చిట్టి కథలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 రాముడు ఒక రోజు మేకలని కొందామని పట్నానికి బైలుదేరాడు. ఒక కోడినిఅమ్ముదామని అడ్డదారిని వెళ్లసాగాడు.సన్నని కాలిబాట  అటుఇటు తుప్పలు పెద్ద పెద్ద చెట్లున్నాయి.ఇంత లో ఎక్కడనించో ఒకడు చేతిలో దుడ్డుకర్రతో అతని ముందు నిలిచాడు. "నీకోడిని నాకు ఇచ్చేయి.రేపు మాఇంట్లో విందు ఇస్తాను "అన్నాడు.  "అబ్బే!నేను కష్టపడి డబ్బు కూడబెట్టి కొన్నాను. చచ్చినా ఇవ్వను." అంతే వాడు తనచేతిలోని దుడ్డు కర్రను చూపుతూ  " ఇప్పుడు నీమాడు పగలగొడతాను.చచ్చినట్లు ఇస్తావు"అన్నాడు.
రాముడు చాలా తెలివిగలవాడు."సరే!నీకర్రను నాకు ఇవ్వు. ఈకోడిని తీసుకో"అనగానే దొంగ మహామురిసిపోతూ కర్రను ఇచ్చాడు. "ఏంరా?నేను కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు తో కోడిని కొనుక్కుంటే నీవు అప్పనంగా దాన్ని కాజేయాలనుకున్నావా?నాకోడిని నాకుఇస్తావా?లేకుంటే నీబుర్ర రాంకీర్తన పాడించమంటావా?"అనగానే ఆదొంగ గజగజవణుకుతూ కోడిని ఇచ్చేశాడు.ఠపీమని వాడి కాళ్ళపై చావబాది వాడిని చెట్టుకి కట్టేసి  కోడి కర్రతో ఊరు చేరాడు రాముడు. ఉపాయం లేని వారిని ఊళ్ళోంచి వెళ్లగొట్టాలని అన్నారు అందుకే!
2.నమ్మకం!
రాజు మారువేషంలో వేటకెళితే  భటుల నించి వేరుపడి దారితప్పాడు.దాహంవేస్తోంది.దూరంగా ఓపూరిపాక కనపడితే వెళ్లాడు. ఓఅవ్వ తన మనవరాలు తో ఉంది. చుట్టూతా కూరపాదులు పూలమొక్కలతో రాజు కి ఆనందంగా అనిపించింది."రాజు అవ్వ తో "అమ్మా!దాహంగాఉంది "అనగానే చల్లటి ముంతనీరు అందించింది."నాయనా!బాగా అలసిపోయినావు .కాసేపు పడుకో"అంది. ఆవేపచెట్టు కింద తనతలపాగాతీసి నేలపై పరిచినడుం వాల్చాడు.మనవరాలు కట్టెపుల్లలు ఏరితెస్తే  తోటకూర వండి రాజు కి సుష్టుగా కుండలో అన్నం పెట్టింది.చీకటి పడటంతో అక్కడే పడుకున్నాడు.తల్లీ తండ్రీ లేని  ఓఅనాధ పదేళ్ల పిల్లని చేరదీసిసాకుతున్న అవ్వ దొడ్డమనసుకి మనసులోనే వందనాలు అర్పించాడు."అవ్వా!నగరంలో ఉండవచ్చు గదా? ఇలా ఒంటరిగా అడవి ప్రాంతంలో ఎందుకు?"అన్న రాజు ప్రశ్న కు "బాబూ! పట్నంలో ఎలా బతుకుతాం?ఇద్దరం దాసీలుగా బతకాలి.ఇక్కడ హాయిగా కూరలు పూలు పెంచి అమ్ముకోవడం లో ఆనందం ఉంది. ఆగుట్టపై గుడిలోదేవునికి పూలమాలలు అల్లిఇస్తాను.మాకు పంతులు  ఇంత ప్రసాదం పెడతాడు. పిల్ల నేను గుడిదగ్గరే కాలం గడుపుతాం "అని వివరించింది.తెల్లారగానే రాజు బైలుదేరాడు. ఇన్ని అటుకులు బెల్లం మూట కట్టి ఇచ్చింది. రాజు  నగరంచేరిన మర్నాడు  భటుని పంపి అవ్వ మనవరాలిని తీసుకుని రమ్మన్నాడు.భటుని చూస్తూ నే  వారు గజగజలాడుతూ"అమ్మో!మేము  రాము."అని ఏడవటం తో భటుడు చేసేదేమీ లేక  జరిగినది రాజు కి విన్నవిస్తాడు.రాజు  నవ్వుకుని  మంత్రిని పిల్చి వరహాల మూట ను అవ్వకి ఇవ్వమన్నాడు.మంత్రి మహాతెలివైనవాడు.తను వెళ్తే అవ్వ పిల్ల భయపడతారు. అందుకే ఓబైరాగిలా బైలుదేరి అవ్వను కలిశాడు."అవ్వా!రోజూ నీవు దేవుడికి పూలదండలు ఇస్తున్నావు కదా!నీపాకలో వరహాలు కురిపిస్తాడు.వాటిని ఏరుకుని దాచుకుని సుఖంగా బతకండి"అని చెప్పి బైటికి వచ్చాడు.సరిగ్గా అప్పుడే వర్షం పడుతూ ఉంది. అవ్వ గుడిసె తలుపు మూసేసింది.పాక గోడల కంతలోనించి మంత్రి  వరహాలు  లోపలికి విసరసాగాడు."అవ్వా!వానదేవుడు వరహాలు కురిపిస్తున్నాడు.బైరాగి చెప్పాడు కదా?"మనవరాలి అరుపుతో అవ్వ అంది "ఔనేతల్లీ! దేవుడు మనకు సాయంచేస్తున్నాడు.వరహాల వాన కురిపిస్తున్నాడు"అంది ఆనందంగా!🌹

కామెంట్‌లు