నాట్యం;-డా.ఎన్. సి.హెచ్ సుధా మైథిలి;-కలంస్నేహం
బ్రహ్మ వర ప్రసాదమై ఇల చేరిన  దివ్య వరం..
లయకారుని పదము చేరి పరిఢవిల్లిన నాట్యవిలాసం..
భరతముని జనితమై భువిని అలరించిన వేద శాస్త్రం..

శృతి,లయ, రాగ సమన్వితం..
సాహిత్య సంగీత సంగమాల సమ్మిళితం..
విజ్ఞాన వినోదముల మిశ్రమం ..
సామాజిక చైతన్య కళలలో అద్వితీయం ..
ఆంగిక వాచిక అభినయాలకు ఆలవాలం.. 

భారతీయ సంస్కృతిలో సింహ భాగం..
సంప్రదాయముల మేళవింపులో అగ్రస్థానం..
సకల లలిత కళల సమాహారం ..

చతుర్వేద సార విరచితమై అవతరించిన పంచమవేదం
 ఛందో విచితి మృదంగ సమన్వితం ..
దృగ్గోచరమై మనసును ,తనువును పరవశింపచేసే మంజీర
పద విన్యాసం..

సహృదయ హృదయాహ్లాదియై మైమరిపించే నవరస శోభితం.

ఆస్వాదించిన వారి హృదయం క్షీరసాగర ఉత్తుంగ తరంగం ..


కామెంట్‌లు