వివేకానందజయంతి;-కృష్ణ వేణి పరంకుశం;-;-కలంస్నేహం
భారతీయ మేరు నగధీరుడు...
విశ్వనాద్ దత్త, భువనేశ్వరి 
దంపతుల ముద్దుల తనయుడు...
జన్మభూమి ఆధ్యాత్మిక,సాంస్కృతిక
కీర్తిపతాకాన్ని విదేశీ వినువీధులలో
ఎగురవేసిన ధీరుడు....
రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు...
మన కర్మభూమిపై అవతరించిన
నరేంద్రనాధుడు.

నిండైన దుస్తులలో....
మెండైన రూపంలో...
దృఢమైన దేహంతో...
ఆత్మవిశ్వాసానికి  ప్రతిరూపంగా నిలిచిన
జాతీయ యువజన నాయకుడు.

యువతకు దిశ నిర్దేశం చేసి
జీవనప్రమాణాలకు కొలమానంగా
నడత... నడకకు.. ఆదర్శంగా
లక్ష్యసిద్ది...స్థిరమనస్సే ఆలంబనగా
దోచుకోలేని జ్ఞానాన్ని లోకానికి పంచిన
యుగపురుషుడు.

ఎండతగలకుండా ఎదిగినవృక్షంలేదు
గుండెనలగకుండా ఎదిగిన మనిషే లేడని
పడిలేచే కేరటాలే మన ఆదర్శమని
నీ  స్పర్శ ఎడారులను సైతం 
కుసుమింప చేయాలని
స్ఫూర్తి వాక్యాలు బోధించిన చైతన్యదీప్తి.

హిందూతత్వం ఒక మతం కాదు
అది మన జీవన విధానం
సకలమతాలు ఒకే సనాతన
ధర్మంలోని అంశాలని...
జీవుడే....దేవుడని తెలియజేసిన
సమున్నత వ్యక్తిత్వానికి సమగ్రరూపం,
సకలసద్గుణ సమాహారం.
సార్వజనీనత, సర్వకాలీనతలు
సమ్మిళితమైన విశ్వకవి
మన వివేకానందుడు.


కామెంట్‌లు