయిపోగానే ఎడతెరిపి లేకుండా చప్పట్లతో మార్మోగింది. కలెక్టర్ గారు మధుగీతికను ప్రత్యేకంగా అభినందించి ఐదు వేల రూపాయలను బహూకరించారు. ఆ పోటీలో ప్రథమ బహుమతి విజేతకు మూడు వేల రూపాయల బహుమతి అందింది. ఆ తర్వాత మధుగీతిక శ్రావ్యను చేరి, "ఇప్పుడు సంతోషమా శ్రావ్యా! ఎలాగైతేనేం మన స్కూలుకు బహుమతి వచ్చింది." అన్నది. ముఖం మార్చుకొని, కోపంతో బుసలు కొడుతూ దూరంగా వెళ్ళిపోయింది శ్రావ్య. "చూశావా మధూ! నిన్ను తనకు పోటీగా రాకుండా కుట్రలు చేసింది. నువ్వు అమాయకంగా నమ్మినావు. నీకు గుర్తింపు రాగానే ఆమె తట్టుకోలేకపోవడం కళ్ళారా చూశావు కదా!" ఇప్పటికైనా మనుషుల స్వభావం తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించు." అన్నది స్రవంతి. స్రవంతి, మధుగీతికలు పోటీ పడి శ్రావ్యంగా పాటలు పాడడం మొదలుపెట్టారు.

కామెంట్‌లు