ఐశ్వర్య రెడ్డి గంట తో సునీత నెల్లుట్ల ముఖాముఖి
 ప్రశ్న:నమస్తే మేడం
నమస్తే మెడం
* ప్రశ్న:మన సాహితి బృందావన జాతీయ వేదిక ఆత్మీయ  సభ్యులకోసం మీ గురించి నాలుగు మాటలు... 
మీ మాటల్లో .. 
పేరు, తల్లిదండ్రులు, స్వస్థలం, కుటుంబ నేపద్యం ఇతర వివరాలు ? 
సాహితీ బృందావన జాతీయ వేదిక సభ్యులందరికీ నమస్కారం. 
నా పేరు ఐశ్వర్య రెడ్డి గంట
 నా స్వస్థలం హనుమకొండ
నేను ఎమ్. బి. ఎ   చదువుకున్నాను.
 తల్లిదండ్రులు శ్రీమతి జ్యోతి రమ , గాల్ రెడ్డి గార్లు
 మా అమ్మ గృహిణి, మా నాన్నగారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి
నాకు ఇద్దరు తోబుట్టువులు
 నా భర్త  హేమంత్ రెడ్డి 
ఆయన ప్రస్తుతం బిజినెస్ రంగంలో ఉన్నారు మాకు ఇద్దరు అమ్మాయిలు.... 
మా అత్త మామలు రామారెడ్డి అరుణగార్లు
మాది రైతు కుటుంబం. 

* ప్రశ్న:మీ విద్యాబ్యాసం ఎక్కడ జరిగింది.
ఎలా సాగింది? 
 నా విద్యాభ్యాసం అంతా  హనుమకొండ లోనే సాగింది,  ఎంబీఏ మాత్రం  కరీంనగర్ లో ప్రముఖ కళాశాల లో  చదివాను. 

* ప్రశ్న:మీ బాల్య స్మృతులు నెమర వేస్తారా? 
 అందరి లాగే నా బాల్యము గడిచింది, 
స్కూలు ఇల్లు అంతే  , ఎప్పుడైనా అమ్మానాన్న తీసుకెళ్తే సరదాగా ఓ సినిమాకి ,ఎండాకాలం సెలవులు వస్తే అమ్మమ్మ దగ్గరికి ఇంకా చెప్పాలంటే, నేను ఎక్కువగా ఇంట్లో నుంచి బయటికి వెళ్లడానికి ఇష్టపడకపోయేదాన్ని  అందువల్ల ఆటలాడుకోవడం తక్కువ
* ప్రశ్న:మీ వృత్తి  ఏమిటి ..  ప్రస్తుతం ఏమి చేస్తున్నారు?
 వృత్తి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ,  ప్రస్తుతం నాకు చిన్న పిల్లలు కాబట్టి కుటుంబానికి  ఎక్కువ సమయం కేటాయిస్తున్నాను.  
*ప్రశ్న:కుటుంబం అంటే ఎలా ఉండాలి....? 
కుటుంబం లో అందరు సభ్యులు ముఖ్యమైన వారే పిల్లలతో సహా, అందులో ఎవరికి  ఏ కష్టము వచ్చిన కూడా కుటుంబములో అశాంతి నెలకోంటుంది, అలాంటి సందర్భాలలో ఒకరికి ఒకరం వెన్నుదన్నుగా నిలవాలి, ఎందుకంటే ప్రతి ఒకరికి కుటుంబమే ధైర్యం ,ఆ కుటుంబం మనతో ఉంటే ఎన్ని విజయాలైనా సాధిస్తాం, ఎన్ని ఆటుపోట్లు అయినా ఎదుర్కొంటాం, అందుకే ప్రతి ఒక్కరికి కుటుంబం  యొక్క మద్దతు  ప్రేమ అనేది చాలా అవసరం.


*ప్రశ్న: మీ ప్రవృత్తి ఏంటి? 
నా ప్రవృత్తి సాహిత్యం, 
ఒక మంచి రచయిత గా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాను. కాని ఇప్పుడు సమయాభావం వల్ల ఎక్కువగా రాయలేకపోతున్నాను. 
 * ప్రశ్న: మీ అభిరుచులు ఏంటి ? 
 నా అభిరుచులు 
ఎక్కువగా పుస్తకాలు చదవడం, పాటలు వినడం ,అంతర్జాలంలో కొత్త విషయాలను తెలుసుకోవడం, కొత్త కొత్త పర్యాటక ప్రదేశాలను చూడటం. 



