బంధం! అచ్యుతుని రాజ్యశ్రీ

 శివబాగా డబ్బున్నవాడు.ఇల్లు వాకిలి పొలం పుట్ర భార్య తో సుఖంగా ఉన్నాడు. పిల్లలు లేరు.తమ్ముడు హరి చదవకుండా సోంబేరిగా తిరిగాడు. తండ్రి పొలంపనిలో పెట్టినా సరిగ్గా చేసేవాడు కాదు. షాపు లో కూచోపెడితే లెక్కలు డొక్కలు తూనికలు  సరిగా చేయలేక ఆపని పోగొట్టుకున్నాడు. శివ భార్య ఉమ చాలా మంచిది. కన్నకొడుకులా చూసేది.కానీ శివ ఆమెకి నీతిబోధచేసి తిట్టాడు "నీవల్ల వాడు సోంబేరిగా తయారు అవుతున్నాడు.కూచోపెట్టి మేపితే ఎందుకూ కొరగాడు."ఆరోజు ఉమ ఖచ్చితంగా హరితో అంది" నీకాళ్లపై నీవు నిలబడు.నీవల్ల మీఅన్న చేత మాటలు పడాల్సివస్తోంది. నా సంసారం గంగ లో కలపకు".అతని చేతిలో ఓ  యాభై రూపాయలు పెట్టింది. భర్త తో అంది"హరికి  ఓమూడురోజులకు సరిపడా డబ్బు ఇవ్వండి.వేరే ఊళ్లో తిండి కి ఖర్చు ఇవ్వండి. "ససేమిరా అన్నాడు శివ. "ఇలా ఐతే వాడు మాటిమాటికీ వచ్చి నాజేబుకి చిల్లి పెడతాడు. వాడు నడుచుకుంటూ పోతాడో స్నేహితుడి ని బతిమాలుతాడో నాకు అనవసరం. నాకు బోలెడు మంది ఫ్రెండ్స్. నన్ను అభిమానం గా చూస్తారు.బంధువుల కన్నా మిత్రులు నయం! చెడి చెల్లి ఇంటికి వెళ్లరాదు.మిత్రుని ఆశ్రయించమని అన్నారు "అని నాల్గు సూటిపోటి మాటలతో భార్య తమ్ముడికి వడ్డించాడు.వదిన ఇచ్చిన డబ్బు  రొట్టెల మూట తో హరి కాలినడకన చిన్న బస్తీ చేరాడు.అక్కడ వాడి బాల్య మిత్రుడు గిరి కూలీపనితో బతుకుతున్నాడు.
 గిరికి ఎవరూలేరు.శివ అమ్మా నాన్న వాడి ని చేరదీసికూడు గుడ్డ ఇచ్చి బడికి పంపారు. ఏడోక్లాస్ దాకా ఆపల్లె బడిలో చదివాడు.హరికి మాత్రం ఆచదువుకూడా అబ్బలేదు."ఒరేగిరీ!మాఅమ్మ నాన్న పోయాక నీకు ఇక మాతో సంబంధం లేదు. నీదారి నీవు చూసుకో "అని శివ తరిమేశాడు.అతని మాటలతూట్లు భరించలేని స్వాభిమానంఉన్న గిరి పనికూలీలతో కలిసి ఆబస్తీ కి చేరాడు.అలా హరికూడా ఇప్పుడు గిరి ఆదరణతో కూలీపనిచేస్తూ చెరిసగం ఖర్చు భరిస్తూ అన్నం వండుకుని కూర పెరుగు కొని బానే రోజులు  దొర్లిస్తున్నారు.గిర్రున నెల తిరిగింది. హరిచేతిలో వెయ్యి రూపాయలు మిగిలాయి. సంక్రాంతి పండుగ వస్తోంది అని హరి గిరి అన్న వదినెలను చూడటానికి బైలుదేరారు.ఊరి మొదట్లోనే ఆఊరి రైతు పలకరించాడు"హరీ!మీఅన్నకి కరోనా వచ్చింది. మీవదిన కూడా బైటకి రావటంలేదు.అక్కడికి వెళ్లవద్దు.మేము ఎవ్వరంకూడా ఆఇంటి గడప తొక్కటంలేదు." ఆమాటలు ఖాతరు చేయకుండా ఊరిలోకి ప్రవేశించారు.ప్రతివారూ వెనుదిరిగి వెళ్లి పొమ్మనే సలహా ఇచ్చారు. గిరి అడిగాడు "మాఅన్నకి బోలెడుమంది స్నేహితులు ఉన్నారు కదా? ఎవరూ దవాఖానాలో చేర్పించలేదా?" "చూడు బాబూ!ఒకప్పుడు బంధువులు చూడకపోయినా మిత్రులు చూసేవారు.నేడు స్నేహానికి కూడా చెదపట్టింది.డబ్బు హోదా ని చూసే స్నేహాలు నేడు! ఆనాటి  కృష్ణ కుచేలుల కాలంకాదు ఇప్పుడు. ద్రోణుడిని అవమానించిన ద్రుపదుల కాలంఇది.నీవు రక్తసంబంధం ఉన్న సొంతతమ్ముడివి.మీవదిన మొహం చూసి అన్నవిషయం చూడు" గిరి వెంటనే అన్నాడు "నాకు రక్త సంబంధం లేకపోవచ్చు కానీ వారి అమ్మా నాన్నల ఉప్పుతిని ఇంతవాడినైనాను.నాలోఆవిశ్వాసం మానవత్వం ఉన్నాయి. తోటివారికి సాయపడటానికి రక్త సంబంధం తో పనిలేదు. తిన్న ఇంటివాసాలు లెక్క బెట్టని మంచితనం ఉంటే చాలు!" ఇక హరి గిరి  అన్న వదినలకు ఎలా తోడ్పడింది రాయనవసరం లేదు. మనందరికీ తెలుసు కదూ!?🌷
కామెంట్‌లు