రంగవల్లుల ఆకాశం....;సావిత్రి రవి దేశాయ్;-కలం స్నేహం
నిశి వేళ వెన్నెల వెలుగుల మాటున
మరుగయ్యాయేమో వన్నెల వర్ణాలు
బాల భానుడి లేత కిరణాలు తగలాగానే
మత్తు వదిలించుకొని ఆకాశమంతా
అలుముకున్నాయి రంగుల హరివిల్లులా....
నల్లని కోయిల గళము నుండి జాలువారే
అమృత సింధువులా ఆగపించాయి
చిత్ర విచిత్రంగా నిశి కన్య పెట్టిన రంగవల్లిలా......

అమావాస్య రాత్రి కనుగీటి కవ్వించిన
చుక్కలన్నీ రెక్కలు గట్టుకు వలసపోయాయా...
మేఘాల చాటున దాగి, భువిలోన పువ్వులై విరిసాయా....
రేయంతా తిమిరం చేసే వికటాట్టహాసం,
బాలబానుడి క్రీగంటి చూపులకు
జడిసి మౌన వ్రతం పూనింది..

ఏ అజ్ఞాత చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిందో ఈ రంగుల చిత్రం...
నిన్నటి కన్నీళ్లు, మదిలో బాధలు విషాద జ్ఞాపకాలు ఇంకెన్నో చేదు అనుభూతులు
అన్ని నేటి సప్త వర్ణపు ఆకాశాన్ని గని తోకముడిచి వెళ్ళిపోవాలి
ఉదయించిన నేడు ఎప్పటికి వెలుగులతో కళకళ లాడాలి....


కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
ధన్యవాదాలు 🙏