* ప్రశ్న: మీరు ఎన్నుకొన్న  వృత్తి, ప్రవృత్తి ఇప్పుడు ఎలా ఉంది? 
రెండు బాగానే ఉన్నాయి ,వృత్తి అనేది జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతోంది. సాహిత్యం అనేది  మానసిక ఒత్తిడి ని దూరం చేస్తుంది. ఒక మంచి కవిత్వం చదివినప్పుడు రాసినప్పుడు ఆ అనుభూతి  పొందే వారికే తెలుస్తుంది. 


* ప్రశ్న: మీరు వృత్తిలో ప్రవృత్తిలో ఏలా ప్రవేశించారు? ఎప్పటి నుంచి ఎన్ని కొనసాగుతున్నారు? 
 మాస్టర్స్ అయ్యాక క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే ఒక ప్రైవేటు బ్యాంకు లో ఇన్సూరెన్స్ విభాగంలో జాబ్ రావడం జరిగింది. అక్కడ జాబ్ తరువాత
కొన్ని రోజుల విరామం తర్వాత  గత ఐదు సంవత్సరాలు గా
ఫ్రీలాన్సర్ గా మేనేజ్మెంట్ కన్సల్టెంట్ గా నా సేవలను ప్రారంభించాను.
ప్రవృత్తి అంటే సమయం దొరికినప్పుడు  సాహిత్యాన్ని రాయడానికి ఇష్టపడతాను ఇప్పుడు ఎక్కువగా  రాయ లేకపోతున్నాను .కాని నాకు ఎంత సమయం మిగిలితే అంత సమయాన్ని సాహిత్యం కోసమే కేటాయించాలని ఉంది భవిష్యత్తులో. 

* ప్రశ్న:మీ వృత్తి, ప్రవృత్తిలో అనుభవాలు ఏమిటీ ? 
అంతా బాగానే ఉంది,,,, అన్ని మంచి అనుభవాలే , ప్రతి విషయం, ప్రతి సంఘటన, ప్రతి రోజు...ఎన్నో అనుభవాలు 
ఇవన్నీ మన జీవితానికి ఏదో ఒకటి నేర్పిస్తునే ఉంటాయి. మంచి భవిష్యత్తు కు బాటలు వేస్తాయి. 


*ప్రశ్న:మీరు జీవితంలో చేదు అనుభవాలు వున్నాయా? 
 నా వృత్తిలో చేదు అనుభవాలు అంటే ఏమి లేవనే చెప్పాలి. ఎందుకంటే నేను ఏ పని  తీసుకున్నా కూడా అదిసమయం కంటే ముందే పూర్తి చేస్తాను . ఎక్కువగా కష్టపడతాను 
 ఇంతవరకు చేదు అనుభవం లేకపోవడానికి ఇవే కారణం కావచ్చు . ఉన్న కాస్త సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటాను .ఎక్కడ  ఎవరికి నా వల్ల అయినా కానీ ,నాతో ఎవరికి గానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాను..
 ప్రవృత్తిలో కూడా ఇప్పటివరకూ  లేవు సాహిత్యంలో నేను ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూన్నాను అందరూ నన్ను ఆదరించి   ప్రోత్సహించిన వారే తప్ప ఎప్పుడు నన్ను బాధ పెట్టిన వారైతే ఎవరు లేరు ఆ పరిస్థితులు అయితే రాలేదు ఇంత వరకు. 
*ప్రశ్న:మీ అంతరంగం లో మెదిలిన సందేశాలు, సలహాలు ఏమిటి..? 
అంతరంగం లో ఎప్పుడు మెదిలే విషయము అంటే జీవితం చాలా చిన్నది 
 ఇప్పుడు ఉన్న ఈ క్షణం మళ్లీ తిరిగి అయితే రాదు , ఆ క్షణాన్ని బాధతో దుఖంతో కోల్పోవడం ఎందుకు ,ఉన్న జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడిపేద్దాం, సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి నాకు ఉంటాయి మీకు ఉంటాయి ,సమస్యల్లేకుండా అయితే ఎవరూ  ఉండరు ,ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య అది పెద్దదా చిన్నదా పక్కన పెట్టేయండి ,కానీ పరిష్కారం లేని సమస్య అయితే ఉండదు. దానికి పరిష్కారం దొరుకుతుందనే ఆశతో నమ్మకంతో ఉందాం ,ఈ ఉన్న క్షణాన్ని , నిమిషాన్నీ  గడిపేద్దాం సంతోషంగా , మన పిల్లలకు కూడా అదే చెప్పాలి. 

