విద్యా దానం;కంచనపల్లి వేంకట కృష్ణారావు
   తే: చదువుచే ప్రజ్ఞ,దానిచే సరసతయును,
దానిచే కార్య సఫలత, దాన ధనము
దాన త్యాగము, భోగము,దాన యశము
దాన సిద్ధించు వాంచి తార్థంబు లెల్ల.
-------నాళము కృష్ణ రావు
       అచ్యుత మహర్షి శిష్యులతో ఒక రోజు అక్షయపురానికి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్నారు ఆ నగర పెద్ద సింహాద్రి అచ్యుత మహర్షి ని శిష్య సమేతంగా తన ఇంటికి వచ్చి అతిథ్యం స్వీకరించమని ఆహ్వానించాడు సింహాద్రి.ఆయన మాట మన్నించి, అచ్యుత మహర్షి తన శిష్యులతో సింహాద్రి ఇంటికి వెళ్ళాడు.
       సింహాద్రి అచ్యుత మహర్షిని సాదరంగా ఆహ్వానించి తగిన రీతిలో గౌరవించి, ఆయనకు శిష్యులకు పంచ భక్ష్య పరమాన్నాలతో
 అధ్బుతమైన భోజనం పెట్టాడు. భోజనం అయిన తరువాత సింహాద్రి, అచ్యుత మహర్షి ఆయన శిష్యులు అనేక ఆధ్యాత్మిక ధర్మ సందేహాలను గురించి మాట్లాడుకున్నారు. ఆ సందర్భంలో సింహాద్రి రక రకాల దానాలను గురించి ప్రస్తావించి, "అన్ని దానాలలోకి అత్యుత్తమ దానం ఏది?"అని సందేహాన్ని వెలిబుచ్చాడు.
      "నాయనా, అన్ని దానాలు గొప్పవే ఆ దానం వలన  దానం అందుకున్న వ్యక్తి లేక సమూహం సంతృప్తి చెందితే అంతకన్నా ఏముంది? అన్న దానంతో ఆకలితో  అలమటిస్తున్న వాడి ఆకలి తీరుతుంది.గోదానం వలన గోవు దానం తీసుకున్న వాడికి అది భుక్తిని ఇస్తుంది. ధన దానం,బంగారు దానం ఇలా ఆయా వ్యక్తుల కు ఏదోక మేలు చేకూర్చవచ్చు. కానీ, నా ఉద్దేశంలో అన్ని దానాలకన్నా విద్యా దానం చాలా గొప్పది. ఒక వ్యక్తి విద్య పొందితే ఆ వ్యక్తి వలన అతని కుటుంబం లేక అతని చుట్టూ ఉన్న వారు అనేక విధాల అభివృద్ధి చెందుతారు. విద్య వల్ల యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం అలవడుతుంది.
తద్వారా అతను చేసే మంచి పనుల వల్ల అనేక మంది స్ఫూర్తి పొందుతారు.అన్న దానం వలన ఆకలి తీరుతుంది. కానీ, మరలా ఆకలి వేస్తుంది. ధన దానం వలన కొన్ని అవసరాలు తీరవచ్చు,  కానీ మనిషికి నిరంతరం ధనం అవసరం ఉంటుంది. అదే విద్యా దానం వలన విద్య తరగి పోదు ఖర్చు
 పెట్టే కొద్ది పెరుగుతుంది. విద్య విద్యను తీసుక వస్తుంది. విద్య ను ఎవరూ దొంగలించ లేరు.అందు వలన విద్యా దానం చాలా గొప్పది. 
విద్యా దానం చెయ్యా లంటే ఉచిత పాఠశాలలు,ఉచిత సంగీత,నృత్య,చిత్రకళ మొదలైన కళాశాలలు స్థాపించగలగాలి. ఆలోచించు" అని వివరించాడు అచ్యుత మహర్షి.
       " నిజమే మహర్షీ, మీరు చెప్పిన విషయాలు ఆలోచింప చేస్తున్నాయి. నాకు డబ్బున్న స్నేహితులు చాలామంది ఉన్నారు. అందరం కలిసి విద్యా దానానికి ప్రణాళిక లు వేసుకుంటాం" అని చెప్పాడు సింహాద్రి.
   "సింహాద్రి, మీరు చేసే మంచి కార్యక్రమాని కి నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. విద్యకు సంబంధించిన ఏ సలహా అయినా అడుగు నా పరిధిలో నేను చేస్తాను"అని సింహాద్రి కి చెప్పి,ఆయనను ఆశీర్వదించి అచ్యుత మహర్షి శిష్యులతో వెళ్లి పోయాడు.


కామెంట్‌లు