లేఖా సాహిత్యం; డా.. కందేపి రాణీప్రసాద్.

 ప్రియమైన నేస్తానికి,
ఇక్కడ అంత క్షేమం. అక్కడ మీరంతా క్షేమమని తలుస్తాను. స్కూలులో మన మిత్రులంతా ఎలా ఉన్నారు. నేనేమో ఈ స్కూలులో కొత్తవారి మధ్య ఏమి తోచడం లేదు నాన్నగారికి ట్రాన్స్ ఫర్ రాకపోతే నేను కూడా మీతోనే ఉండేదాన్ని. నాకూ మాటి మాటికి మన స్కూలు మన మిత్రులే గుర్తుకు వస్తున్నారు. మన స్కూల్లో ఉన్నంత ఆటలు మైదానం ఈ చీరాల స్కూలులో లేదు. అయితే ఇక్కడ యూనిఫాం ఉన్నది. ఆకుపచ్చ స్కర్ట్, తెల్ల జాకెట్ వేసుకోవాలి. రిబ్బన్లు కూడా తెల్లవే వేసుకోవాలి. మన ఊర్లో ఉన్నప్పుడు యూనిఫాం అలవాటు లేదు కదా! అందుకే చాల సార్లు వేసుకోవటం మర్చిపోతున్నాను. దానికి గాను ప్రేయర్ లో నిన్చోబెట్టకుండా బయటే నిలబెడుతున్నారు మా హెచ్ ఎమ్ గారు. ఇక్కడ ఈమె చాలా స్ట్రిక్ట్ అట. పైగా ఇది గర్ల్స్ హైస్కూల్ కదా! అందరూ ఆడపిల్లలే ఉంటారు. పైగా ఇప్పుడు నేను చేరిన తొమ్మిదో  తరగతిలో 5 సెక్షన్లు ఉన్నాయి. మనూర్లో అయితే ప్రతి క్లాసుకు ఒకటే సెక్షను. పైగా మనకక్కడ అబ్బాయిలే క్లాసులే ఎక్కువగా ఉంటారు. మనం అమ్మాయిలం ఐదుగురే కదా! ఇది పెద్ద ఊరం. అందుకే ఇక్కడ మూడు హైస్కూళ్ళు ఉన్నాయి. మా స్కూలు కాక మిగతా రెడింటిలో అబ్బాయిలు, అమ్మాయిలు కలసి చదువుకుంటారు. నేను చదివే కస్తురిబా గాంధీ మిన్సిపాల్ హై స్కూల్ లో మాత్రం కేవలం ఆడపిల్లలే చదువుకుంటారు.
మీరంతా ఎలా ఉన్నారు. నేను లేను కదా! నాలుగు స్తంబాలాట ఆడేటప్పుడు నా బదులు ఎవరిని తెచ్చుకున్నారు. సాయంత్రం మనింటి ముందు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారా! ;నిన్నటి ఆటలో ఎవరూ గెలిచారు. స్కూలు లో డ్రిల్లు మాస్టారు తాడట అడిస్తున్నారా! నువ్వు వంద దాకా అవుటవ్వ కుండా ఆడుతున్నావా? క్లాసులోకి వెళ్ళేటపుడు అబ్బాయిలు ఎడిపిస్తున్నారా! మొన్నటి క్వాటర్లి పరీక్షల్లో ఫస్ట్ మార్క్ ఎవరికీ వచ్చింది. వాళ్ళే కొట్టేసుకున్నారా? మన అమ్మాయిల కొచ్చిందా! ఈ చిరాల్లో అయితే నాకంతా కొట్టగా ఉంది. కొత్తగా వచ్చావని నన్ను ఇ సెక్షన్లో కూర్చో బెట్టారు మొదట్లో. రెండు రోజుల తర్వాత మరల డి సెక్షన్ కు పొమ్మన్నారు. ఇలా మార్చి, మార్చి నన్ను ఇపుడు డి సెక్షన్ లో వేశారు.
మా స్కూలు లో నాకూ నచ్చిన వింతైన విషయం ఒకటుంది తెలుసా! మా బి సెక్షన్ పక్కనే ‘ సైరన్ ‘ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం 5 గం..లకు ఒకసారి సైరన్ మోగిస్తారు. ఇది ఊరంతా వినపడుతుంది. మాకు పక్కనే ఉంటుంది కాబట్టి మేమంతా చెవులు మూసుకుంటాం. ఇది మాత్రం పెద్ద కొట్టు. ఇక్కడ చాల రకాల మిఠాయిలు దొరుకుతాయి. ఇక్కడ ‘ బాసుంది ‘ అని కొత్తరకం స్విటుంది. చాల బాగుంది, నాకు స్విట్లంటే చాల ఇష్టమని తెలుసు కదా! అవునూ మే అమ్మ బూరెలు బాగా వండుతుంది కదా! మొన్న దసరాకు వండుకున్నారా?