* ప్రశ్న:మీరు ఈ సమాజంలో అనేక రకాల మనుషులు  వుంటారు కదా!. 
వారి మనస్తత్వంలను మీరెప్పుడయినా గమనించారా? 
ఒక్కొక్కరిదీ ఒక్కో మనస్తత్వం ,మనకు జీవితంలో ఎంతో మంది తారసపడతారు, ప్రతి వారిని పూర్తిగా అంచనా వేయలేము కానీ ఎంతో కొంత అంచనా వేయగలము. వారి మనస్తత్వం ను బట్టి మనం ఉంటే బాగుంటుంది. 
అందరితో సర్దుకుపోవడం అనేది చాలా కష్టమైన పని ,ఎందుకంటే కొన్ని మనకు నచ్చుతాయి కొన్ని మనకు నచ్చవు కాకపోతే కొన్ని సందర్భాల్లో తప్పదు. 

* ప్రశ్న:వ్యక్తిగతంగా మీరు ఎలా ఫీల్ అయ్యేవారు అలాంటి వారి గురించి?... 
వ్యక్తిగతంగా కొన్ని సార్లు మన మనస్తత్వానికి విరుద్ధమైన మనుషులతో కలిసి పని చేయవలసి వచ్చినా లేక వాళ్లతో ఉండవలసి వచ్చిన సందర్భాల్లో   వారి కోణంలో ఆలోచించడానికి ప్రయత్నిస్తాను.
ప్రతి ఒక్కరూ ఒక్కో కోణంలో ఆలోచిస్తారు కొంతమంది ఆలోచనలు చూస్తే ఈ విషయాన్ని ఇలా కూడా ఆలోచించవచ్చా అని మనకు అనిపించే సందర్భాలు కూడా వుంటాయి.అందరితో కలిసి పని చేయాలి కాబట్టి కొన్నిసార్లు కష్టమనిపించినా సమూహ నియమాలు పాటించక తప్పదు. . 

*ప్రశ్న:మీకు ఏఏ రంగాలలో ప్రవేశం ఉంది?. 
నాకు బ్యాంకింగ్ రంగంలో ,ఇన్సూరెన్స్ రంగంలో మేనేజ్మెంట్లో ,బోధనా రంగంలో అలాగే సాహిత్యంలో కూడా ప్రవేశం  ఉంది
  వీటన్నింటిలో నాకు ప్రవేశం ఉన్నా కూడా నేను ఎప్పుడూ నిత్య విద్యార్థి ని

