ప్రేమలేఖ;-గీత శ్రీ స్వర్గం;-కలం స్నేహం
నా కనులమీనాలు అక్షరాలసెలయేరులో తేలియాడుతూ అటుఇటు చురుకుగా కదులాడుతున్నాయ్..

"ప్రియా!"నీవు పంపిన లేఖలో అక్షరమక్షరము మదికి ప్రియ"మైపోతుంటే

అల్లరిగాలులు ఆగిఆగి తడుముతున్నాయి
"పసి"డి మోమున ఒలుకుచున్న కాంతులను "పసి"గడుతూనే

ఆ"రాధ"నలోని అమృతత్వానికి అర్థం చేయించిన "రాధ" ఆనందానుభూతి నేనైపోతున్నా...
"మురళీ"మోహనుడే పక్కన కూర్చుని మానస"మురళి"ని మీటుతు మురిపాలాడినట్టు

అక్షరవిరులలో ఒంపిన మృదుభావ "పరి"మళాలు మత్తెక్కిస్తున్నాయి..
"పరి"పరి విధముల నను కొనియాడిన అనురాగవర్షంలో తనువెల్లా తడుస్తూ...

నీ మనసు పూర్తిగా చదివిన సఖిని నేను కదా..
నీవంపిన "తెలుపు"కాగితము కూడా వేలభావవర్ణాలను నింపుకుని "తెలుపు"తుందిలే...నేనేనీవని

గ్రీష్మకాలమంత చల్లని "వెన్నెల"సోనలో కరిగిపోయినట్లు
నీ ప్రేమలేఖనందుకున్న తరుణం "వెన్నెల"కొమ్మనై  ఊగుతున్నా పరవశాలపందిరి నీడలో...
ఏమిటో..ఏ"కాంత"మే మధురమై ఈ "కాంత"ను మౌనం ఆవహించెనుగా...


కామెంట్‌లు