నారదుడు .;-డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 పట్టువదలని విక్రమార్కుడు శంలోని బేతాళుని బంధించి భుజంపైన వేసుకుని మౌనంగా నడవసాగాడు.
శవంలోని బేతాళుడు 'మహారాజా వైద్యనాధ లింగం,వక్రేశ్వరనాధ లింగం,సిధ్ధనాధ లింగం,తారకేశ్వర లింగం,ఘటేశ్వరలింగం,కపిలేశ్వరలింగం వంటి షడ్విధ లింగాలను పూజించిననీకు పురాణాలపై మంచి అవగాహానఉంది నాకు నారదుని గురించి తెలుసుకోవాలనిఉంది తెలిసి చెప్పక పోయావో మరణిస్తావు 'అన్నాడు బేతాళుడు. 
బేతాళా !పూర్వజన్మలో నారదునిపేరు ' సారస్వతుడు ' అవంతినగర నివాసి తన ఆస్తి బిడ్డలకు పంచిఇచ్చి , అడవిలో తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి మరుజన్మలో నారదుని పేరుతో జన్మించి నిత్యం అనుక్షణం హరినామంతో తరిస్తావని వరంపోంది బ్రహ్మలోకం చేరాడు.
మరుజన్మలో బ్రహ్మదేవుని కుమారుడిగా జన్నించాడు.( నారదుడు ఉపబర్హూడు అనే గంధర్వుడిగా కూడా చెప్ప బడింది.) మహాభాగవతం మొదటి స్కంధంలో వారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.
పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించి నట్లయితే సమ్యగ్దర్శనుడౌతాని గ్రహించాడు.
అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది - ఈ జన్మలో నీవు నన్ను పొందలలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.
అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశీంచి ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.
ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.
మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు ఇలా నారద మహర్షి గురించి పలువిధాలుగా చెప్పబడినది 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభంగం కావడడంతో శవంతోసహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు.
పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు. 
కామెంట్‌లు