వైరం (కథ) రచయిత: సరికొండ శ్రీనివాసరాజు
   మధు, విష్ణు, వాసు మంచి స్నేహితులు. ముగ్గురూ 9వ తరగతిలోకి వచ్చారు. విష్ణు, వాసూలు చదువులో నువ్వా నేనా అన్నట్లు పోటీపడి చదివేవారు. కానీ మధు చదువులో చాలా వెనుకబడే వాడు. వాసు తరచూ మధుకు హితబోధ చేసేవాడు. బాగా చదువుకోమని, చదువుకుంటే కలిగే లాభాలను చెప్పేవాడు. కానీ మధు పెడచెవిన పెట్టేవాడు.
       ఒకరోజు వాసు పని మీద మధు ఇంటికి వెళ్ళాడు. మధు వాళ్ళది నిరుపేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. పూరి గుడిసెలో నివాసం ఉంటున్నారు. అప్పుడు వాసూకి అనిపించింది. మధు కష్టపడి చదివి మంచి ప్రయోజకుడు అయితే వాళ్ళ కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి కదా! అని. మధు వాళ్ళ స్నేహితుని ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాడని తల్లిదండ్రులు చెప్పారు. మరొక రోజు రావచ్చని వాసు బయలుదేరినాడు. దారిలో అల్లరి బృందంతో క్రికెట్ ఆడుతున్న మధు కనిపించాడు. 
       మరునాడు వాసు మధును పిలిపించి ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను మోసం చేస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆటలతో సమయం వృథా చేయవద్దని చివాట్లు పెట్టాడు. "నువ్వెవరు నాకు చెప్పడానికి. నా ఇష్టం." అన్నాడు. మరోసారి మధు వాసు దగ్గరకు వచ్చి, "క్రికెట్ ఆటలో డబ్బులు పోగొట్టుకున్నాను. ప్లీజ్ 500 రూపాయలు ఇవ్వరా?* అన్నాడు. "సిగ్గులేదూ! తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించినా ఇలా డబ్బులు పెట్టి ఆడవు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీకు డబ్బులు ఇస్తే నువ్వు జన్మలో మారవు." అన్నాడు వాసు. మధు వాసుతో మాటలు మానేశాడు.
       మధు విష్ణు వద్దకు చేరి "ఒరేయ్ విష్ణు! మనం ఆ వాసుతో అస్సలు మాట్లాడవద్దురా! ఆ వాసు నన్ను మోసం చేశాడు." అన్నాడు మధు. "ఏం జరిగిందో చెప్పరా?" అన్నాడు విష్ణు. "దారుణమైన మోసం. చెప్పడానికి వీలు లేనిది." అన్నాడు మధు. "అయినా మీ ఇద్దరి మధ్య గొడవ అయితే నేనెందుకు వాసుతో మాట్లాడొద్దు? నువ్వు మాట్లాడకు." అన్నాడు విష్ణు. చిన్నబుచ్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు మధు. మరునాడు విష్ణు వద్దకు చేరి వాసూతో అస్సలు మాట్లాడవద్దని ఒకటే నస. అయినా విష్ణు వినిపించుకోలేదు. చివరికి విష్ణు ఒక షరతు విధించాడు. " నీ మాట ప్రకారం నేను వాసుతో మాట్లాడకపోవడానికి సిద్ధమే. కానీ నువ్వు నేను చెప్పినట్లు విని నాతో కలిసి పట్టుదలతో చదివి మార్కులు పెంచుకోవాలి. ఆటలను ఆపెయ్యాలి. కావాలంటే రోజూ ఒక గంటసేపు నాతో ఆడుకోవచ్చు. సెలవు రోజుల్లో 3 గంటలు ఆడుకుందాం. క్రికెట్ తప్ప చెస్, క్యారమ్, షటిల్ వంటివి ఆడాలి. నువ్వు ఈ షరతుకు ఒప్పుకుంటే నీ మీద ప్రేమతో మరింత పట్టుదలతో చదువుతూ వాసూను మొదటి ర్యాంకు రాకుండా చేస్తా. నువ్వు కూడా ప్రతీ పరీక్షకూ మార్కులలో పెంపుదల చూపించాలి. క్రమంగా పదవ తరగతి వార్షిక పరీక్షల్లో నువ్వు కూడా వాసూను ఓడించవచ్చు." అన్నాడు విష్ణు. ఈ సలహా మధుకు నచ్చింది. విష్ణుకు, వాసుకు పచ్చగడ్డి మధ్యలో వేస్తే భగ్గుమనేంత వైరం ఏర్పడింది.
       ప్రతి పరీక్షలో విష్ణు మొదటి ర్యాంకు వస్తున్నాడు. వాసు ముఖం మార్చుకొని విష్ణుతో మరింత ద్వేషం పెంచుకున్నాడు. తానూ ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళను విష్ణుతో కలవకుండా చేస్తున్నాడు. "మిత్రులారా! మీరంతా నాతో కలిసి చదవాలి. మనం మరిన్ని మార్కులు తెచ్చుకొని అందరం కలిసి విష్ణును చిత్తు చేయాలి." అన్నాడు. వాసు పుణ్యమా అని వాళ్ళ మార్కులు పెరుగుతున్నాయి. కానీ విష్ణునే మొదటి ర్యాంకు వస్తున్నాడు. పదవ తరగతికి వచ్చారు అందరూ. ప్రీ ఫైనల్ పరీక్షల్లో వాసు మళ్ళీ మొదటి ర్యాంకు వచ్చాడు. మధు మూడవ ర్యాంకు వచ్చాడు. మధు విష్ణుతో గొడవ పడ్డాడు. ఎందుకు మొదటి ర్యాంకు రాలేదని. అప్పుడు రాము వచ్చి మధుతో ఇలా అన్నాడు. "నీ కోరిక ప్రకారం విష్ణు వాసుతో మాటలు మానెయ్యడానికి కారణం వాసూనే. తనతో మాటలు మానేసే సలహా ఇచ్చి, దానికి నువ్వు కష్టపడి చదివేలా, ఆటలు మానేసేలా షరతులు విధించే సలహా ఇచ్చింది కూడా వాసూనే. నువ్వు కష్టపడి చదివి, మంచి ప్రయోజకుడివి అయితే నీ తల్లిదండ్రుల కష్టాలు తీరుతాయని అలా చేశాడు." అని. మధు వాసూను చేరి తనను క్షమించమని వేడుకున్నాడు. 
       అప్పుడు వాసు ఇలా అన్నాడు. "నీకు ఎవరితోనైనా వైరం వస్తే అది నీ సమస్యగానే తీసుకోవాలి. కానీ వారికి వ్యతిరేకంగా మరింత మందిని తయారు చేయడం పెద్ద తప్పు. అలాగే ఎవరితోనూ వైరం పనికిరాదు. ఎవరితో అయినా సమస్య వస్తే తప్పు ఎక్కడ ఉందో తెలుసుకొని సరిదిద్దాలి. నువ్వు భవిష్యత్తులో మరింత పట్టుదలతో చదివి, మంచి ఉద్యోగం సాధించి నీ తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలి." అని. మధు సరేనన్నాడు.  


కామెంట్‌లు