సంబరాల సంక్రాంతి;-దుగ్గి గాయత్రి,టి.జి.టి.తెలుగు,కల్వకుర్తి,నాగర్ కర్నూల్.
 అమ్మ సంతోషంగా సంచిలో బట్టలు సర్దుతోంది.కన్నయ్య తన గాలిపటం సరిగా ఎగరటం లేదంటు ఏడ్చుకుంటు మిద్దెపై  నుండి కిందకు వచ్చాడు. అమ్మ సంతోషంగా ఉండటం చూసి అమ్మా ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడిగాడు కన్నయ్య.కన్నయ్యతో సంక్రాంతి సెలవులకు అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తున్నామని చెప్పింది అమ్మ.ఎగిరిగంతేశాడు కన్నయ్య.అమ్మానాన్నలతో కలిసి కన్నయ్య ఊరికి బయల్దేరాడు.తోవలో పచ్చని పంటపొలాలు, రంగుల తీవాచీలు పరిచినట్లున్న రంగవల్లికలు వాటి నడుమ గొబ్బెమ్మలు,డూ డూ బసవన్నలు, హరిదాసుల కీర్తనలు చూస్తూ ,పంటలు ఇంటికి చేరే వేళ రైతుల ఇళ్లలో నెలకొనే ఆనందాలు,అమ్మ చెప్పే గోదా కళ్యాణం వింటూ అమ్మమ్మగారింటికి చేరుకున్నారు.కన్నయ్యకు అమ్మమ్మ నువ్వులనూనెతో .మర్దన చేసి తలంటు పోసింది.అందరూ కలిసి గుడిలో జరిగే గోదాకళ్యాణానికి వెళ్లారు.అక్కడి నుండి కన్నయ్య వాళ్ళ తాతగారితో కోడిపందాలను చూసి వస్తూ వస్తూ తాతగారికి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ చెరుకుగడలు నములుతూ ఇంటికి చేరుకున్నాడు.
అమ్మమ్మ చేసిన అరిసెలు,నువ్వులుండలు,చకినాలు,కజ్జికాయలు,చేగోడీలు తింటూ ఆరోజంతా  సరదాగా గడిపాడు కన్నయ్య.మరుసటి రోజు సంక్రాంతి పండగనాడు అమ్మ వేసే రంగవల్లికలో నేనూ రంగులు నింపుతానంటూ అమ్మకు పనిలో సహాయం చేసాడు కన్నయ్య. అమ్మమ్మ పందిరింట్లో పాలు పొంగించింది. అమ్మమ్మ చేసిన పొంగలి అన్నం తిని మామయ్యతో కలిసి గాలిపటాలు ఎగరేసి ఎంతో ఆనందంగా గడిపాడు.కన్నయ్య అమ్మమ్మతో పిజ్జాలు,బర్గ్ ర్ల కన్నా అమ్మమ్మ చేసిన పిండి వంటలే కమ్మగా ఉన్నాయని చెప్పడంతో అమ్మమ్మ ఎంతో సంబరపడుతూ  ఇంట్లో చేసిన వంటకాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని చలికాలానికి  వెచ్చదనం వచ్చేనెదుకు,రానున్న వేసవి కాలానికి అనుగుణంగా మన శరీరం మారే విధంగా నవ్వులతో చేసే ఈ పిండివంటలు తోడ్పడతాయని చెప్తుంది.మరుసటి రోజు  తాతగారు పశువులను శుభ్రం చేయగా అమ్మమ్మ పసుపు,కుంకుమలతో అలంకరించి పూజ చేసే పూజలో తాను కూడా పాల్గొని మన సంస్కృతిలో పశువులను కూడా పూజిస్తారని తెలుసుకొని అమితానందాన్ని పొందుతాడు కన్నయ్య.ఇలా ఎన్నో సంబరాలను పంచిన సంక్రాంతిని మదిలో నింపుకొని మన భారతీయ సంస్కృతిని,రైతుల కష్టాన్ని తలుచుకొని తన మనసులోనే నమస్సులు తెల్పుకుంటూ ఆరాధనా భావంతో అమ్మానాన్నలతో తిరుగు ప్రయాణమయ్యాడు కన్నయ్య.

కామెంట్‌లు