పక్షులకు టోపీలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఓపావురాల జంట ఎంతో హాయిగా కలిసి మెలసి తిరుగుతూ ఉంటుంది. ఆడపావురం అంది"చూడవయ్యా! మనుషులు రకరకాల  టోపీలు నెత్తిన పెట్టుకొని ఎండ వాన నించి తలని కాపాడుకుంటారు. ఒంటినిండా రంగు రంగుల దుస్తులతో మెరిసిపోతున్నారు.మనం మాత్రం  ఒకే రకం రెక్కల తో కష్టపడి ఎగిరి  ఆహారం  సంపాదించుకోవాలి."అని నిట్టూర్చింది."నీమొహం!వారు అన్ని జాగ్రత్త లతో ఉండి రోగనిరోధక శక్తి తగ్గి  రకరకాల రోగాల తో బాధ పడుతున్నారు.ఎండలో నడిచి చెమటలు కక్కుతూ వడదెబ్బ కి గురి ఔతారు.బజారు ఐస్ఫ్రూట్ రసాయనాల కూల్ డ్రింక్స్ తాగి లివర్ ఇతరరోగాలతో సతమతం అవుతున్నారు. చలికాలం వర్షానికి దగ్గు జలుబు ప్రస్తుతం  కరోనా ఇంకా  కొత్త వైరస్లతో గగ్గోలు పెడుతున్నారు"మగ పావురం అంది."దేవుడు మనకి అందమైన రెక్కలిచ్చాడు.ఆహారం తృప్తి గా సంపాదించి తింటున్నాము.""సరే ఆపవయ్యా నీసుత్తి!నాకు టోపీ పెట్టుకోవాలి అని ఉంది. తెచ్చి పెట్టవూ?" సరే అంది మగ పావురం."ఇద్దరం టోపీ కి కావల్సిన  వస్తువులు  సేకరిద్దాం." ఆజంట ఎగురుతూ  పత్తిచెట్టునించి దూదిని సేకరించి  దూదిని ఏకేవాడి ముందు వాలాయి. "అయ్యా!మాపక్షులకి సరిపడే దూది ఏకి ఇవ్వు.మా పక్షుల మన్నీ నీకు దూది సేకరించి నీ ఇల్లు అంతా నింపేస్తాం"అనగానే  అతను సరేనన్నాడు.ఆపావురాలజంట తోటి పక్షులతో కలిసి  పత్తి చెట్లనించి దూది సేకరించి అతని ఇల్లు  నింపాయి.
అతను సంతోషంగా అన్నాడు "మాకన్నా  మీరే నయం!మీలో ఉన్న ఐకమత్యం పరోపకారం మా మనుషులకు లేవు.దురాశతో మాలో మేమే  కొట్టుకు చస్తున్నాం!"అని ఆపిట్టలన్నిటికీ సరిపడా  దూది ని ఏకి వడికి ఇచ్చాడు. పావురాలు దాన్ని ఒక బట్టలునేసేవాడికి ఇచ్చి "అయ్యా! మాపక్షులకి సరిపడే బట్ట నేసి మిగతాది నీవు తీసుకో"అన్నాయి.ఆసాలెఅతను పది మీటర్లు నేసి ఐదు మీటర్లు వాటికి ఇచ్చి  మిగతాది తాను ఉంచుకున్నాడు.ఆపావురాలజంట దర్జీ వాడి దగ్గరకు వెళ్లి "బాబూ!మాఇద్దరికీ టోపీలు కుట్టి ఇవ్వు. మిగతాది నీవు వాడుకో"అన్నాయి.అతను కుట్టిన  టోపీలు నెత్తిన  పెట్టుకొని ఆపావురాలజంట  ఓపిసనారి ధనికుని ఇంటిముందు వాలాయి.అతను  ఎంగిలి చేయికూడా కాకికి విసరడు.అతనిది నున్నటి బోడిగుండు!"ఆపావురాలజంట నెత్తి న ఎంచక్కా టోపీలు పెట్టుకొని ఆనందంగా ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. నాకూ అలాంటిది కావాలి. "తనలో తానే గొణుక్కుంటూ ఉన్న అతనితో మగపావురం ఇలాఅంది"నీవు దొంగ వ్యాపారం చేస్తావు.రైతులకు కల్తీ విత్తులు అమ్ముతావు.కరోనా తో అంతా బెంబేలెత్తుతున్నారు. నీవుమాత్రం సుష్టుగా తింటూ ఆకలి తో అల్లాడేవారికి ఒక పాకెట్ పులిహోర  పెరుగన్నం కూడా ఇవ్వవు.చెట్టుకి చెంబెడు నీరు పోయవు.మాకు గుప్పెడు గింజలు వేయవు.కుండంత బొజ్జతో రోగాల పుట్టగా మారావు.ఇప్పటికైనా నీకున్నదాంట్లో కొంచెం దానం చేయి.భార్య పిల్లలు లేని నీవు  ఇప్పుడే దానధర్మాలు చేస్తూ శేషజీవితం గడుపు.నీవు మారితే నీచుట్టూ ఉన్న వారు కూడా నీకు సాయం చేస్తారు "అని చెప్పి రివ్వున ఎగిరిపోయాయి. 🌷
కామెంట్‌లు