తాయెత్తు మహిమ!.. అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆవ్యాపారి కష్టపడి డబ్బు కూడబెట్టి హఠాత్తుగా చనిపోయాడు.ఉన్న ఒకే ఒక్క కొడుకు తండ్రి ఉన్నప్పుడు  ఏమీ పట్టించుకోకుండా  తిరిగాడు. హఠాత్తుగా తండ్రి పోటంతో పనివారిమీద ఆధారపడి దిలాసాగా ఉన్నాడు.మొదట వ్యాపారం బాగా  సజావుగా సాగింది. కానీ క్రమంగా నష్టం  డబ్బు రాక ఆర్ధిక ఇబ్బందులతో గిలగిలలాడిపోయాడు. బార్యకూడా ఏమీ పట్టించుకోకుండా కబుర్లు  టి.వి.తో కాలక్షేపం చేసేది.ఇప్పుడు వ్యాపారం పగ్గాలు తన చేతికి రావటంతో  హనుమకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఓజ్యోతిష్కుని సంప్రదించాడు.బావిలో కప్పలాగా బతికి ఇప్పుడు కళ్ళు తెరిచాడు."హు!నాన్న ఎన్ని సార్లు మొత్తుకున్నా నేను  పెడచెవిన పెట్టాను. సిరి కొబ్బరి బొండంలో నీరు లా వచ్చి మాయమైపోతుంది."అని జాతకాలు చెప్పేఆయన వద్ద  మొత్తుకున్నాడు."హనుమా!జరిగింది తల్చుకుంటూ ఏడిస్తే ఏంలాభం?ఈతాయెత్తు నీచేతికి కడుతున్నాను.ఎట్టి పరిస్థితి లోను దీన్ని  తీసి పారేయకు" అని మంత్రించి తాయెత్తు కట్టాడు. "రోజూ ఇంట్లో షాపు లో ప్రతి విషయం పనివారిని గమనించు.వెంటనే పరిష్కారం నీకు దొరుకుతుంది."
సరేనని ఇంటికెళ్లగానే మంచి నీరు తాగాలి అని వంటింటి వైపు నడిచాడు. వంటామె పప్పు బియ్యం చిన్న చిన్న మూటలు కట్టి  చీరకొంగులో ముడేసి నడుంలోకి దోపి  పనైపోయిందని భార్య కు చెప్పి వెళ్లింది.హనుమ అది గమనించాడు. అక్కడి డబ్బాలలో గోధుమపిండి బియ్యం పిండి  అన్నీ బూజుతో పురుగులతో లుకలుకలాడుతున్నాయి.
 వెంటనే నౌకరుని పిలిచి గదమాయించి వాటిని ఎండలో పెట్టించి  దగ్గర ఉండి సర్దించాడు.షాపు లో కూడా నిఘాపెట్టి గుమాస్తా పనికుర్రాడు చేసే మోసాలు గ్రహించాడు.భార్య ను గట్టిగా దబాయించాడు "చూడు!బి.పి.తింటే ఆయాసం తినకుంటే నీరసం అనే పేరు తో టి.వి.కి అతుక్కుపోయి కూచుంటే కుదరదు. వంటామెని మాన్పించాను.ఇంట్లో నేను నీవు  మాఅమ్మ మాత్రమే ఉన్నాం.నౌకరు పని ఆమె మాత్రమే ఉంటారు. నీబద్ధకమే నీరోగం! ఓగంట మాత్రమే టి.వి.చూడు.మా అమ్మ స్వయంగా పూలుకోసుకుని  చెట్లకి నీరు పోస్తోంది.ఈరాలిపోయే వయసులో ఆమె కి కూతురైనా కోడలివైనా నీవే!"అనటంతో మొదట గొణిగినా తరువాత నోరుమూసుకుంది.ఆనెలనించి తాయెత్తు వల్ల తను బాగుపడ్డాననే నమ్మకం హనుమ లో బాగా పెరిగి జ్యోతిష్కుని దగ్గరకు వెళ్లాడు.ఆయన నవ్వుతూ ఇలా అన్నాడు "పిచ్చి వాడా!అది తాయెత్తు మహిమ కాదు.నీకు నమ్మకం కలిగించాలని అలా చెప్పాను.కష్టే ఫలే అన్నారు అందుకే "హనుమ కి బుద్ధి వచ్చింది.మనపని మనం చేసి ఇతరుల కి సాయపడటంలో ఆనందం  తృప్తి  పొదుపు సుమా!🌷
కామెంట్‌లు