కష్టమైనా ఎంతో ఇష్టంగానే!;-- దోర్బల బాలశేఖర శర్మ
 'ఈనాడు విలేకరి'గా స్థిరపడటానికి ఆ రోజుల్లో నేను పడ్డ కష్టం, నష్టం, నిష్టూరం వంటివి తలచుకుంటే, ఇప్పుడు నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. యాజమాన్యం ఇచ్చిన అప్పాయింట్ మెంట్ లెటర్ ను ఐడీ కార్డు సైజుకు మడత పెట్టి జేబులో పెట్టుకొని, ఊళ్లో పోలీసు స్టేషన్ మొదలుకొని తహసీలాఫీసు, బ్లాకాఫీసు, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఇంకా వార్తల తాలూకు సమాచారం సేకరించడానికి అవసరమైన ప్రతీ ప్రభుత్వ ఆఫీసుకు కాలినడకన వెళ్లేవాణ్ణి. అప్పుడప్పుడు డివిజన్ స్థాయి సమాచారం కోసం మెదక్ కు కూడా వెళ్ళేవాణ్ణి.
 'నేను ఈనాడు విలేకరిని' అని పరిచయం చేసుకున్నాక దాదాపు ఏ ఒక్క అధికారీ నన్ను ఐడీ కార్డు చూపించమని అడగలేదు. బహుషా, 'ఇలా ఎవరూ అడగరనే' కావచ్చు, నాకు హెడ్ ఆఫీసు వాళ్ళు ఐడీ కార్డును ఆ తర్వాత  (నెల రోజులపాటు నేను వారిని సంతృప్తి పరచదగ్గ స్థాయిలో వార్తలు రాశాకే) ఇచ్చి వుంటారు. తొలి రోజుల్లో ఊళ్లోని అన్ని వాడలూ తిరిగి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాను. వాటిని ఒక్కోటి విడదీసి, ప్రతీ అంశాన్ని పలువురు గ్రామస్తులు, ఊరిపెద్దలు, సామాజిక కార్యకర్తలు, నాయకుల వద్ద విచారించుకొని, మరింతగా కావలసిన అధికారిక, అనధికారిక సమాచారాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల నుండి సేకరించుకునేవాణ్ణి. దీనికి కొన్ని రోజుల సమయం పట్టేది. 
తెల్ల కాగితాలపై రాస్తున్నప్పుడు వాక్య నిర్మాణాలు, శైలీ, శిల్పం, శీర్షిక, లీడ్, ముగింపు వంటి విషయాల పరంగా ఎక్కడైనా తప్పులు వస్తే మళ్లీ మరో కాగితంపై మొత్తం రాసేవాణ్ణి. (అంతేకానీ, కొట్టివేతలను సహించే వాణ్ణే కాదు). మొత్తం రాశాక మరో రెండుసార్లు చదువుకొని, చెప్పాలనుకొన్నది అంతా చెప్పానని అనిపించాకే కాగితాలను ఎన్వలప్ కవర్ స్థాయికి మడత పెట్టి, అడ్రస్ రాసి పోస్టాఫీసు కు వెళ్లి, బరువుకు తగ్గ స్టాంపులు అతికించి ఇచ్చేవాణ్ణి. ఇలా రోజుకు ఒక కవరు, ఒక్కో దానిలో పెద్దదైతే ఒకటి, చిన్నవైతే మూన్నాలుగు వార్తలు పంపేవాణ్ణి. ఒక నోట్ బుక్కులో వార్తకు నేను పెట్టిన శీర్షిక, పంపిన తేదీ రాసుకొనే వాణ్ణి. ఒకవేళ పబ్లిష్ కాకుండా ఏవైనా పెండింగ్ లో వుంటే వాటి గురించి డెస్క్ వారికి గుర్తు చేసేవాణ్ణి.
ఈ క్రమంలో అది పేరుకు పార్ట్ టైమ్ ఉద్యోగమే అయినా ఫుల్ టైమ్ గా పని చేయవలసి వచ్చేది. తాలూకాలోని పక్క ఊళ్లకు వెళ్ళవలసి వచ్చినప్పుడు సైకిల్ అద్దెకు తీసుకొనే వాణ్ణి. కారణం, కొన్ని ఊళ్లకు అసలు బస్సులే లేక పోవడం, ఒకవేళ ఏ ఊరుకైనా ఉన్నా అవి పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. వాటి సమయానికే వెళ్లి రావడం కుదిరేలా వుంటే సరే, లేకపోతే సైకిల్ పై దేవుడిచ్చిన కాళ్ళకు పని చెప్పేవాణ్ణి. ఇలా పదుల కిలోమీటర్లు సైకిల్ తొక్క వల్సి వచ్చేది. బయట దొరికేవి ఏవీ తినకుండా ఇంటికి వచ్చాకే అమ్మ పెట్టింది తినడం. అలా వేళకు తినక పోవడం, ఆకలిని చంపుకోవడం వల్ల కొన్నాళ్లకే కడుపు నొప్పి (అల్సర్) పట్టుకుంది. దాంతో భోజనం టైమ్ కు ఇంటికి వచ్చే ప్రయత్నం చేయడం. 
ఇంత కష్టపడి రాసి పంపిన వార్తను అచ్చులో చూసుకున్నప్పుడు చెప్పలేని సంతృప్తి. సదరు మా ఊరు, పరిసర గ్రామాలు, నియోజక వర్గానికి చెందిన ప్రజాసమస్యలు పరిష్కారమయ్యే వరకూ అధికారులు, నాయకుల వెంట పడేవాణ్ణి. మరోవైపు, అప్పుడప్పుడూ ఇతర పత్రికలకు కథలు, కవిత్వం, ఉత్తరాలు (లెటర్స్ టు ఎడిటర్) రాయడం, అవి నా పేరుతో లేదా కాలం పేర్లతో (గడీల ఛత్రపతి, డిజి ఛత్రపతి) పబ్లిష్ అయినప్పుడు ఆనందించడం మాత్రం మానలేదు. 


కామెంట్‌లు