మనింటి దగ్గర నుంచి ఇంతకు ముందులా అందరూ కలసి వెళ్తున్నారా స్కూలుకు. మన డ్రాయింగు మాస్టారు కొత్త బొమ్మలు ఏమేమి నేర్పిస్తున్నాడు? డ్రిల్లు మాస్టారు కోకో అట అడిస్తున్నాడా? ఎప్పటి లాగా అబ్బాయిలే గెలుస్తున్నారా? చారుమతి రోజూ స్కూలుకు వస్తోందా! వాళ్ళింట్లో చాకలి మూటలు చాలా ఉన్నాయని అప్పుడప్పుడు స్కూలుకు ఎగ్గోడుతుంది కదా! ఇప్పుడు కూడా అలానే చేస్తుందా! రత్నకుమారి మాస్టారు ఏ ప్రశ్నడిగినా ‘నాకు తెలియదు’ అని చెప్తుంది కదా! అందరూ నవ్వేవాళ్ళు! నేను ఇక్కడ ఉన్న నాకు రోజూ మన స్కులే గుర్తోస్తున్నది. ఇక్కడ వాళ్ళు నాకు నచ్చటం లేదు.
మా నాన్నగారు ఊరు మారకుండా ఉంటె ఎంత బాగుండేది. నేను తొమ్మిది, పది తరగతులు కూడా మీతో పాటే చదువుకునేదాన్ని. కాలేజీ టైముకు ఈ ఊరు వస్తే బాగుండేది. మనూర్లో ఎలాగూ కాలేజీ లేదు కాబట్టి. నాన్నగారు ఇందుకే ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారంట. మొన్న అమ్మతో చెబుతుంటే విన్నాను. “ కాలేజీకి కొత్త ఊరు వస్తే అమ్మాయి అలవాటు పడేలేదు. ఇప్పుడే మారిస్తే, ఈ రెండేళ్ళు ఉరికి, కొత్త వారికీ అలవాటు పడుతుంది. కాలేజికి వచ్చేసరికి అంతా మామూలవుతుంది. అమ్మాయిని అసలే డాక్టరు చదివించాలనుకున్నాం కదా! ఇంటర్ చాలా ముఖ్యం” అని అంటున్నారు నాన్నగారు.
ఇంకా ఏమిటి సంగతులు? మన ఎదురింటి నాగయ్య గారింట్లో ఆవుపేడతెచ్చుకుంటున్నారా. ఇంటి ముందు పేడ నీళ్ళు చల్లి ముగ్గులు వేస్తున్నావా? అవును గానీ నువ్వేమైనా కొత్త ముగ్గులు నేర్చుకున్నావా? నేనైతే ఇక్కడ చాల కొత్త ముగ్గులు నేర్చుకున్నాను. కానీ ఇక్కడ ఇంటి ముందు ఎక్కువ ఖాళి లేదు. చిన్న చిన్న ముగ్గులే వెయ్యాలి. మానూర్లో వేసినట్లు క్పెద్ద ముగ్గులు వెయ్యడానికి కుదరదు. అందులోనూ మా ఇంటి ముందు రోడ్డు మీద బస్సులు వెళతాయి. అమ్మ అందుకే భయపడుతుంది. నువ్వు ముగ్గు ధ్యాసలో పడి రోడ్డు మీద వచ్చే రిక్షాలు, బస్సులు చూసుకుంటావో లేదో నని. అయినా ఇక్కడ హోం వర్కు కూడా ఎక్కువే. తొమ్మిదో తరగతి, పదవ తరగతిల్లో సైన్సు కు రికార్డుల్లున్నాయి తెలుసా! అందులో బొమ్మలు వేయాలి. వాటికీ మార్కులు కూడా వేస్తారు. పది మార్కులకు బొమ్మ. మొన్న నేను వేసిన ఆకు నిర్మాణంకు తొమ్మిదిన్నర మార్కులు వచ్చాయి. పి.ఎస్. రికార్డులో ప్రయోగాలు రాయాలి. ఆ బొమ్మలు బాగా కష్టంగా ఉన్నాయి. గాజు కుప్పెలు, పరిక్ష నాళికలు వేయడం నాకు రావడం లేదు.
సరే ఉత్తరం చాలా పెద్దగా రాసేస్తున్నారు. ఇంక అమ్మ పిలుస్తున్నది. అన్నం తినడానికి రమ్మంటున్నది. మీ ఇంట్లో అక్కయ్యల్ని, అన్నయ్యల్ని అడిగానని చెప్పు. అమ్మకు, నాన్నకు నమస్కారాలు చెప్పు. మరిచిపోకుండా మరల ఉత్తరం రాయి. ఇక శెలవు...
                                                                    నీ ప్రియ మిత్రురాలు 
                                                                      రాణి 
కామెంట్‌లు