 * మీకు సామాజిక, సాహిత్యం రంగాలపై మీకు అభిరుచి ఎలా ఏర్పడింది?
  చిన్న వయస్సు లో మా తాతయ్య వలన నాకు పాత పాటలు వినడం అలవాటయింది,  అందులో సంగీతం కంటే  సాహిత్యం ఎక్కువగా నచ్చేది.
ఆ పదాలను గుర్తుంచుకోని కోత్తగా రాయడానికి ఇష్టపడేదాన్ని... నేను ఏడవ తరగతి నుండి రాస్తున్నాను
 నాకు ఎవరితో ఏదైనా మాట్లాడాలి అంటే భయం,బెరుకు
అందుకే ఏది అనిపించినా ,ఏ విషయం పై అయినా నా అభిప్రాయాన్ని  వ్యక్త పరచడానికైనా 
ఒక కవిత రూపంలో పుస్తకాల్లో రాసుకునే దానిని.
అది ఒక వస్తువు గురించి అయినా ఒక మనిషి గురించి అయినా బాధ అయినా కోపం అయినా సంతోషమైన ఇలా రాసుకోవడం వల్ల నాకు ఎంతో సంతోషమనిపించేది. 
 నాకు తెలియకుండానే కొన్ని డైరీలు నింపేసాను నా కవిత్వంతో 
అయితే అది కవిత్వం అని నాకు తెలీదు మా అమ్మ గుర్తించి  నన్ను ప్రోత్సహించింది.అలా అలా మెల్లగా స్కూల్లో కాలేజీల్లో పోటీలలో పాల్గొనడం అందరూ మెచ్చుకోవడం జరిగింది 
 * ప్రశ్న: కవిత్వం అంటే మీదృష్టిలో నిర్వచనం ఏవిధంగా చెపుతారు? 
కవిత్వం అంటే  మనసును రంజింపజేసి ఆలోచింపజేసింది. 
 కవిత్వం అంటే ఒక పరిశీలన ఒక అన్వేషణ మరియు కవిత్వంలో ఎక్కడ మొహమాటం ఉండకూడదు, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని మొహమాటం లేకుండా చెప్పగలగాలి.  కవిత్వం రాయడంలో హద్దులు ఉండకూడదని నా ఉద్దేశం


* ప్రశ్న:  మీరు రాసిన, మీకు నచ్చిన కవిత ఒకటి చెప్పండి...? 
నేను రాసిన కవితలన్ని  నాకిష్టమే , ఈ వేదిక లో అందరు నా గురు సమానులే కాబట్టి
గురువు గురించి నా కవిత
శీర్షిక: కాంతి పుంజం
తాత్విక జ్ఞానాన్ని పెంపొందించే తత్వవేత్త గురువు , 
కోటి కాంతుల తో వెలిగే కాంతిపుంజం గురువు, విద్యా సముపార్జన చేసిన విద్యావేత్త గురువు, ఉపాధ్యాయ వృత్తిని ఊపిరిగా భావించేది గురువు, 
 ఉన్నతమైన జ్ఞానాన్ని ఉత్సాహంగా పంచేది గురువు, 
 ఓర్పుతో నేర్పుతో అక్షరాలు నేర్పించి ఓటమి భయాన్ని ప్రాలదోరేది గురువు , 
 చదువు అనే పుస్తకానికి కలం గురువు, సమయపాలన కు సన్నిధి గురువు, 
జ్ఞానమనే జ్యోతికి చమురు గురువు, 
విద్యాబుద్ధుల కు  పెన్నిధి గురువు, 
 చీకటిలో వెలుగును పంచే కిరణం గురువు, భావిభారత పౌరుల కలల సౌధానికి పునాది గురువు , 
సముద్రమంత జ్ఞానాన్ని లోకానికి పంచేది  గురువు , 
ప్రగతి కి కారణమైనా గుర్తింపు ఆశించని వేరు గురువు, 
  కులమత తారతమ్యాలు లేక విద్య అనే ఫలాన్ని పంచేది గురువు, 
 విధాత రాసిన రాతను తన నైపుణ్యంతో మరింత వేలుగోందేలా చేసే ప్రదాత గురువు. 


*ప్రశ్న: ఎలాంటి కవిత్వం మీరు ఇష్ట పడుతారు ? 
కవిత్వం అంటేనే  చాలా ఇష్టము... మనస్సు పెట్టి రాసేది, ఉత్సాహాన్ని నింపేది,జ్ఞానాన్ని పంచేది. చైతన్యం కలిగించేది
సమాజానికి ఉపయోగపడేది
ఇలా ఏదైనా నేను ఇష్టపడతాను .

* ప్రశ్న:మీరు కవిత్వం ఎప్పటి నుంచి రాస్తున్నారు? 
 
నేను గత సంవత్సరం నుండే వేదికలలో రాయడం మొదలు పెట్టాను, చిన్న వయస్సు నుండి రాస్తున్నాను. 



