ఆనాటి ఆ మలుపు!;-- దోర్బల బాలశేఖరశర్మ
 ఎవరి జీవితం ఎలా, ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అక్షరసేద్యం పట్ల నాలో వుండిన అవ్యాజమైన అభిలాషే చివరాఖరుకు నా జీవన యానాన్ని అనూహ్య మలుపు తిప్పింది. 'ఏమనుకొని ఏమయ్యానో' తర్వాత తలచుకున్నాక నాకే ఆశ్చర్యమేసింది. ఆనాడు (1882) మా ఊరు (రామాయంపేట, మెదక్ జిల్లా) నుంచి నేను 'ఈనాడు'కు విలేకరిని అవుతానని అస్సలు ఊహించలేదు. నాకు తెలిసి, అక్కడ్నించి ఎదిగి వచ్చిన 'రెండో విలేకరి'ని (మొదటి విలేకరి సరాఫ్ మోహనాచారు గారు, ఆంధ్రప్రభ) నేనే కావడం యాదృచ్ఛికం. నాలుగేళ్ల తర్వాత (1986 మే నెలకల్లా) వార్తల ఎంపిక, సమాచార సేకరణ, సృజనాత్మక రచన, ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తర్జుమాలు చేయడం వంటి వాటిలో అతి తక్కువ సమయంలోనే ఎక్కువ నైపుణ్యం సంపాదించుకొన్నాను. పట్టుదలతో రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో నెగ్గి, అప్పటి సంచలనాత్మక దినపత్రిక 'ఉదయం'లో ట్రైనీ సబ్ ఎడిటర్ కమ్ రిపోర్టర్ గా పూర్తిస్థాయి (Full time) జర్నలిజంలో స్థిరపడ్డాను. 
'1978 నుంచి 1981 అక్టోబర్ వరకు మూడేళ్లపాటు నిజామాబాద్ లో వుండి, (హాస్టళ్లలో కాకుండా) సొంతగా వండుకొని తినుకుంటూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఎల్ఎంఈ (మెకానికల్ ఇంజినీరింగ్) డిప్లొమా కోర్సు (టెన్త్ తెలుగు మీడియం, తర్వాత ఇంగ్లీష్ మీడియం) ను కష్టపడి చదివి, ఫస్ట్ క్లాస్ లో పాసైంది ఇందుకేనా?' అనీ అనిపించక పోలేదు. అయినా, విధి నిర్ణయానికి తలవంచక తప్పలేదు. నిజానికి ఆ చదువే అప్పట్లో ఎంతో గొప్ప. సొంతూరు వచ్చిన కొద్ది నెలల్లోనే జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ చేంజ్ నుంచి 'జూనియర్ ఇంజినీర్' స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. కానీ, ఈలోపే ఏదైతే జరగాలో దానికే బీజం పడింది.
సాహిత్యం పట్ల నాలో దాగిన మమకారం సరిగ్గా అప్పుడే వెలుగుచూసింది. అది కథలు, కవిత్వంతో మొదలై, 'ఈనాడు' జర్నలిజం వైపు మళ్ళింది. 'ఈనాడు' అన్ని పేపర్ల వంటిది కాదుగా! చేరిన తొమ్మిది నెలల్లోనే నేను పత్రికలో ప్రచురించిన, స్థానిక ప్రజల ప్రయోజనానికి సంబంధించిన ఒక వార్త కాంట్రవర్సీగా మారింది. ఆ తర్వాత, కోరి వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని (టెక్నీషియన్, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్) కాదనుకుని (కాలదన్నుకొని), ఇదే జర్నలిజాన్ని ప్రధాన వ్యాపకంగా మార్చుకోవలసి వచ్చింది.
x

కామెంట్‌లు