గీతాంజలి; -రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
 62. రంగుల వెనుక ఆయన ఆనందం.
ఈ సృష్టి ఆవిర్భావానికి మూల కారకుడైన భగవంతునికి వున్న కళాదృష్టిని ఎత్తి చూపిస్తూ వాస్తవ జీవన దృశ్యాలతో వాటిని రంగరిస్తూ ప్రేమాస్పదమైన అద్భుతాన్ని ఆవిష్కరించారు ఠాగుర్.
పువ్వుల్లో ఇన్ని రకాలు, వాటికి వేరువేరు రంగులు అద్దటంలో సృష్టికర్త కళాదృష్టి వ్యక్తమౌతోందని, ఆకాశంలోని మేఘమాలికలు వాటి క్రింద వున్న సముద్రజలాలమీద ప్రతిఫలించే రంగుల మిశ్రమనృత్యాలు చూస్తే తెలుస్తుంది. రంగురంగుల బొమ్మలను తమ చిట్టి చేతులతో అందుకుంటున్న పసివాళ్ళ కళ్ళల్లో మెరిసే ఆనందపు మెరుపుల్లో ఆ రంగుల ప్రాధాన్యత నిండి వున్నది. తల్లి పిల్లలను చిందులు తొక్కించడానికి పాడే పాటలో శబ్దసౌందర్య ధ్వని మాధుర్యం ఇమిడి వుంటుంది.
సముద్రపు అలలు తమ కదలికలతో నిరంతర శబ్దమాధుర్యాన్ని అందిస్తుంటాయి. ఆ మాధుర్యపు శబ్దాన్ని భూమాత చెవిపెట్టి వింటూవుంటుందని, నాట్యం చేయటానికి లయబద్దమైన శబ్దాక్షరితో నిండిన పాట అవసరమౌతుందని, ఇదంతా సృష్టికర్త కళాభిరుచికి అద్దం పడుతుందని అంటారు. ఈ ప్రాణికోటి కోసమై పువ్వుల్లో మకరందాన్ని, పండ్లలో మధురసాన్ని భగవంతుడు నింపి వుంచడం ఉషస్సు వెండివెలుగులో ఆకాశం నుంచి కురిసే కాంతి ప్రవాహానందం మలయమారుతం నా శరీరాన్ని తాకినపుడు నా హృదయానికి కలిగే సౌఖ్యానుభూతి వంటి రసమయ అనుభవాలన్నీ పసివాళ్ళ నవ్వుల్లో, ముద్దుల్లో, ఆటల్లో దర్శనమిస్తాయి      కామెంట్‌లు