* ప్రశ్న: ఏఏ సాహితీ ప్రక్రియలు యందు తమకు అవగాహన, అనుభవం వుంది? 
అన్ని ప్రక్రియలు చూస్తున్నాను. 
వచన కవిత్వంలో  నేను ఎక్కువగా రాస్తాను అలాగే నానీలు, తేనియలు, సున్నితాలు ఈ ప్రక్రియలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. 
* ప్రశ్న: మీరు రాసిన ఏఏ రచనలు పుస్తక ప్రచురణలు నోచుకొన్నాయి? 
నేను రాసిన మన తెలంగాణ కవిత, డాక్టర్ ల దినోత్సవం సందర్భంగా రాసిన కవిత, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాసిన కవిత, , రాఖీ పౌర్ణమి సందర్భంగా, స్నేహితుల దినోత్సవం సందర్భంగా,,బాల భారతం పుస్తక లో ,ఇంకా పలు సంకలనాలలో, నా కవిత లు చాలా వరకు ముద్రించబడినవి. 
 ఇంకా వాల్మీకి మహర్షి పై రాసిన  కవితల పుస్తకం  , కాళోజీ గారిది,, వందే భారతం  పుస్తకాలు జనవరి లో   ఆవిష్కరణ జరుగుతుంది.ఈ అన్ని పుస్తకాలలో నేను భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా భావిస్తాను. 
* ప్రశ్న: మొదటి పుస్తకం ఏది? 
ఇంతవరకు నేను
3నవలలు రాసాను.ఇంకా.2 నవలలు ముగింపు దశలో ఉన్నాయి. 
రెండు వందల కవితలు రాసాను, ముప్పది కథ లు రాసాను.అయితే నా స్వతహాగా పుస్తకం ముద్రించలేదు. 
భవిష్యత్తులో ముద్రించదలిచాను. 
కాని చదవాలనుకునేవారికి నా రచనలు అన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి
*ప్రశ్న: మీ రచనలు యెక్కడెక్కడ ప్రచురణ అయ్యాయి? 
నా రచనలు సాంఘీక మాద్యమాలలో, అంతర్జాల సాహిత్య పత్రిక లలో, పేపర్ లలో వార పత్రిక లలో మాస పత్రిక లలో ప్రచురించబడుతున్నాయి. 
* ప్రశ్న:బహుమతులు, అవార్డులు వేటికి లభించాయి?
ఇప్పటివరకు మూడు పురస్కారాలు అందుకున్నాను ,తెలుగు బుక్ ఆప్ రికార్డ్స్ లో నా పేరు నమోదు, సాహిత్య ప్రహేళిక లలో కూడా పాల్గోన్నాను.
అలాగే  కొన్ని కవిత మరియు కథల పోటిలలో రివార్డులు కూడా వచ్చాయి. 

* ప్రశ్న:మహిళలకు స్వాతంత్ర్యం, ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత వరకు అవసరం? 
మహిళలకు స్వాతంత్రం అంటే
 ఈ రోజు అన్ని రంగాలలోనూ మహిళలున్నారు
 కంపెనీలను  స్థాపించి  ఎంతో సమర్థవంతంగా చాకచక్యంగా వారి బాధ్యతలు నిర్వహిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. కాబట్టి స్వాతంత్ర్యము ఉంది ఆర్థికంగా కూడా మహిళలకు స్వాతంత్రం అలాగే ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా ముఖ్యం, 
ఎందుకంటే ఒక కుటుంబ అభివృద్ధికైనా, దేశ అభివృద్ధి కైనా మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉంటేనే సాధ్యం అవుతుంది .
*  ప్రశ్న:ఇప్పుడు మహిళలకు స్వేచ్చ వుందా? 
మహిళలకు స్వేచ్ఛ ఉంది కానీ అదీ మనము ఉన్నటువంటి స్థలాన్ని బట్టి కుటుంబ పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది ,ఎందుకంటే మెట్రో నగరాలలో ఉన్న ఆడ వారి పరిస్థితి వేరు పల్లెటూర్లలో ఉన్న ఆడ వారి పరిస్థితి వేరు నిజం చెప్పాలంటే కొన్ని కుటుంబాలలో ఇప్పటికీ మహిళల పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు చదువు విషయంలో గానీ ఉద్యోగ విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ, 
కానీ అదే సమయంలో యువతకు స్వేచ్ఛ ఎక్కువై కూడా తప్పు దారిలో వెళుతున్నారు అనే దాంట్లో కూడా సందేహం లేదు. 

