కనువిప్పు (కథ) రచయిత సరికొండ శ్రీనివాసరాజు

 

       సోము 9వ తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచీ చదువులో అంతంత మాత్రంగానే ఉండేవాడు. అల్లరి బృందంతో తిరుగుతూ ఆటలతో కాలక్షేపం చేస్తూ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. సోము తల్లిదండ్రులు చాలా పేదవారు. ‌‌కొడుకు చదువుపై కొండంత ఆశ పెట్టుకునేవాడు. ఆ మాటే కొడుకుతో అన్నాడు. "నువ్వు బాగా చదువుకొని పెద్దైన తర్వాత మంచి ఉద్యోగం సాధిస్తే మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి, బాగా చదువుకోరా." అని. 
      సోము మిత్రుడు రంగ. చదువులో అందరి కంటే ముందు ఉండేవాడు‌. సోము ఆటలు మానలేదు. చదువుపై నిర్లక్ష్యం వీడలేదు. సోము మంచి మార్కులు సాధించడం కోసం అడ్డదారులు తొక్కాడు. రంగను బతిమాలి, ఉపాధ్యాయుల కళ్ళు కప్పి, పరీక్షల్లో జవాబులు చూసి రాసేవాడు. ఇంకా మంచి మార్కుల కోసం అడ్డదారులు తొక్కేవాడు. సోము సాధించిన మార్కులు చూసి తల్లిదండ్రులు గర్వపడ్డారు. ఒకరోజు సోము తండ్రి రామయ్య చిన్ననాటి మిత్రుడు తిరుమలేశం ఆ ఊరికి వచ్చాడు. అలా వస్తున్న క్రమంలో రామయ్యను కలిసి గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించాడు. తిరుమలేశం తన కొడుకు శ్రీహరిని రామయ్యకు పరిచయం చేసి, తన కొడుకు ఎప్పుడూ తాను ఉంటున్న పట్టణంలో అన్ని పాఠశాలల విద్యార్థులు అందరిలోనూ ఫస్ట్ అని, భవిష్యత్తులో చాలా పెద్ద ఉద్యోగం సాధిస్తాడని డంబాలు పలికాడు. రామయ్య కూడా తన కొడుకు సోము 9వ తరగతిలో తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి అని, తప్పకుండా గొప్ప చదువులు చదివి, గొప్ప ఉద్యోగం చేసి తమ కష్టాలను తీరుస్తాడు. తమ కష్టాలను తీర్చడానికే మిత్రుల ఇళ్ళకు వెళ్ళి, వాళ్ళతో కలిసి, అక్కడ రోజూ రాత్రి దాకా చదివి, ఇంటికి వస్తున్నాడని, దానికి తగ్గట్లే మంచి మార్కులు వస్తున్నాయని, తప్పకుండా తమ కష్టాలను తీరుస్తాడని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ",శభాష్! నీ కొడుకును కష్టపడి చదివిస్తున్నావు. ఖచ్చితంగా నీ దశ తిరుగుతుంది. నీ కొడుకును చూడాలని, అభినందించాలని ఉంది." అన్నాడు తిరుమలేశు. ",నా కొడుకు ఈరోజు ఆదివారం అని విశ్రాంతి తీసుకోకుండా మిత్రుల ఇళ్ళకు చదువుకోవడానికి వెళ్ళాడు." అన్నాడు రామయ్య. 
       ఆటలకు వెళ్ళి వస్తూ చెట్టు చాటుగా ఈ సంభాషణ వింటున్న సోము చాలా సిగ్గు పడ్డాడు. తాను తల్లిదండ్రులను మోసం చేస్తున్నానని భావించాడు. తల్లిదండ్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దని అనుకొని రంగతో కలిసి కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తూ ఉన్నాడు.

కామెంట్‌లు