వార్తలో వార్తనై..;-- దోర్బల బాలశేఖరశర్మ

 మనల్ని వరించి వచ్చిన పని మనకు ఎంతో ఇష్టమైనదైనప్పుడు నేర్చుకోవడం తేలికవడమేకాక అందులో నైపుణ్య సాధన మరింత వేగవంతమవుతుంది. నా విషయంలో ఇదే జరిగింది. అందులో 'ఈనాడు' విలేకరి పని నా వ్యక్తిత్వానికి సరిపోయేలా వుండటంతో దానిపట్ల నా మక్కువ మరింత ఎక్కువైంది. నా ఊరు బాగు కోసం, స్వగ్రామ ప్రజల ప్రయోజనం కోసం పనిచేసే అవకాశం రావడం, అందులో సమాజంలోని అవినీతి, అక్రమాలు, అవకతవకలు, అలసత్వాలు వంటి చెడును ప్రశ్నించే బాధ్యత కావడం వల్ల తొలుత ఎలాంటి వృత్తిగత శిక్షణ పత్రిక నిర్వాహకుల నుంచి లభించక పోయినా నాకుగా నేను శ్రమించి, (చివరకు నాదైన కుటుంబ బాధ్యతను సైతం పక్కన పెట్టి, ఒక రకంగా పట్టించుకోకుండా అనడం కరెక్ట్) నేర్చుకున్నాను.
ఎవరికైనా భవిష్యత్తు కొంతయినా తెలిస్తే, జీవనయానాలు వేరే రకంగా, చాలా సానుకూలంగా వుంటాయేమో. నా చదువుకు తగ్గ మంచి ఉద్యోగం అతి త్వరలో రాబోతున్నదని చూచాయగా తెలిసినా నేను 'ఈనాడు' లో అంత దీర్ఘకాలంగా కొనసాగే వాణ్ణి కాదేమో. ఆ తర్వాత కొద్ది కాలానికే వచ్చినా అది నాకు అక్కర్లేనిదైంది. విధి నిర్ణయం కూడా అదే కాబట్టే, జర్నలిజం వృత్తిలో చక్కగా ఒదిగి పోయాను.  స్థానికంగా ప్రజా సమస్యలు, అధికారుల అవినీతి, రాజకీయ నాయకుల అలసత్వాల గురించిన వార్తలు రాయడంలో పూర్తిగా మమేకమయ్యాను. అది ఎంతగా అంటే, కేవలం దాదాపు తొమ్మిది నెలల్లోనే (1983 June 9) నాపై దారుణ దౌర్జన్యం జరిగేంత! ప్రత్యేకించి, 'ఈనాడు' వంటి పత్రికలో (అప్పట్లో) నూటికి తొంభై శాతం వార్తలు ప్రజోపయోగమైనవే వుండేవి. అందుకే, ఇలాంటి నిఖార్సయిన జర్నలిజాన్ని కత్తిమీద సాము అనేవాళ్ళు. రాస్తే ఒక బాధ, రాయకపోతే వృత్తికి, మనస్సాక్షికి అన్యాయం. 
మా ఇంటి దివాన్ ఖాన (ముందు గది) లో పెద్ద పీట (మంచం అంత పెద్ద సైజులో మంచి కలపతో చేసింది) వుండేది. దానిపై 'సకిలం ముకిలం' (రెండు కాళ్ళు ముడుచుకుని కుదురుగా కూర్చోవడం) పెట్టుకొని, ముందుకు వంగి, కాగితాలపై వార్తలు రాయడంలో పూర్తిగా లీనమయ్యే వాణ్ణి. ఆ సమయంలో 'ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు బయటికి వెళుతున్నారు, అమ్మకేమైనా ఇంటిపనిలో సహాయం చెయ్యాలా, నాన్న పిలుస్తున్నాడా' వంటి విషయాలేవీ నా చెవులకు సోకేవి కావు. పెన్నును ఉంగరం వేలిపై ఒత్తి పెడుతూ రాయడం వల్ల ఆ ప్రదేశంలో ఇంకు అంటినా, చెయ్యి గుంజినా, ఆఖరకు అదే పనిగా ముందుకు వంగడం వల్ల నడుం నొప్పి పెట్టినా పట్టించుకోవడం మానేశాను. ఒక కాగితంలో ఒక్క తప్పు దొర్లినా, (అది అచ్చు తప్పు అయినా, వాక్య నిర్మాణ శైలీ శిల్పమైనా) చివరకు శీర్షిక (హెడ్డింగ్) అనుకున్నట్టు కుదరక పోయినా మళ్లీ మరో కాగితంపై మొత్తం రాసేవాణ్ణి. (చివరకు, వీడు 'ఎవరితోనూ మాట్లాడడు. పిలిస్తే పలకడం, అంతే' అనేంతగా బంధువర్గంలో పేరు స్థిరపడింది). మొత్తం మీద 'ఈనాడు' లో నా జర్నలిజం అనుభవాలను 'నాపై భౌతిక దాడికి ముందు, తర్వాత' అని విభజించుకొనేంతగా మారాయి.

కామెంట్‌లు