* ప్రశ్న:ఎలాంటి స్వేచ్చ కావాలి? 
.మొదటగా లింగ వివక్ష , లింగ బేదం
 ఇవి చూడకుండ వీటి గురించి మాట్లాడకుండా 
బ్రతికేటువంటి స్వేచ్ఛ రావాలి. 



*ప్రశ్న:ప్రేమ, పెళ్లి సంస్కృతి, సంప్రదాయాలపై మీ అభిప్రాయం? 
ఎప్పుడైనా
అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడ్డప్పుడు అలాగే వారి భవిష్యత్తు పై వాళ్లకు అవగాహన ఉండి ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా ఉన్నప్పుడు పెద్దలు సమర్థించి పెళ్లి జరిపితేనే మంచిదని నా అభిప్రాయం ,అలాగే పెళ్లి అనే బంధం చాలా గొప్పది ఇరువురూ ఏకమై నూరు సంవత్సరాలు సాగించే ప్రయాణం, ఇద్దరు మనుషులు మనసుల ప్రయాణమే కాదది రెండు కుటుంబాల ప్రయాణం .ముఖ్యంగా  భార్యాభర్తలిద్దరూ  ఇరువైపులా తల్లిదండ్రులను గౌరవించడం అనేది మన సాంప్రదాయం అదే మన సంస్కృతి అలా రెండు కుటుంబాలు కలిసి ఉన్నప్పుడు అది ఆదర్శవంతమైన కుటుంబం అవుతుంది. 




* ప్రశ్న:ప్రస్తుత వ్యవస్థలో టీవీలు, సినిమాలు, మీడియా, మొబైళ్ళ వల్ల  పిల్లలపై ఏలాంటి ప్రభావం వుంది ?
 
 ఈ ఆధునిక కాలంలో టీవీలు మొబైల్స్ పిల్లల నుండి వేరు చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అది మన జీవితంలో భాగం. మనమే  ఒకరోజులో ఎంతో సమయాన్ని ఫోన్తో గడుపుతున్నాము. ఎందుకంటే ప్రతి పనిలో మొబైల్ ఫోన్ అనేది భాగమైపోయింది ఇంక టీవీలో పిల్లలు చూసే  కార్యక్రమాలు వస్తూ ఉంటాయి వాటిని ఎంచుకుని పెట్టగలిగితే బాగుంటుంది .
సినిమాలు పిల్లలు చూసే సినిమాలు ఉంటాయి అలాగే ఏదైనా సరే పిల్లలకు ఉపయోగపడే విధంగా ఏది వాడిన ఏమి కాదు , ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది... ఈ రోజుల్లో పిల్లలు పెద్దల కంటే కొత్త  విషయాలు నేర్చుకోవడం లో ముందుంటున్నారు. వారికి సృజనాత్మకత పెరుగుతుంది.. అన్ని విషయములలో మన పిల్లలను ముందుంచాలని మనం అనుకున్నప్పుడు వారికి అన్నింటినీ పరిచయం చేయడం తప్పనిసరి, కాకపోతే వారిని కనిపెట్టుకొని ఉండాలి, మంచి చెడు  అర్థం అయ్యేటట్లు చెప్పగలగాలి.
ఏదైనా మితంగా ఉంటే బాగుంటుంది..అతిగా వాడితే  ప్రమాదం. 
* ప్రశ్న: పసి వయస్సు ఆడ పిల్లల వయసు పైబడిన ముసలవ్వ దాకా పైశాచికంగా మృగాల అత్యాచారాలపై మీ స్పందన తెలపండి? 
 అతి క్రూరమైన చర్య అలాంటివి వినిపించినప్పుడు  మనసంతా భారమవుతోంది అలాంటి పనులు చేసిన వారు ఎవరైనా కఠినమైన శిక్ష లకు అర్హులు .
* ప్రశ్న: ఈ ఆధునిక కాలంలో ఎలాంటి మార్పులు కోరుకొంటున్నారు? 
ఆడపిల్లల పై అత్యాచారాలు మనం పేపర్లలో టీవీలలో వినకూడదని ,ఆడపిల్లలు రాత్రయినా పగలైనా ఇంటికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటున్నాను. 
అలాగే ప్రతి ఒకరిలో మానవత్వం పాలు పెరగాలని, కులం, మతం, ఇవన్నీ వదిలేసి అందరం మనుషులం .... మనమంతా ఒక్కటే మన తల్లి ఆ భరతమాత అని మరువకూడదని కోరుకుంటున్నాను. 

* ప్రశ్న: మార్పులు రావాలంటే ఏం చేయాలి?
 
ముందు మహిళల గురించి మాట్లాడితే
మార్పు అనేది ఒక ప్రభుత్వం తోనో లేకపోతే వాళ్ళు చేసే చట్టాలతోనో న్యాయవ్యవస్థ తోనో సాధ్యం కాదు. 
మహిళా సాధికారత కావాలి కావాలి అంటే రాదు. ప్రతి ఒక్కరూ మానసిక సాధికారత సాధించినప్పుడు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు పిల్లల పెంపకం విషయంలో కానీ మనం మన రోజు జీవన విధానంలో మహిళల పట్ల చిన్న చూపు ను వదిలేసి అందరం సమానమే అందరం మనుషులమే అని గుర్తుంచుకొని మానసికంగా ఎదిగినప్పుడు కచ్చితంగా మార్పు అనేది సాధ్యం .
 నేను  నేను అనే స్వార్థం వీడి ఆపద లో ఉన్న వాడికి చేయి అందించి నప్పుడు, 
సాటి మనిషి పై ప్రేమ చూపించి నప్పుడు
జగమంతా కుటుంబం మనదే అవుతుంది
*ప్రశ్న: కొత్తగా సాహితీ బృందావన జాతీయ వేదిక   నిర్వహించే ముఖాముఖిపై మీ అభిప్రాయం ఏమిటీ? 
 సాహితీ బృందావన జాతీయ వేదిక ఇలా ముఖాముఖి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మనం రోజు ఎంతో మంది రచయితలు కవుల యొక్క రచనలను కవితలను చదువుతూ ఉంటాం 
కానీ ఈ విధంగా వారు ముఖాముఖి లో పాల్గొని వారి యొక్క భావాలను మనతో పంచుకోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక్కో ఆలోచన, ఒక్కో శైలి, కొన్ని కొత్త కోణాలను  మనం చూస్తాం ,
అవన్నీ మనం భవిష్యత్తులో ముందడుగు వేయడానికి ఉపయోగపడతాయి.  ఇక్కడ ఎంతో మంది పెద్దలు ,వారి అనుభవాలు 
నా లాంటి వారికి ఎన్నో కొత్త  విషయాలను నేర్పూతాయి, అనుభవానికి మించిన పాఠం మరోటి లేదు. అన్నిటికంటే మంచి మనుషుల సాంగత్యం చాలా గొప్పదని అంటారు కదా ,
ఇక్కడ ప్రతి ఒక్క రచయిత /కవి ఒక పాఠకుడై
ముఖాముఖిలో పాల్గొనటం ఆనందదాయకం. 

* ప్రశ్న:ఈ ముఖాముఖిలో మీరు ఎలాంటి అనుభూతి పొందారు? 
మన సాహితీ బృందావన జాతీయ వేదిక ద్వారా ఇలా మీ అందరితో నా భావాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. 
ఎంతో మంది పెద్దలు అందరికీ నమస్కారాలు నేను ఈ సాహిత్య ప్రపంచంలో ఒక చిన్న అణువంత ,
ఎందుకంటే దీనిలో మెలకువలను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, 
నా సమాధానాలన్నీ మీరు ఓపికగా చదివినందుకు మీకు నా దన్యావాదాలు. 
 ఇంత గొప్ప కార్యక్రమానికి నాంది పలికిన శ్రీమతి నెల్లుట్ల సునీత మేడం గారికి అలాగే సాహితీ బృందావన జాతీయ వేదిక  కార్యవర్గ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. 


కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది 💐💐💐